మలయాళ నటుడు మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు (Ivory Tusks) ఉన్న విషయం తెలిసిందే. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఇంట్లో ఉంచానని గతంలో న్యాయస్థానానికి ఆయన తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలను కూడా చూపారు. ఏనుగు దంతాల విషయంలో మోహన్ లాల్ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. అయితే, తాజాగా ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్‌లాల్‌కు ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం రద్దు చేసింది. ఏనుగు దంతాల విషయంలో ఇలా అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం.. మీకు నచ్చినట్లు అనుమతి ఎలా ఇస్తారని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.
15 ఏళ్ల నుంచి ఏనుగు దంతాల కేసు మోహన్‌లాల్‌ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. 2012లో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు జతల ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.
అయితే తాను చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో 2016 జనవరి, ఏప్రిల్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది.


