ద్రౌపది

ద్రౌపది


ఐదోవేదం: మహాభారత పాత్రలు - 21

ద్రౌపది ద్రుపదుడి కూతురు. ద్రుపదు డంటే, అత్యంత వైరాగ్యంతో వేగంగా బ్రహ్మపథానికి పురోగమించేవాడని అర్థం. కనక, ద్రుపదుడైన సాధకుడి ఆతృత నుంచి పుట్టుకొచ్చిన దివ్యమైన ఉత్సా హంతో ప్రేరణ పొంది, బ్రహ్మపథానికి సాగే కుండలినీ శక్తే ఈ ద్రౌపది. ఆకాశంలో శక్తి చాలామటుకు కుండలినిగా, అంటే, చుట్టబెట్టుకొని సర్పిలంగా సంచరిస్తూ ఉంటుంది. పరమాణువుల కేంద్రకాల చుట్టూ ఉన్న కర్పరాల్లో తిరిగే ఎలక్ట్రాన్ల రాసనృత్యంలోనూ సూర్యుడూ నక్షత్ర చక్రాలూ ఆకాశంలో విష్ణునాభి అనే పరమ కేంద్రం చుట్టూ పరిభ్రమించడంలోనూ ఇదే కనిపిస్తుంది.



జీవ మూలాణువైన డి.ఎన్.ఎ. కూడా సర్పిలాకారమైన నిచ్చెనగా నిర్మితమై, మెలికలు చుట్టుకొన్న రెండు పాములు నిలువుగా నిలుచున్న ట్టుండే సుబ్రహ్మణ్యేశ్వర రూపంగా ఉంటుంది. చాలా పాలపుంతలు సర్పిలా కారాలే. మానవ శరీరంలోని కుండలినీ శక్తి ఇటువంటి సర్పిలమైన తేజోరూపం. పామును గుప్తమూ శక్తిమంతమూ అయిన విషయానికి గుర్తుగా వాడతారు. అది నేల లోని కన్నాల్లో దాక్కొని ఉంటుంది. వెన్ను కాండం చివర ఉన్న భూమి స్పందనలుండే మూలాధారమనే చోట బయటికి ప్రసరిస్తూ ఉండే ఈ కుండలినీ జీవశక్తినే సర్పశక్తి అని పిలుస్తూ ఉంటారు.



ఇది ఒక సర్పిలాకారమైన దారిగుండా లైంగిక నాడుల్లోకి వెళ్తుంది గనకనే దీన్ని కుండలినీ శక్తి అంటారు. దీన్నే ‘ఇలీబిశం’ అని వేదం వర్ణిస్తుంది: అంటే, ఇలాబిలంలో శయనించి ఉన్నదని అర్థం. ఇలా అంటే భూమి. మూలా ధారంలో ఉన్న సర్పిలాకార మైన దోవలో ఒదిగి ఈ ‘ఇలాబిలశాయి’ నలిగినట్టై ‘ఇలీబిశం’ అయింది.

 

వైరాగ్యానికి నేను నేస్తాన్నంటే నేను నేస్తాన్నంటూ అలవాట్లు వెంటబడి వేధిస్తూ ఆధ్యాత్మిక జీవిత యుద్ధంలో చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ద్రోణుడు ‘నేను నీ నేస్తాన్ని’ అంటూ ద్రుపదుడి దగ్గరికి వచ్చినప్పుడు ‘నువ్వు నాకు సమ ఉజ్జీ కావు’ అని ద్రుపదుడు నిరాకరించడానికి కారణం ఇదే. వైరాగ్యం తీవ్రదశలో ఉన్నప్పుడు, అలవాట్ల హడావిడి చాలా చికాకును తెప్పిస్తుంది. అంచేతనే ద్రుపదుడనే సాధకుడు ద్రోణుడనే సంస్కారాన్ని దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తాడు.



సాధకుడు ప్రాణయజ్ఞాన్నే తన చతురంగ బలంగా చేసుకొని యజ్ఞసేనుడై, తన లోపలి నిబ్బరమైన కాంతితో ‘ధృష్టద్యుమ్నుడై’, అలవాట్ల తలను ఖండించడమే గాక, యుద్ధంలో గెలుపును రాసిచ్చే, తలదిక్కునున్న ‘అహిచ్ఛత్రానికి’, అంటే, అనంతత్వమనే శేషుడే గొడుగుగా ఉన్న ఆత్మ చైతన్య క్షేత్రానికి పురోగమించడం జరుగుతుంది. యజ్ఞసేన ప్రగతి వల్ల యాజ్ఞసేని అయిన కుండలినీ శక్తి మేలుకొని ‘అహిచ్ఛత్రానికి’, అంటే, సహస్రారానికి సాగుతుంది.

 

కుండలిని అంటే చుట్టుముట్టుకొన్న పాము అని చెప్పుకొన్నాం. పాము శక్తికి గుర్తు. ఈ శక్తిని తప్పుగా ఉపయోగించినవాడు విషమెక్కి చచ్చిపోతాడు; దీన్ని సరిగ్గా ఉపయోగించినవాడు చైతన్య సామ్రాజ్యాన్ని ఏలతాడు. ఆడదాని జడను పాముతో పోలుస్తూ ఉంటారు. అది కొప్పుగా చుట్టుకొని తలమీద ఉన్నప్పుడు, ఒబ్బిడిగా అదుపులో ఉన్న శక్తికి ప్రతీక అవుతుంది. అది విరబోసుకొని ఉన్నప్పుడు, కట్టుబాటుకు దూరమై, బయటికి ప్రసరిస్తూ దుబారా అయిపోతూన్న ప్రాణశక్తికి ప్రతీక అవుతుంది. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని, ఈడ్చుకొని వస్తూ ఆవిడ జుట్టును విరబోసినట్టు చేశాడు. ఈ విధమైన పరిస్థితి అహంకారమనే రాజు పరిపాలనకు గుర్తు.



ఈ పరిపాలనలో మూలాధారశక్తి ఎప్పుడూ కలవరపడుతూ ఉంటుంది; అది తప్పుడు వినియోగానికి గురి అయి, ఇంద్రియాల అదుపులేని కోరికలకు బలి అయి ఖర్చైపోతుంది. కోరిక రూపుడైన దుర్యోధనుడు అసహ్యంగా తన ఎడమ తొడమీది గుడ్డను తీసి వికటంగా చూడడం దీని పర్యవసానమే.

 ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు: దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గరబెట్టుకొని, దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడి కిచ్చాడు. పాంచాలమంటే ‘పంచానాం అలం’ - ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం.



ఉత్తర పాంచాలమంటే యోగ భాషలో వెనుబాములోని పైచక్రాలు; దక్షిణ పాంచాలమంటే, కింది మూడు చక్రాలూను. పైకేంద్రాల్లో పనిచేసే ప్రాణశక్తీ చైతన్యాల సూక్ష్మబలగాలు వెనుబాములో చివర ఉండే మూలాధార కేంద్రం గుండానే భౌతిక రూపాల్ని దాలుస్తాయి. ఈ రూపాలు, మూలాధారమూ స్వాధిష్ఠానమూ మణిపూరమూ అనాహతమూ విశుద్ధమూ అనే ఐదు కేంద్రాల్లో పనిచేసే భూమీ నీరూ అగ్నీ వాయువూ ఆకాశమూ అయిన ఐదు మూలకాల స్పందనల వల్ల ఏర్పడతాయి.



ప్రాణశక్తి మూలాధారం నుంచి బయటికి ప్రవహిస్తూ మాంస దేశాన్నీ ఎముకల ప్రదేశాన్నీ రక్తమార్గాల్నీ వగైరా వగైరా అన్ని భాగాల్నీ సృష్టిస్తూ పోషిస్తూ పదార్థం ఐదు రూపాల్లో అవుపిస్తుంది. ఆత్మరాజు పరిపాలనలో మూలాధారంలో ఉన్న కుండలినీ ప్రాణశక్తి ప్రశాంతంగానూ అదుపులోనూ ఉంటూ రాజ్యానికి ఆరోగ్యాన్నీ అందాన్నీ శాంతినీ ఇస్తాయి. గాఢమైన ధ్యానంలో ఈ శక్తి లోపలికి మళ్లి, పైచక్రాల వైపుకు వెళ్తూ ఆత్మరాజ్యాన్ని ప్రకాశింపజేస్తుంది.



కుండలినీ శక్తి పైకి ఐదు పద్మాల, లేక, చక్రాల గుండా వెళ్లడమంటే, ద్రౌపదికి ఐదుగురు పాండవులతో పెళ్లి కావడమనీ ద్రౌపదేయులు పుట్టడమనీ అర్థం. ద్రౌపదేయులంటే ద్రౌపదికి పాండవుల వల్ల పుట్టిన పిల్లలు. వీళ్లు ప్రతి కేంద్రంలోనూ ఆయా కేంద్రాలకు లక్షణాలై అవుపించే రూపాలూ కాంతులూ ధ్వనులూను. ఈ కాంతుల మీదా ధ్వనుల మీదా తన దృష్టిని కేంద్రీకరించి యోగి, దివ్యమైన విచక్షణను పొంది, మనస్సు తోనూ దాని సంతానంతోనూ, అంటే కామమూ క్రోధమూ లోభమూ మోహమూ మదమూ మాత్సర్యమూ - అంటే, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ కర్ణుడూ శకునీ శల్యుడూ కృతవర్మా - మొదలైన ఆవేశ రూపాలతో పోరాడగలిగే శక్తిని ప్రయోగించగలుగుతాడు.



పాండవులు లక్కింటి నుంచి బయటపడి గూఢంగా ద్రుపదుడి నగరంలో స్వయం వరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు వాళ్లను గుర్తించడాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ‘పంచాభి పద్మానివ వారణేంద్రాన్ భస్మావృతాం గానివ హవ్యవాహాన్’ (ఆదిపర్వం 186-9) అంటూ పాండవుల్ని ఐదు సూక్ష్మ పద్మాల్లాగా ఐదు అగ్నుల్లాగా చెప్పడం మనం పైన చెప్పుకొన్న వివరణానికి పాదుగా ఉంది.

 ఈవిధంగా ద్రౌపదికి ఐదుగురు పతులుండడాన్ని అర్థం చేసుకోవాలి.



ఒక స్త్రీకి ఐదుగురు మొగుళ్లుండడాన్ని జీర్ణించుకోలేనివాళ్లు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ఆవిడ తండ్రికే అది ఎబ్బెట్టనిపించింది. దాన్ని పోగొట్టడానికి వ్యాసుడు అతనికి ద్రౌపది మునపటి జన్మకథను చెప్పాడు: ఒక తపోవనంలో అతిరూపవతి అయిన ఒక ఋషికన్యకు పతి లభించలేదు. ఆవిడ శివుణ్ని ఉద్దేశించి తపస్సు చేసింది. శివుడు ఎదురుగా అవుపించి, వరాన్ని కోరుకోమన్నాడు. ఆవిడ ‘నాకు సర్వగుణసంపన్నుడైన పతిని ప్రసాదించ’మంటూ ఐదుసార్లు అడిగింది. ‘మరో శరీరంలో నీకు ఐదుగురు పతులు లభిస్తారు’ అని చెప్పి శివుడు అంతర్ధాన మయ్యాడు.



ద్రుపదుడు ఈ కథను విని ‘దేవో హి వేత్తా పరమం యదత్ర’ (ఆదిపర్వం 197-3) అంటూ దీనిలోని రహస్యం దేవుడే ఎరుగునంటూ విస్తు పోతూనే పెళ్లిచేశాడు. ఆ రహస్యం మనం పైన చెప్పుకొన్నదే.

 ద్రౌపదికి ‘కృష్ణా’ అనే పేరు ఉంది. అంటే, శ్యామల వర్ణం కలదని అర్థం. శ్రీకృష్ణుడు భూమిభారాన్ని తగ్గించడానికి వచ్చేటప్పుడు అర్జునుడితో పాటు ఈ‘కృష్ణ’ను తనకు సాయం చేసే చెల్లెలిగా తెచ్చుకొన్నాడు. ఈవిడ వల్లనే పద్దెనిమిది అక్షౌహిణులు ఒకచోటికి చేరి నాశనమై పోయి భూమికి పట్టిన అధర్మభారాన్నీ అయోగభారాన్నీ తీర్చగలిగాయి.



అగ్నివేది నుంచి పుట్టింది గనక, ఆ ‘కృష్ణవర్త్ముడి’, అంటే, అగ్ని మాదిరిగానే తనవైపుకు గుంజి కాల్చే శక్తిగలిగిన అగ్నిరూపమే ఈవిడ. సభలోకి తనను రమ్మనమని పిలవడానికి ప్రాతికామి వచ్చినప్పుడు, ద్రౌపది వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పడం ఎవరిచేతా గాలేదు: ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా’ అనే ఈ ప్రశ్నకున్న సమాధానమే ఆవిడ దాసి కాలేదని నిరూపించింది. భీష్ముడంతటి మహాధర్మవేత్తే దీనికి జవాబు చెప్పడం చాలా కష్టమంటూ చేతులెత్తేశాడు: అంటే, అంతటి కురువృద్ధుడు కూడా రాజుగారి మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో నన్న భయాన్ని కనబరిచాడన్నమాట.



వికర్ణుడు ధృతరాష్ట్రుడి కొడుకే అయినా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే సభలో ఉన్నవాళ్లందరూ నరకానికి వెళ్ల వలసివస్తుందని హెచ్చరిస్తూ ‘ధర్మరాజు జూదం మైకంలో పడి ధూర్తులైన జూద గాళ్లు పురిగొల్పడంతో ఒళ్లుమరిచిపోయి, ద్రౌపదిని పందెంగా కాశాడు. ఆమె పాండవులైదుగురికీ సమానం. ఒక్క ధర్మరాజుకే భార్య కాదు ఆవిడ. అదీగాక, తనను ముందు పణంగా పెట్టి ఓడి పోయిన తరవాతనే శకుని మాటల్లోపడి, ద్రౌపదిని ఒడ్డాడు ధర్మరాజు. ఈ విషయాల్ని పరిశీలిస్తే, ద్రౌపదిని గెలుచు కున్నామనడం తప్పే’ అని నిగ్గుదేల్చాడు.



విదురుడు ఆమీద ఇలాగే తన నిష్కర్షని కరాఖండీగా చెప్పాడు: ‘తన శరీరాన్ని మొదటే ఓడాడు గనక, ఆమీద ద్రౌపదిని పణంగా పెట్ట డానికి అతనికి హక్కెక్కడిది? అధికారి కానివాడు పందెంగా పెట్టినదాన్ని గెలవడం గానీ ఓడడం గానీ కలలో డబ్బు గెలవడంతో గానీ ఓడడంతో గానీ సమానం’. అప్పుడు ధృతరాష్ట్రుడి అగ్ని శాలలో నక్కలు చొరబడి ఊళలు కూశాయి; గాడిదలు దూరి ఓండ్ర పెట్టాయి. ఈ అపశకునాల్ని చూసి గాంధారీ విదురుడు చెప్పగా, అంతదాకా ‘ఏమేమి గెలిచార’ంటూ ఆత్రుతను చూపించిన ధృతరాష్ట్రుడు మొదటికే మోసం వచ్చేలాగ ఉందని, ద్రౌపదిని పిలిచి వరాలనిచ్చి పాండవులను దాస్యం నుంచి విముక్తపరిచాడు.

 

చెయ్యకూడని పనుల్ని చేశారు గనకనే కౌరవులు మూకుమ్మడిగా మూల్యం చెల్లించవలసివచ్చింది. దుర్యోధనుడు కండకావరం కొద్దీ ఏకవస్త్ర అయిన వదినను సభలోకి తీసుకొని రమ్మనడమూ ఆమెను తన తొడమీద కూర్చోడానికి నిస్సిగ్గుగా పిలవడమూ కర్ణుడు ప్రేరేపిం చగా దుశ్శాసనుడు ఆమె బట్టల్ని ఊడ దీయడానికి ప్రయత్నించడమూ సైంధ వుడు, వనంలో ఈవిడ ఒక్కతే ఉన్నప్పుడు కామించి ఎత్తుకొని పోవడమూ - మొదలైనవన్నీ తక్కువ తప్పులేమీగావు. అవి మూలాధారంలోని శక్తిని ఉద్వేగపరిచి అశాంతిని కలగజేస్తాయి.



సింహబలుడని పేరున్న కీచకుడికీ ద్రౌపది వల్ల పరాభ వాన్ని చవిచూడడమే కాదు నికృష్టమైన చావును కూడా కౌగిలించుకోవలసి వచ్చింది. చెడ్డపని దానికదే పరిహారాన్ని చెల్లించమని ఎదురొచ్చి అడుగుతుంది. పాపిష్ఠులు వాళ్లకు వాళ్లే తమను శిక్షించు కుంటారు. ఆ శిక్షే భీమసేనుడి నోట భీకరమైన శపథంగా రూపొందింది.

- డా॥ముంజులూరి నరసింహారావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top