ద్రౌపది 2 మూవీలో నటించేందుకు హీరో రిచర్డ్ రిషి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన ద్రౌపది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కిస్తున్నాడు.
ఈ నెలలో రిలీజ్
నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించాడు. రక్షణ హీరోయిన్‌గా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.
నెల రోజుల్లో షూటింగ్ పూర్తి
ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత చోళ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి కథతో సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్ జి ఈ కథతో వచ్చారన్నాడు. సినిమా షూటింగ్‌ను 31 రోజుల్లో పూర్తి చేశారని తెలిపాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నిర్వహించేవారని పేర్కొన్నాడు.
ఆయన లేకపోతే ఈ సినిమా లేదు
దర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. ఇది పీరియాడికల్ కథా చిత్రం అని చెప్పాడు. ద్రౌపది సినిమాలాగే ఈ మూవీకి కూడా అంతే సిన్సియర్‌గా పని చేశామన్నాడు. హీరో రిచర్డ్ రిషి లేకపోతే ఈ సినిమా లేదన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని వెల్లడించాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని గుర్తు చేశారు.
బడ్జెట్ దాటిపోయింది
ముందు అనుకున్న బడ్జెట్‌ను దాటిపోయినా సరే కథపై నమ్మకంతో సపోర్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపాడు. ద్రౌపది మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సీక్వెల్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 25 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరకు రక్షణను ఎంపిక చేశామన్నాడు. ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభ ప్రదర్శించారన్నాడు. రక్షణకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు.


