ఒక్క రూపాయి లంచం | Baby gives one rupee bribe to Police man | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి లంచం

Aug 24 2014 1:31 AM | Updated on Sep 2 2017 12:20 PM

ఒక్క రూపాయి లంచం

ఒక్క రూపాయి లంచం

దాదాపు పాతికేళ్ల క్రితం నాటి అనుభవం ఇది. అవి నేను శ్రీకాళహస్తి సబ్ జైల్లో పనిచేస్తున్న రోజులు.సబ్ జైలు గేటు ఎదురుగా మునిరాజా అనే ఆయన ఇల్లుంటుంది.

తపాలా: దాదాపు పాతికేళ్ల క్రితం నాటి అనుభవం ఇది. అవి నేను శ్రీకాళహస్తి సబ్ జైల్లో పనిచేస్తున్న రోజులు.సబ్ జైలు గేటు ఎదురుగా మునిరాజా అనే ఆయన ఇల్లుంటుంది. ఎదురు బొదురు కావటంతో మాకూ వాళ్లకూ సత్సంబంధాలుండేవి. అతని చిన్నకూతురు అయిదేళ్ల పాప ఒకరోజు స్కూలుకు పోనని మారాం చేస్తోంది. ఆ సమయంలో నేను గేట్లోకి ఎంటరవుతున్నాను. నన్ను చూసిన మునిరాజా భార్య, ‘‘అన్నా! ఈ పిల్ల బడికి పోనని గోల చేస్తోంది. దీన్ని జైల్లో పెట్టన్నా’’ అంటూ ఆ పాపను నా దగ్గరకు తీసుకొచ్చింది. నేను కూడా, ‘‘బడికి పోమ్మా! లేకపోతే లోపల దొంగల పక్కన వేస్తాను’’ అన్నాను అలాగైనా భయపడుతుందని! కానీ, ఆ పాప ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. బడికి పోనంటే పోనని గట్టిగా చెప్పింది. ఇక లాభం లేదనుకొని చేయి పట్టుకుని లోపలకు తీసుకుపోయి వేపచెట్టు మొదట్లో అరుగుమీద కూర్చోబెట్టి మరలా అడిగాను. అయినా ససేమిరా అంది.
 
 ‘‘సరే! ఇలాగే కూర్చో. పది నిమిషాల్లో వచ్చి నిన్ను లోపలేస్తాను’’ అని చెప్పి ఆఫీసులోకెళ్లాను. నా సీట్లో కూర్చుని ఆ పాపనే గమనిస్తూ కూర్చున్నాను కిటికీలోంచి.ఆ పాప ఏదో ఆలోచిస్తూ స్కర్ట్ జేబు తడుముకొని కూర్చుంది. పది నిమిషాల తరువాత పాప దగ్గరకెళ్లాను. ఆ పాప ధైర్యంగా లేచి నిలబడి, ‘‘సార్! ఇదిగోండి. నా దగ్గర రూపాయుంది. మా అమ్మోళ్లు కొనుక్కోటానికిచ్చారు. ఇది తీసుకుని నన్ను విడిచి పెట్టండి’’ అంటూ రూపాయి బిళ్ల తీసి నాకివ్వబోయింది. అప్పుడు అదిరిపోవడం, హతాశుణ్ని కావటం నావంతయింది. ‘లంచమా! నీకు జోహార్లు. నీ విశ్వరూపం చూపిస్తూ పసిపాపల మనసుల్లోకి కూడా జొరబడిపోయావు. ఇక నిన్నెవరూ నిర్మూలించలేరు’ అనుకుంటూ పక్కనున్న కానిస్టేబుల్ని పిలిచి, ఆ పాపను ఇంటి దగ్గర వదిలి రమ్మన్నాను. ఆ రోజంతా నా మనసెంతో వ్యాకులమైపోయింది.
 - అయినాల కనకరత్నాచారి
 కోరిశపాడు, ప్రకాశం

 
 స్నేహం ఒక వరం
 నాలుగు నెలల క్రితం మా అబ్బాయి పెళ్లి జరిగింది. అంతకుముందు మూడు నెలల నుండి ఇంటి రిపేర్లు, పెయింటింగ్ పనులు, ఎంగేజ్‌మెంట్, పెళ్లి పనులతో బిజీగా ఉన్నాను. పెళ్లిలో అన్నిటికన్నా కష్టమైనది, విసుగ్గా ఉండేది, కాని తప్పించుకోలేనిది కార్డులు పంచడం! ఆఖరు పెళ్లి కదా అని దూరాభారం అనుకోకుండా బంధువులను ఆహ్వానించాను.
 
 పెళ్లిరోజు వచ్చింది. అన్నీ సమయానికి జరగాలి. తొందరగా పెళ్లి మంటపానికి వెళ్లాలి. హడావిడిగా పనులన్నీ పూర్తిచేసుకుని లైట్‌గా టిఫిన్ చేసి మందు లేసుకున్నా. ఆహ్వానించిన మిత్రులు, బంధువులు అందరూ వచ్చారు. నిర్ణయించిన సమయానికి పెళ్లి జరిగింది. తర్వాత నేను అతిథులను పలకరిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం రెండైంది. డైనింగ్ హాల్లో ఒక బంధువుతో మాట్లాడుతూ ‘‘భోజనాలు బావున్నాయా?’’ అని అడుగుతున్నాను.
 
 ఇంతలో పక్క నుండి, ‘‘ఐస్‌క్రీమ్ తింటావా జ్యోతి?’’ అని వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే నా ఫ్రెండ్. అప్పటికి కానీ నాకు ఆకలి గుర్తు రాలేదు. డయాబెటిస్ వల్ల షుగర్ లెవల్స్ తగ్గడం ప్రారంభమైంది. కాళ్లు వణకడం మొదలైంది. పెళ్లి పనుల హడావిడిలో పడి, నేనే ఆ విషయం గమనించుకోలేదు. సరే ఇమ్మన్నాను. మాట్లాడుతూనే ఐస్‌క్రీమ్ తినేశా. కాస్సేపటికి తేరుకున్నా. అప్పుడు కాని అర్థం కాలేదు, అతను ఎందుకు ఐస్‌క్రీమ్ మాత్రమే తింటావా అని అడిగాడని. ఐస్‌క్రీమ్ వల్ల షుగర్ లెవల్స్ తొందరగా పెరిగిపోతాయి. ఆ తర్వాత నా పనుల్లో పడిపోయా. కాని రాత్రి ఇంటికొచ్చిన తర్వాత, కూర్చుని ఆలోచిస్తే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. టైమ్‌కి తినకుంటే నాకు సీరియస్ అవుతుందని నా ఆరోగ్యం గురించి ఆలోచించాడే! తనకు నేను చేసిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. స్నేహం, అభిమాన తప్ప. ఆ టైమ్‌లో నేను మనసులో చెప్పుకున్నది ఒక్కటే... గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్!
 - జ్యోతి వలబోజు
 హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement