తిరుమలాధీశుడు విష్ణువే! | Sakshi
Sakshi News home page

తిరుమలాధీశుడు విష్ణువే!

Published Sun, Apr 15 2018 12:30 AM

Another historic event on the way to Ramanuja - Sakshi

రామానుజ మార్గంలో మరో చరిత్రాత్మక ఘట్టం.. తిరుమలాధీశుడు శివుడు కాడని, మహావిష్ణువని నిర్ధారించిన ప్రక్రియ. పండిత వాదనా పటిమ. తిరుమల తిరుపతి తమిళ పేర్లు. తిరుపతి అంటే శ్రీపతి, తిరుమల అంటే శ్రీకొండ లేదా శ్రీశైలం. శ్రీ వేంకటాచలానికి తమిళ పేరు తిరువేంగడం. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమైనారని ఆనాటి నారాయణవనం రాజు యాదవుడు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదలి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో కొందరు శైవులు ఆ మూలమూర్తి శివుడనీ, విష్ణువు కాదని, శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగకపోతే రాజ్యానికి అరిష్టమని రాజు చెవిని ఇల్లుకట్టుకుని పోరు పెట్టారు. యాదవరాజు ఈ అంశాన్ని పరిశీలించాలని అనుకున్నారు. అందుకొక విస్తారమైన చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తిరుమలేశుడు శివుడో కేశవుడో ప్రమాణాలతో నిరూపించాలని చాటింపు వేయించాడు. తమ మాటను నమ్మి శైవక్షేత్రంగా మార్చుతాడేమో అనుకుంటే రాజు చర్చాగోష్టి పెడతాడని శైవపండితులు ఊహించలేదు. శైవ క్షేత్రమని రుజువు చేయడానికి పురాణాల్లో ప్రమాణాలు వెతకనారంభించారు. రామానుజులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. తమ వాదాన్ని కూడా వినాలని యాదవరాజును కోరారు. ఆయన సరేనన్నారు. మరునాడు శైవులు వాదన ప్రారంభించారు. ఇక్కడ పుష్కరిణి పేరు స్వామి పుష్కరిణి, కనుక దానికి దక్షిణాన నెలకొన్న స్వామి సుబ్రహ్మణ్యస్వామి అని వాదించారు. స్వామి అనే పేరు కుమారస్వామికి గాక మరెవరికీ లేదన్నారు. వామన పురాణంలో వేంకటాచలం విశేషాలను వివరించారని ప్రమాణం చూపారు. స్కందుడు తారకాసురుడిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి ఏది అనువైన ప్రదేశమని అడిగితే విష్ణు క్షేత్రాలలోకెల్లా పవిత్రమైన తిరుమలకు వెళ్లమని సూచించాడు. స్కందుడు అక్కడికి వెళ్లే సమయానికే వాయుదేవుడు తపస్సు చేస్తున్నాడు. తపోభంగిమ కనుక స్కందుని చేతులలో యుద్ధకాలపు వీరుడికి ఉండే ఆయుధాలేవీలేవు. ఆయన కురులు జడలుకట్టి ఉన్నాయి. విష్ణువే అయితే ఆయన చేతిలో శంఖ చక్రాలు మొదలైన విష్ణు లక్షణాలైన ఆయుధాలు ఉండాలి అవేవీ లేవు. రెండు భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. విష్ణువుకు నాగాభరణాలు ఎప్పుడూ లేవు. బిల్వదళాలతో పూజలు అందుకుంటున్నాడు. విష్ణువుకు తులసీ దళాలే కాని బిల్వదళాలు శివుడికీ శివపరివారానికనీ, కనుక  తిరుమలలో విష్ణువు కాదని, స్కందుడని వాదించారు. 

విష్ణువు కోసమే స్కందుడు తపస్సు
రామానుజుడి వాదన: శైవ పండితులు ప్రస్తావించిన వామన పురాణాన్నే రామానుజుడు ఉటంకిస్తూ అందులోని 14వ అధ్యాయం ప్రకారం వేంకటాచలం విష్ణుక్షేత్రాల్లోకెల్లా పవిత్ర క్షేత్రమని ఉంది. స్వామి పుష్కరిణికి దక్షిణాన ఉన్నది వరాహ రూపంలో ఉన్న విష్ణుదేవాలయమే. వరాహపురాణంలోనే వేంకటాచలం వరాహ వాసుదేవ దివ్యధామమని కూడా ఉంది. వేంకటాచల మహత్మ్యంలో ధరణి వరాహస్వామి మధ్య సంభాషణ రూపంలో ఈ ప్రస్తావన ఉంది. పద్మపురాణంలో 24.1వ అధ్యాయంలో కూడా ఈ విషయమే వివరించారు. గరుడపురాణంలో 63వ అధ్యాయంలో అరుంధతీ వశిష్టుల సంభాషణలో, బ్రహ్మాండపురాణంలోని భృగు నారదుల మధ్య సంభాషణలో విష్ణు క్షేత్రమని స్పష్టంగా ఉంది. ఇన్ని పురాణాలు ధ్రువీకరించిన సత్యం ఇది. శ్రీనివాసునికి, వరాహమూర్తికి మధ్య జరిగిన సంభాషణ భవిష్యోత్తరపురాణంలో ఉంది. ఈ కల్పాంతం వరకు హరి శ్రీనివాసుని రూపంలో ఈ వేంకటాచలంపైన ఉంటారని, కుమారస్వామి చేత పూజలను అందుకుంటారని, శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహం చేసుకున్నారని, ఆ వివాహమహోత్సవానికి వరాహ స్వామిని, భూదేవిని ఆహ్వానించారని కూడా ఉంది. స్కందుడికి ముందుగా ఒక ముఖమే ఉందని తరువాత కృత్తికల పోషణలో ఆయన షణ్ముఖుడై పన్నెండు భుజాలను సంపాదించాడని ఉంది. ఇక్కడ ఒకే ముఖం నాలుగు భుజాలు ఉన్న మూర్తి స్కందుడని ఎలా చెప్పగలరని రామానుజుడు ప్రశ్నించాడు. తపస్సు కోసం వెళ్లినాడు కనుక స్కందుడు ఆయుధాలు వదిలేశారని శైవ పండితులవాదం కాని వనవాసానికి వెళ్లిన రామలక్ష్మణులు గానీ, పాండవులు గానీ ఆయుధాలు వదిలినట్టు ఎక్కడా లేదు కదా. అదీగాక వామన పురాణం 22, 23వ అధ్యాయాలలో స్కందుడు తపస్సు చేయడానికి వెళ్తూ వెంట తన అన్ని ఆయుధాలు తీసుకువెళ్లినట్టు స్పష్టంగా ఉంది. బిల్వదళాలతో పూజించడం వల్ల స్కందుడనే వాదం కూడా చెల్లదు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించే స్తుతి కూడా ఉంది, తులసి వలె బిల్వం కూడా విష్ణు ఆలయాలలో పూజలకు వినియోగిస్తారని రామానుజులు వివరించారు. వరాహ పురాణం మొదటి భాగం, అధ్యాయం 45, విభాగం 13లో వేంకటాచలానికి దశరథుడు వచ్చి శ్రీనివాసుని దర్శించారని, ఆ సమయానికి రుషులెందరో విష్ణువు గురించి తపస్సు చేస్తూ బిల్వదళాలతో అర్చించినట్టు పేర్కొన్నారు. 

ఇక జడలు కట్టిన కేశాలు శివుడికి మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. విష్ణువుకు అనేక అవతారాల్లో జడలు కట్టిన విస్తారమైన శిరోజాలు ఉన్నాయని చెప్పారు. వేంకటాచలానికి వచ్చేనాటికి విష్ణువుకు కురులు జడలు కట్టాయని ఆ పురాణంలో ఉంది. పద్మపురాణం అధ్యాయం 26 మూడో భాగంలో నాగాభరణాలు చిత్రించిన వస్త్రాలను ధరించినట్టు ఉంది. అందులోనే అధ్యాయం 27 నాలుగో భాగంలో జడలు కట్టినకేశాలతో ఆయన ఉన్నట్టు, తరువాత 33వ అధ్యాయం 10వ భాగంలో అవన్నీ త్యజించి సౌమ్యరూపానికి మారినట్టు కూడా ఉంది. భవిష్యోత్తరపురాణంలో శ్రీనివాసుని వివాహ సందర్భంలో ఆకాశరాజు అల్లుడికి నాగాభరణాలను బహూకరించినట్టు ఉంది. బ్రహ్మాండపురాణం రెండో అధ్యాయంలో ఆదిశేషుడు సందర్భాన్ని బట్టి పడకగా, ఛత్రంగా, ఆసనంగా, ఆభరణంగా మారతాడని ఉంది.  భవిష్యోత్తర పురాణంలో అనేక శ్లోకాలు శ్రీనివాసుడు నాగాభరణాలు ధరించిన సందర్భాలను వివరించాయి. స్వామి వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంది. హృదయంపై లక్ష్మీదేవి ఉంది. కనుక నారాయణుడు కాక మరెవరూ కాదని రామానుజులు వివరించారు. ప్రస్తుత శ్రీనివాసుని భంగిమలోనే నారాయణుడి రూపం ఉండేదని వామనపురాణంలోని 24వ అధ్యాయం పేర్కొన్నది. ఈ వేంకటాచలం ఒకనాడు వైకుంఠంలోని క్రీడాపర్వతం. గరుడుడే దీన్ని మోసుకుని వచ్చాడు. కనుక ఇది గరుడాచలమనీ వైకుంఠ గిరీ అని అన్నారు. శృతి స్మృతులలో కూడా విష్ణుక్షేత్రమనే నిర్ధారించారు. రుగ్వేదం ఎనిమిదో అష్టకం ఎనిమిదో అధ్యాయం 13వ విభాగంలో కూడా ఈ విషయమే స్పష్టంగా ఉంది. ఇన్ని ప్రమాణాలతో రామానుజుడు నారాయణతత్వాన్ని నిర్ధారించిన తరువాత యాదవరాజుకు ఇంకేం మిగలలేదు. 

‘‘యాదవరాజా మరొక అంశం. ఇది శైవక్షేత్రమని వాదించడానికి శైవపండితులు పుష్కరిణి పేరును ప్రస్తావించారు. అది స్వామిపుష్కరిణి కనుక అది కుమారస్వామిదే అన్నారు. పుష్కరిణికి స్వామి అని పేరు రావడానికి దాని పక్కన కుమార స్వామి తపస్సు చేసినందుకే అయి ఉండవచ్చు. స్వామి అంటే యజమాని, పెద్దవాడు అని కూడా అర్థం, పుష్కరిణులలో కెల్లా గొప్పది అయినందున స్వామి పుష్కరిణి అని కూడా అని ఉండవచ్చు. స్వామి అన్న పదానికి సంస్కృతంలో ఉన్న అర్థాలు సరిపోయేది శ్రీమన్నారాయణుడికే. ఎందుకంటే ఈ సకల విశ్వాన్ని సృష్టించి, పోషించే స్వామిత్వం ఆయనకే ఉంది కనుక. పుష్కరిణి తీరాన బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు తపస్సు చేశారని వామనపురాణంలో ఉందని చెప్పారు. కుమారస్వామి కూడా అక్కడే తారకాసుర సంహారం వల్ల కలిగిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి తండ్రి శివుడి సూచన మేరకు తపస్సు చేసారనీ శైవ పండితులే చెప్పారు. తిరుమల క్షేత్రంలో ఉన్నది స్కందుడైతే కుమారస్వామి తన గురించి తనే తపస్సు చేశాడనా? కుమారస్వామి విష్ణువు గురించి తపస్సు చేశారనడం అన్ని విధాలా సమంజసం కదా’’ అని రామానుజుడు వివరించారు.

ఇంక వాదించడానికి ఏమీ లేదని యాదవరాజుకు అర్థమైపోయింది. ‘‘రామానుజముని లేవనెత్తిన ఈ అంశాలకు మీ దగ్గర ఏదయినా ప్రతివాదన ఉందా’’ అని యాదవరాజు అడిగారు. 
దానికి శైవులు.. ‘‘రామానుజాచార్యులవారు తిరుమలలో నెలకొన్నది స్కందుడు కాదని శివుడు కాదని చెప్పారు. కాని విష్ణువనడానికి రుజువులేమిటి? ఈ భంగిమలో ఎక్కడైనా విష్ణువు నిలబడినట్టు ఉందా? చేతిలో ఆయుధాలు లేవు. భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. చతుర్భుజుడే. పైనున్న రెండు హస్తాలు ఖాళీగా ఉన్నాయి. ఒక హస్తం పాదాలను చూపిస్తూ ఉంటే మరొక హస్తం నడుము మీద వేసి ఉంది. ఇది విష్ణు లక్షణమని ఏ విధంగా చెప్పగలరు? స్కందుడు, శివుడు కాకపోతే హరిహరుడవుతాడేమో గాని విష్ణువు కాడు. ఎందుకంటే ఇద్దరి లక్షణాలు పాక్షికంగా ఉన్నాయి కనుక..’’ అని కొత్త వాదాన్ని ఆవిష్కరించారు. 

‘హరిహరుడో కాదో తేల్చవలసింది రామానుజులవారే’ అని యాదవరాజు అన్నారు.‘ప్రపంచంలోని ప్రతి అంశంలోనూ విష్ణు అంశం కొంత ఉంటుందని భగవద్గీత పదో అధ్యాయంలో ఉందని, కనుక స్కందునిలో మహదేవునిలో కూడా విష్ణు అంశ ఉంటుంది.  స్కందుడు రోజూ మూడు సార్లు పుష్కరిణిలో స్నానం చేసి, వాయు సమక్షంలో నారాయణుని గూర్చి తపస్సు చేసేవాడని స్పష్టంగా వామనపురాణం 21వ అధ్యాయం రెండో భాగంలో ఉంది. శ్రీనివాసుని ఆరాధించడానికి కుమార ధారిక నుంచి స్కందుడు (సుబ్రహ్మణ్యస్వామి) వచ్చేవాడని నిర్ధారించిన పురాణాల్లోనే తొండమాన్‌ చక్రవర్తి తిరుమలలో విష్ణుమూర్తికి ఆలయం నిర్మించాడని కూడా ప్రస్తావించారు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు రుషులు పుష్కరిణి దక్షిణాన యజ్ఞాలు, తపస్సులు చేశారని, వారిని కరుణించి విష్ణువు ప్రత్యక్షమైనాడని శృతులలో ఉంది.  స్కందుడు రాకముందే శివుడు తిరుమలకు దిగువన కొలువైనాడని, నారాయణుని గూర్చి కొండపైన తపస్సు చేయాలని స్కందుడికి శివుడే చెప్పినట్టు శైవ పండితులే పురాణాలను ఉటంకించారని, వరాహ పురాణం 29వ అధ్యాయంలో శ్రీనివాస అష్టోత్తర శతనామ స్తోత్రంలో ‘తిరుమల కొండ దిగువన శివుడు తలపులలో తపస్సులో ఉన్న నారాయణా’ అని కూడా ఉందని,  కనుక తిరుమలేశుడు శ్రీనివాసుడైన నారాయణుడు కాక హరుడు కాని హరిహరుడు కాని మరోదైవం కానీ అయ్యే అవకాశమే లేదన్నారు.

‘శైవపండితులు ఇంకేమయినా వాదించదలచుకున్నారా’ అని యాదవరాజు అడిగారు.సాధికారికంగా ఇన్ని పురాణాలను ఉటంకిస్తూ రామానుజముని వాదించిన తరువాత, తర్కబద్ధంగా లక్షణాలను వివరించిన పిదప ఇంక మేమేం చెప్పగలం. అయితే రామానుజుని వాదాన్ని మేము అంగీకరించినా ఆ తిరుమలదైవం అంగీకరించాడని చెప్పగలిగితే మేం పూర్తిగా సంతుష్టులమవుతాం అని మరో ముడి వేశారు. వాదోపవాదాలలో పూర్తిగా పరాజయం పొందిన తరువాత ఇంకా తగాదా కొనసాగించాలని చూడటం సమంజసం కాదని యాదవరాజు కొంత కోపాన్ని ప్రదర్శించారు. రామానుజుడు మాత్రం ఈ శైవుల వాదాన్ని మరింత ఖండితంగా తొలగించి శాశ్వతంగా ఈ వివాదాన్ని నివారించాలని అనుకున్నారు. ‘సరే మనం శ్రీవారి ఆలయంలో శివ విష్ణుమూర్తులకు సంబంధించిన ఆయుధాలను ఉంచి తలుపులు వేద్దాం. మరునాడు స్వామి ఏ ఆయుధాలను స్వీకరిస్తారో చూద్దాం’ అన్నారు. యాదవరాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణ్వాయుధాలయిన శంఖ చక్రాలను, శంకరుడి హస్తభూషణాలైన త్రిశూల డమరుకాలను ఆనందనిలయంలో ఉంచారు. మరునాడు వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే శ్రీనివాసుడు శంఖ చక్రాలు ధరించి దర్శనమిచ్చారు. రాజు ప్రణమిల్లినాడు. రామానుజుని శిష్యుడైనాడు. యాదవరాజు తీర్పును శాసనంగా ప్రచురించమని కోరారు. గర్భాలయ విమానమైన ఆనందనిలయాన్ని పునరుద్ధరించి, వైఖానస ఆగమ విధానాల ప్రకారం వైష్ణవారాధనా విధాన క్రమాలను స్థిరీకరించారు. (రామానుజుని శిష్యుడు ఈ వాదోపవాదాల సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన అనంతాళ్వాన్‌ రచించిన శ్రీవేంకటాచల ఇతిహాసమాల ఆధారంగా)
- రామానుజ మార్గం 

Advertisement
Advertisement