కటింగ్ అప్పుడే మొదలైంది! | Sakshi
Sakshi News home page

కటింగ్ అప్పుడే మొదలైంది!

Published Sat, Feb 27 2016 11:52 PM

కటింగ్ అప్పుడే మొదలైంది! - Sakshi

ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది.
 
ఆధునిక కాలంలోనూ వాడుకలో ఉన్న పురాతన వస్తువుల్లో కత్తెర ఒకటి. ప్రాచీన ఈజిప్టులో కత్తెరల వాడుక క్రీస్తుపూర్వం 1500 ఏళ్ల నాడే మొదలైంది. అప్పట్లో పలచని లోహపు రేకును మధ్యకు వంచి, రెండువైపులా పదునైన చాకుల్లా ఉండేలా తయారు చేసేవారు. అప్పటి కత్తెరలను అడకత్తెరలా అరచేత్తో నొక్కాల్సిందే తప్ప వేళ్లతో తేలికగా ఆడించేందుకు రింగుల పిడి ఏర్పాటు ఉండేది కాదు.

అప్పట్లో వాడే కత్తెరలకు మధ్యన వంచిన భాగం స్ప్రింగులా ఉపయోగపడేది. మధ్యయుగాల్లో కత్తెరల తయారీ కాస్త పరిణామం చెందింది. ఇనుము లేదా ఉక్కుతో రెండు చాకులను విడివిడిగా తయారు చేసి, తేలికగా కదిపేందుకు వీలుగా వాటి మధ్యలో స్ప్రింగు అమర్చేవారు. అయితే, రింగుల పిడితో విడివిడిగా ఉన్న రెండు చాకులతో ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్‌కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది.

ఆ కంపెనీ ద్వారా తొలిసారిగా ‘332’ ట్రేడ్‌మార్కుతో బ్రాండెడ్ కత్తెరలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రకరకాల పరిమాణాల్లోని కత్తెరలు రకరకాల అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చినా, వాటి డిజైన్‌లో పెద్ద మార్పు రాలేదు. కత్తెరలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత శస్త్రచికిత్సలు చేయడం తేలికైంది. దుస్తుల తయారీ సహా ఫ్యాషన్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. వంటింటి అవసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు రకరకాల కత్తెరలు విరివిగా ఉపయోగంలోకి వచ్చాక ఇవి మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారాయి.

Advertisement
Advertisement