
బ్లేడ్ పట్టి శస్త్రచికిత్సలు చేస్తున్న రోబోలు
భారత్‌లో ఇప్పటికే 1,50,000 సర్జరీలు పూర్తి
విదేశాల నుంచీ మన దేశానికి రోగుల రాక
రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో ఆపరేషన్ థియేటర్‌లో డెలివరీ చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో సన్నివేశం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమాల్లోనే కాదు.. వాస్తవ ప్రపంచంలోనూ రోబోలు సర్జరీలను చకచకా చేస్తున్నాయి. అన్నింటా మనం అన్నట్టు ఈ విషయంలో భారత్ సైతం
తగ్గేదేలే అంటోంది.
వైద్య పరిశ్రమ అంచనాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకు రోబోలు సహాయకులుగా 1,50,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు జరిగాయి. అంతేగాక పూర్తిగా రోబోటిక్ శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు మన వైద్యులు. ప్రస్తుతం మన దేశంలో 1,000 మంది సర్జన్లు ఏటా 12,000 కంటే ఎక్కువ రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యంవేయక మానదు.
విదేశీ రోగులకూ సేవలు..
ఫలితాలను అంచనావేసే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యక్తులనుబట్టి చికిత్సా మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని, ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలను మెరుగుపర్చడం, రోగనిర్ధారణ కచ్చితత్వం ద్వారా శస్త్రచికిత్సా విధానాల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ పెంచుతోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స సమయాలను ఏఐ దాదాపు 15 శాతం తగ్గించగలదని అంటున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల కోసం వచ్చే విదేశీ రోగులకు గమ్యస్థానంగా భారత్ అవతరిస్తోంది.
యూఎస్, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే వైద్య ఖర్చులు మనదగ్గర కనీసం 50 శాతం తక్కువ. అమెరికా, యూకే, నైజీరియా, కెన్యా, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా నుండి ఎక్కువ మంది రోగులు భారత్‌కు వస్తున్నారు. భారతదేశ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం రూ.7,830 కోట్లకుపైగా ఉంది. 2030–31 నాటికి దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని అంచనా.
సంక్లిష్ట విధానాల్లో సౌలభ్యం
గుండెకు సంబంధించినవి, క్యాన్సర్ (ఆంకాలజీ), ఆర్థోపెడిక్స్, వెన్నెముక, నరాల సంబంధమైనవి, జీర్ణాశయం, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ వంటి సంక్లిష్టమైన ప్రక్రియల కోసం రోబోటిక్ శస్త్రచికిత్సలను ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. వివిధ రకాల సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సంప్రదాయ పద్ధతులకు మించిన సౌలభ్యం, కచ్చితత్వం, నియంత్రణను రోబోటిక్స్ అందిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శస్త్రచికిత్సా వ్యవస్థలలో.. భారత్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నది ‘డా వించీ సర్జరీ విధానం’. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ద్వారా సుమారు 8 లక్షల సర్జరీలు జరిగాయట. మనదేశంలో నిర్వహించే అత్యంత సాధారణ క్లినికల్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థలో కెమెరా ఆర్మ్, శస్త్రచికిత్సా పరికరాలతో కూడిన యాంత్రిక చేతులు (మెకానికల్ ఆర్మ్) ఉంటాయి. శస్త్రచికిత్స చేసే టేబుల్ పక్కన కంప్యూటర్ కన్సోల్‌లో కూర్చుని ఈ యాంత్రిక చేతులను సర్జన్ నియంత్రిస్తారు. త్రీడీ వ్యూలో పెద్దగా, అధిక స్పష్టతతో శస్త్రచికిత్స చేపట్టే భాగాన్ని ఈ కన్సోల్ చూపుతుంది.
మెరుగైన ఫలితాలు..
అత్యవసరం కాని శస్త్రచికిత్సలకు రోబోటిక్స్ విభిన్న ప్రయోజనాలను అందించగలవని వైద్యులు అంటున్నారు. గాయం చుట్టుపక్కల కణజాలాలకు నష్టం తగ్గించేలా శస్త్రచికిత్సను కచ్చితంగా నిర్వహించడం ఇందులోని ప్రత్యేకత. రోబోటిక్స్‌తో మరో ప్రయోజనం ఏమిటంటే మరింత నియంత్రణ, స్పష్టంగా చూసే వీలు ఉండడంతో సంక్లిష్ట, వీలుకాని భాగాలనూ చేరుకోవచ్చు. అధిక సామర్థ్యం, శస్త్రచికిత్స తదనంతరం ఖర్చులు తగ్గడం, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటం, ఔషధ మోతాదు తగ్గడం తదితర ప్రయోజనాలు ఉండడంతో ఈ ప్రక్రియ దేశంలో క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.
ఖరీదైన వ్యవహారమే
రోబోటిక్ సర్జరీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి చేయాల్సిన ముందస్తు పెట్టుబడి ఆసుపత్రులకు ఆందోళన కలిగిస్తోంది. రోబోటిక్ సర్జరీలలో చార్జీలు కేసును బట్టి.. ప్రధానంగా శస్త్రచికిత్స రకాన్ని బట్టి మారతాయి. డా వించీ రోబోటిక్ సర్జరీకి అవసరమైన యంత్ర పరికరాల విలువ సుమారు రూ.14 కోట్ల నుంచి గరిష్ఠంగా 20 కోట్ల వరకు ఉంటుందట.
వార్షిక నిర్వహణ వ్యయాలు రూ.87 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ప్రశ్నార్థకమేనని చెబుతున్నాయి. ఎస్‌ఎస్ ఇన్నోవేషన్ ్స ఇంటర్నేషనల్, మెరిల్ లైఫ్ సైన్సెస్, రిలయన్ ్స ప్రమోట్ చేస్తున్న యాడ్‌వర్బ్ టెక్నాలజీస్, మెడ్‌ట్రానిక్ వంటి కంపెనీలు ఈ అడ్డంకిని తొలగించడానికి భారీ అడుగులు వేస్తున్నాయి.
అయితే రోబోటిక్ సర్జరీలపట్ల ప్రజల్లో అవగాహన పరిమితంగా ఉండడం, సమగ్ర బీమా కవరేజ్ లేకపోవడం వల్ల రోగులకు అధిక భారం పడుతోంది. సుమారు 70 శాతం తక్కువ ఖర్చుతో సంప్రదాయ పద్ధతుల్లో శస్త్ర చికిత్సలకు వీలుండడం ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రోబోటిక్ సర్జరీలు పెరుగుతుండడం గమనార్హం.
రెండో స్థానంలో దక్షిణాది..
దేశంలో సర్జికల్ రోబోల వినియోగంలో ఉత్తర భారతదేశంలోని ఆసుపత్రుల వాటా 35 శాతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ–ఎన్ సీఆర్ ఈ విషయంలో ముందుంది. ఆ తర్వాతి స్థానంలో 30 శాతం వాటాతో దక్షిణ భారతం నిలిచింది.