బ్రెయిలీలో స్వైన్‌ఫ్లూ అలర్ట్ | swine flu alert in brailey | Sakshi
Sakshi News home page

బ్రెయిలీలో స్వైన్‌ఫ్లూ అలర్ట్

Mar 20 2015 11:44 PM | Updated on Sep 2 2017 11:09 PM

బ్రెయిలీలో స్వైన్‌ఫ్లూ అలర్ట్

బ్రెయిలీలో స్వైన్‌ఫ్లూ అలర్ట్

అందర్నీ వణికిస్తున్న పేరు... స్వైన్ ఫ్లూ! దీనిపై అవగాహన లేక కొంతమంది... సమయానికి వైద్యం అందక మరికొంత మంది... ఏదైతేనేం...

అందర్నీ వణికిస్తున్న పేరు... స్వైన్ ఫ్లూ! దీనిపై అవగాహన లేక కొంతమంది... సమయానికి వైద్యం అందక మరికొంత మంది... ఏదైతేనేం... రోజూ ఎక్కడో అక్కడ దీనిబారినపడి ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. దీనిపై ప్రజలను చైతన్యం చేసేందుకు సాధ్యమైనన్ని మాధ్యమాలనూ ఉపయోగిస్తున్నారు. కళ్లున్నవారు సరే... మరి చూపులేని వారి పరిస్థితి ఏమిటి? దీని గురించి వారు లోతుగా తెలుసుకొనే మార్గం ఏది? ఈ ఆలోచనే వచ్చింది ‘నైటింగేల్స్ హోమ్ హెల్త్ కేర్’ సంస్థకు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టింది. స్వైన్‌ఫ్లూ సంబంధించిన సమాచారం, అవగాహన కల్పించేందుకు తొలిసారిగా బ్రెయిలీ లిపిని ఎంచుకుంది. ఈ లిపిలో కరపత్రాలు విడుదల చేసింది. బేగంపేట్ దేవనార్ అంధుల పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం వీటిని పంచింది.
 
‘దేశవ్యాప్తంగా ఉన్న అంధులకు రోజు రోజుకూ విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూపై బ్రెయిలీలో అవగాహన కల్పించడం తక్షణ కర్తవ్యంగా భావించాం. బెంగళూరులో 1996 నుంచి సేవలందిస్తున్నాం. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో బ్రాంచ్ ప్రారంభించాం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు డాక్టర్లు, 30 మంది నర్సులు ఉన్నారు. ఏ వ్యాధితో బాధపడుతున్న రోగులైనా సరే... ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోలేని పరిస్థితిలో ఉంటే వారికి సేవలందిస్తాం’ అన్నారు నైటింగేల్స్ తెలంగాణ, ఏపీ ప్రాంతీయాధికారి సుధాకర్.  
 
 మంచి ప్రయత్నం...
 ‘ఈ మధ్య స్వైన్‌ఫ్లూ బారిన పడి ఎంతో మంది మరణించారు. దీని తీవ్రత ఇంకా తగ్గలేదు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఇలా బ్రెయిలీలో కరపత్రాలు అందించడం అభినందనీయం’ అన్నారు దేవనార్ స్కూల్ వ్యవస్థాపకుడు ఆలంపూర్‌సాయిబాబాగౌడ్.
 
 చాలా తెలుసుకున్నాం...
 బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ వేసుకోవాలని, ఎప్పుడూ చేతులు శుభ్రంగా
 ఉంచుకోవాలని... జ్వరం, వాంతులు, దగ్గు వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కరపత్రంలో పేర్కొనడం వల్ల స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోగలిగాం. ఈ సూచనలు పాటిస్తే ఈ వ్యాధి దరి చేరదని మాస్టార్లూ చెప్పారు. మా లిపిలో కరపత్రాలు విడుదల చేయడంవల్ల ఎన్నో విషయాలు మా అంతట మేము తెలుసుకోగలిగాం... అంటూ సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు శివారెడ్డి, గేయని, అశ్విని.  
 నిఖితా నెల్లుట్ల
 ఫొటో:జి.రాజేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement