ప్రకృతి పొదరిల్లు తలకోన

తలకోన జలపాతం


* 270 అడుగుల నుంచి జాలువారే జలపాతం

*  ఎత్తయిన కొండలు, పక్షుల కిలకిల రావాలు,  గలగల పారే సెలయేరు

*  పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న గిల్లతీగ

*   పవిత్ర స్నానాలకు నిలయం శిరోద్రోణి తీర్థం

*  సంతాన ప్రదాత సిద్ధేశ్వరస్వామి

తలకోన.. రాయలసీమలోనే అతి సుందర పర్వత,  పర్యాటక ప్రాంతం. దట్టమైన అడవి. 270 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం. చల్లని గాలికి గలగల శబ్ధం చేస్తూ తలలూపే వృక్ష సమూహాలు.. పక్షుల కిలకిలరావాలతో నిండి ప్రకృతిలో మమేకమైన అందాల హరివిల్లు. కమనీయ దృశ్యాలే కాదు.. ఇదో వనమూలికల ఔషధాలయం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొం దించే సిద్ధేశ్వరుడు సంతాన ప్రదాతగా విరాజిల్లుతున్నాడు. ఈ మలయమారుతాల్ని ఆస్వాదించి సేదతీరాలంటే నేత్రమనోహరమైన ప్రకృతి పొదరిల్లును సందర్శించాల్సిందే..



 పీలేరు(చిత్తూరు), న్యూస్‌లైన్: తలకోన అందాలను వీక్షించే పర్యాటకులను సహజసిద్ధంగా 270 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది. తల కోనకు వచ్చే పర్యావరణ ప్రేమికులు ఈ జలపాతంలో స్నానమాచిరించి ప్రత్యేక అనుభూతిని పొందుతా రు. ఏడాది పొడవునా ఇక్కడ జలపాతం ప్రవహిస్తూనే ఉం టుంది. వర్షాకాలంలో మరింత ఉద్ధృతంగా ఉంటుంది.



 రామలక్ష్మణుల వృక్షాలు...

 తలకోన శిరోద్రోణి తీర్థం (వాటర్ పాల్స్, ఝరి)కి వెళ్లే దారిలో రామలక్ష్మణుల మామిడి వృక్షాలు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై సంచరించారనడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు భక్తుల నమ్మకం.


 సుందరమైన నెలకోన...


 శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో జలపాతం మార్గంలో సుందరమైన నెలకోన ఉంది. నెలకోన ప్రాంతం నేత్ర మనోహరంగా ఉంటుంది. నెలకోనలో అంతు తెలియని విధంగా 20 అడుగుల ఎత్తు నుంచి కొండల నడుమ చిన్న జలపాతం ఉంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చుట్టూ ఎత్తయిన  పర్వతాల నడుమ హృదయాన్ని పులకరింపజేసే లోయ ఉంది.



 తలకోనకు ఇలా వెళ్లాలి..

 తలకోనకు తిరుపతి, పీలేరు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో తలకోన ఉంది. భాకరాపేట నుంచి 26 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

 

 


 తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయం

 తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దం లో వనం అప్పస్వామి దీక్షితులు (సిద్ధి యోగి) నిర్మించి నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సిద్ధయోగులు, మునులు తపస్సు చేసి కైలాస అధిపతి శంకరుని అనుగ్రహం పొందారని ప్రతీతి. దీంతో సిద్ధ యోగులు శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి సంకల్పించారు.



  బోటింగ్, చిల్డ్రన్స్ పార్క్....

 తలకోనకు వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించాలనే సంకల్పంతో అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో బోటింగ్ ఏర్పాటు చేశారు.  ఇందుకోసం ప్రత్యేకంగా తలకోన ఏటిలో బోటింగ్‌కు అనువుగా కొలనులు ఏర్పాటు చేశారు. అలాగే చిన్నపిల్లల ఆటవిడుపు కోసం  చిల్డ్రన్స్ పార్క్ ఉంది. మరోవైపు అటవీ అందాలను వీక్షించే పర్యాటకుల కోసం ప్రత్యేక వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ పర్యాటకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి.



 


గిల్లతీగ

 భారత దేశంలోనే అరుదైన, అత్యంత పొడవైన గిల్లతీగ తలకోనలో చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఝరికి వెళ్లే మార్గంలో కుడివైపు నెలకోన మార్గంలో గిల్లతీగ ఉంది. దీని శాఖోపశాఖల పొడవు 5 కిలోమీటర్లు, చుట్టు కొలత 260 సెంటీమీటర్లు, దీని కాయలు 100 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. దీని బెరడును కొన్ని మందుల తయారీకి వినియోగిస్తారు. తీగ జాతుల్లో గిల్ల్లతీగ అత్యంత పొడవైనదిగా అటవీశాఖ గుర్తించింది.

 

 


వసతి

 నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 12 గదులు  ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్‌కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాఖాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ  అందిస్తోంది.


  కనుమరుగైన కెనపీ వాక్

 డార్జిలింగ్ తర్వాత తలకోనలో అటవీశాఖ  కెనపీ వాక్ (చెట్లపై నడక) సౌకర్యాన్ని  అందుబాటులోకి తెచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అటవీ అధికారులు దీనిని నిర్మించారు. కెనపీ వాక్ ఏర్పాటుకు అత్యంత పొడవైన జాలరి చెట్లను ఆధారంగా చేసుకున్నారు. 240 మీటర్లు పొడవునా భూమికి 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కెనపీ వాక్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేది. అయితే కెనపీ వాక్ వల్ల జాలరి చెట్లు శిథిలమయ్యే ప్రమాదం పొంచి ఉండడంతో ఏడాది క్రితం అటవీ అధికారులు దీన్ని తొలగించారు.

 


శిరోద్రోణి తీర్థం

 తలకోన శేషాచల పర్వతంలో ఉంది. శ్రీశైలం వద్ద పర్వత చివరిభాగం ఉండగా, తలకోన, తిరుమల గిరిలు శేషాచల పర్వతాల తలభాగంగా ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఎడమవైపు భాగంగా శిరోద్రోణి తీర్థంగా (ఝరి), కుడివైపు తిరుమల వద్ద పాపవినాశంగాను ఈ తీర్థంలో భక్తులు తరిస్తుంటారు. శిరోద్రోణి తీర్థానికి వెళ్లే దారిలో అటవీశాఖ స్నాన ఘట్టాన్ని ఏర్పాటు చేసింది. శిరోద్రోణికి వెళ్లలేని పెద్దలు, చిన్నారులు ద్రోణితీర్థం నుంచి పారే గంగా జలం లో స్నానమాచరించి శివుని దర్శించుకుంటారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top