సైఫాబాద్ ప్యాలెస్

సైఫాబాద్ ప్యాలెస్


ఇదో అందమైన రాజ భవనం. ఎత్తై గేట్లు... భారీ గోడలు... ముచ్చటైన నిర్మాణం. అచ్చం లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను తలపించే భవనం... సైఫాబాద్ ప్యాలెస్. దాని వెనుకనున్న కథ ‘సిటీ ప్లస్’కు ప్రత్యేకం.

 

సైఫాబాద్ ప్యాలెస్‌ను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీపాషా తన నివాస గృహంగా నిర్మించాలనుకున్నాడు. లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఇది ఉండాలని ఆయన భావించాడు. ఇంతకీ నగరంలో ఇది

ఎక్కడుందనేగా..! రాష్ట్ర సచివాలయంలోని ‘జి’ బ్లాకే సైఫాబాద్ ప్యాలెస్. ఈ ప్రాంతం సైఫాబాద్‌లో ఉంది కాబట్టి ‘సైఫాబాద్ ప్యాలెస్’గా మారింది.సచివాలయానికున్న ప్రధాన ద్వారాలు, ఎత్తై నీలి రంగు ఐరన్ గేట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లను తలపిస్తాయి. అయితే ప్రధాన రహదారిపై వచ్చిపోయే భారీ వాహనాల దృష్ట్యా నేడు ఈ గేట్లు దాదాపుగా మూసివేశారు. ఆరో నిజాం ఈ ప్యాలెస్‌లో ఒక్కరోజు కూడా ఉండకపోవడం విశేషం. ఆయన పురానా హవేలీలోనే నివాసముండేవాడు. ఆ క్రమంలో తన సంస్థానంలోని ఆర్థిక విభాగానికి ఈ భవనాలను కేటాయించారు.

 

అపశకునంతో వెనక్కి...

ఓసారి నిజాం ప్రభువు స్వల్ప అస్వస్థతతో బాధపడుతుంటే... ఆస్థాన హకీంలు (వైద్యులు) హుస్సేన్‌సాగర తీరాన అక్కడి ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని సలహా ఇచ్చారు. దాంతో నిజాం 1887 ప్రాంతంలో ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేపట్టాడు. నిజాం ఒక రోజున తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి నిర్మాణంలో ఉన్న ప్యాలెస్‌ను చూద్దామని బయల్దేరాడు. ప్యాలెస్ సమీపిస్తుండగానే ఏనుగు అంబారీపై కూర్చున్న నిజాంకు ఏదో అశుభ సూచకం ఎదురొచ్చింది. ఇంకేముంది... ఆనాటి జ్యోతిషులు నిజాం పురానా హవేలీని వదలడం మంచిది కాదని జోస్యం చెప్పారు. దాంతో నిజాం తన ప్యాలెస్ మార్పునకు స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ భవనాలను ఆర్థిక మంత్రి సర్ అక్బర్ హైద్రీ

కార్యాలయం కోసం కేటాయించారు.నిజాం ఆస్థానంలోని ప్రధాన మంత్రి కూడా తన సాధారణ పరిపాలనా శాఖను ఈ ప్యాలెస్ నుంచే నిర్వహించాడు. స్వాతంత్య్రానంతరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి తరంలోని ఆరుగురు ముఖ్యమంత్రులు తమ అధికార కార్యకలాపాలను ఈ ప్యాలెస్ నుంచే నిర్వహించారు. అయితే 1978లో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించాక ముఖ్యమంత్రి కార్యాలయాలను ప్రస్తుతమున్న సి-బ్లాక్‌కు తరలించారు. ముఖ్యమంత్రిగా ఎన్‌టీ రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులో తన కార్యాలయం నిర్వహించారు. నేడు ప్యాలెస్ పాతబడింది. అయినా అందులోని అందాలు, సోయగాల్లో ఎలాంటి మార్పూ లేదనిపిస్తుంది. 125 ఏళ్లు పైబడిన ఈ ప్యాలెస్ రాచఠీవీతో దర్జాగా తన దర్పం ప్రదర్శిస్తోంది. సైఫాబాద్ ప్యాలెస్ గతకొంతకాలంగా వార్తల్లో

ప్రముఖంగా కనిపిస్తోంది. కారణం... ఈ పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని కొందరు భావించారు. వారసత్వ, చారిత్రక కట్టడాల అభిలాషాపరులు ఇది తగదని ప్రభుత్వానికి సూచించారు. ఈ వారసత్వ కట్టడాన్ని పరిరక్షిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పనులు త్వరలో చేపట్టనున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top