ఎక్కడేసిన గొంగళి అక్కడే

శ్రీరమణ


 అక్షర తూణీరం



 ‘‘ఇంతకీ స్విస్ బ్యాంక్‌ల నుంచి డబ్బంతా వచ్చిందా’’ అని ఆత్రంగా మొదటి ప్రశ్న వేశాడు. మేమంతా మొహమొహాలు చూసుకున్నాం. ‘‘పట్టాభిషేకం రోజున పెద్దాయన చెప్పాడు కదా’’ అని మావయ్య గుర్తు చేశాడు. మేమంతా అపరాధుల్లా తలలు దించుకున్నాం. ఢిల్లీ గవర్నమెంటు ఎక్కిదిగి ఎక్కిన వైనం చెప్పగా విని ‘అహా’ అన్నాడు.

 

 ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ‘‘అప్పుడే మనవూరి స్టేషన్ వచ్చేసిందా’’ అని అడిగాడు మావయ్య కళ్లు నులుపుకుంటూ. చుట్టూ చేరిన మా ఆనందానికి అవధులు లేవు. మావయ్య చుట్టూ కలయచూసి వెర్రిమొహం పెట్టాడు. అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే - మావయ్య కోమాలోకెళ్లి ఎనిమిది నెలల ఎనిమిది రోజులైంది. ఎలా వెళ్లాడంటే - చిన్న రిపేర్ వచ్చి పెద్ద ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఉందో, దీనికనుబంధంగా అది ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. అయితే, మావయ్య అక్కడి అర్ధాపావు మెడికోలకి మంచం మీద దొరికిపోయాడు. వాళ్లు ఎవరికి తోచిన వైద్యం వాళ్లు చేశారు. కొందరు నీళ్ల ఇంజెక్షన్లిచ్చారు. మరి కొందరు పొట్టనొక్కి చూశారు. స్టెత్‌తో గుండె చప్పుళ్లు విని ఆనందిం చారు కొందరు. ఎవరో మత్తు మందు మాస్క్‌ని ప్రయోగాత్మకంగా మావయ్య ముక్కుకి తగిలించారు. ఒక్కసారి నిశ్శబ్దం అలుముకుంది. మావయ్య కోడి మెడ వేశాడు. పెద్ద డాక్టర్లు వచ్చి, ఇది పిల్ల చేష్టల వల్ల జరిగింది కాదు, షుగర్ ఎగతన్నడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ‘‘స్మారక స్థితికి తెస్తాం, డోంట్ వర్రీ’’ అని హామీ కూడా యిచ్చారు. విషయం పొక్కకుండా వుంటుందని జరిగిన కథని, మావయ్యని గదిలోనే ఉంచేశారు. వైద్యం కూడా ఉచితంగానే నడిపించారు. మాకు అసలు సంగతి తెలుసు. అనవసరంగా చానెల్స్‌కి ఎక్కి, గొడవ చేసి ఉచిత వైద్యాన్ని వదులుకోవడం దేనికని మేమంతా పెద్ద డాక్టర్ల మాట నమ్మినట్టే నటించాం. ఎందుకంటే మావయ్యకే కాదు మూడు తరాలు వెనక్కి వెళ్లినా వంశంలో షుగర్ లేనేలేదు. క్లుప్తంగా జరిగింది మావయ్యకి ఎరుక పరిచాం.



 ‘‘ఇంతకీ స్విస్ బ్యాంక్‌ల నుంచి డబ్బంతా వచ్చిందా’’ అని ఆత్రంగా మొదటి ప్రశ్న వేశాడు. మేమంతా మొహమొహాలు చూసుకున్నాం. ‘‘పట్టాభి షేకం రోజున పెద్దాయన చెప్పాడు కదా’’ అని మావయ్య గుర్తు చేశాడు. మేమంతా అపరాధుల్లా తలలు దించుకున్నాం. ఢిల్లీ గవర్నమెంటు ఎక్కిదిగి ఎక్కిన వైనం చెప్పగా విని ‘అహా’ అన్నాడు.



 చంద్రబాబు అప్పుడెప్పుడో చెప్పిన రైతుల రుణమాఫీ అమలైందా అని అడిగాడు ‘అవుతోంది’ అన్నాం. క్లారిటీ ఇవ్వండని అరిచాడు మావయ్య. ‘వాళ్లకే లేదు ఇంక మేమేం ఇస్తాం’ అని గొణిగాను. ఇంతకు కాపిటల్ ఎక్కడో తేలిందా అన్నాడు. అమరావతి విశేషాలన్నీ చెప్పాం. బాబు అనుచరులతో సహా సగం ప్రపంచం చుట్టివచ్చారని, పెట్టుబళ్లు రావచ్చనీ చెప్పాం. ముందు మనకి కావల్సింది అప్పులు. పెట్టుబళ్లు ఆనక చూసుకోవచ్చని మావయ్య స్పష్టంగా చెప్పాడు. ఏదైనా ఎదురు మాట్లాడితే మళ్లీ కోమాలోకి వెళ్తాడే మోననే భయంతో చచ్చినట్టు విని ఊరుకుంటున్నాం. టీవి తెర మీద వ్యాపార ప్రకటన వస్తుంటే మావయ్య చూశాడు. ‘‘ఏవిట్రా ఇది, మిషన్ కాకతీయ అంటే...’’ అన్నాడు. వివరంగా చెప్పాం. ‘‘అయితే మాత్రం, వాళ్ల ఊరి చేపల కోసం పగటి కలలేమిటి’’ అన్నాడు మందలింపుగా. ‘తెలంగాణ కేబినెట్‌లోకి కొత్తగా సొంత చుట్టాలెవరైనా వచ్చారా’’ అని అడిగాడు. వినీ విననట్టు ఊరుకున్నాం. ‘పదండి... ఇంటికి పోదాం’’ అని కదిలాం. మావయ్య మా వంక తీవ్రంగా చూశాడు. ‘ఎనిమిది నెలల తరవాత సంగతు లేవిట్రా అంటే ఒక్కటీ చెప్పరు. ఇన్నాళ్లూ మనశ్శాంతిగా బతికాను’’ అంటూ మావయ్య తలపట్టుకున్నాడు.



 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top