క్యాపిటల్‌ పాంకోళ్ల కథ

Sri Ramana Article On Capital - Sakshi

అక్షర తూణీరం

అసలు అప్పుడే మనకి నోరుంటే పొట్టి శ్రీరాములు స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకోగానే నెల్లూరే మన క్యాపిటల్‌ అని ఎలుగెత్తి చాటేవారు. శ్రీరంగనాయకస్వామి అండగా నిలబ డేవాడు. పెన్నమ్మ జలసంపదలిచ్చి చల్లగా చూసేది. సన్న బియ్యంతో సహా సమస్త నాజూకులతో ముఖ్య పట్టణం విరాజిల్లేది. ప్రపంచ దేశాల స్థాయిలో నెల్లూరులో ఏ కాన్ఫరెన్స్‌ పెట్టినా ఆహ్వానితులు ఆవురావురుమని విచ్చేసే వారు. ఆ కూరలు, ఆ పిండి వంటలు, ఆ దోసెలు, ఆ అరిటాకు లేలేత పరిమళాలు క్యాపిటల్‌ పేరు చెప్పగానే పదండి ముందుకు అంటూ నడిపించేవి. కాయగూరలేనా, కందమూలా లేనా పుణ్య పురుషులకు రుచి భోగాలున్న జలచరాలు, భూచ రాలు, ఖేచరాలు కోరినదే తడవుగా విస్తళ్లను అలంకరిస్తాయి. ఇంకా చిత్రాతిచిత్రమైన చిత్రన్నాలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, మధుర మధురతర పానీయాలు విస్తరిని కిటకిటలాడిస్తాయి. ఇది నెల్లూరు తిండిముచ్చట. ఇక రాజకీ యాలంటారా, అచట చిగురు కొమ్మైన చేవ. నెల్లూరు బారసాల కూడా లేకుండానే జారిపోయింది. అకళంక దేశభక్తుడు ‘వంగ వోలు’ క్యాపిటల్‌ చెయ్యాలిరా అని రంకెపెడితే ఏమి జరిగేదో?! ఆంధ్రకేసరి గర్జించ లేదు. మూడో మాట లేకుండా తెలుగువారు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని తిరిగి వెనక్కి చూడలేదు.

మళ్లీ ఇన్నాల్టికి విస్తళ్లముందు నుంచి కొంగులు దులుపు కుని లేచిపోవలసి వచ్చింది. వడ్డించిన విస్తళ్లు కాదు కదా కూచో డానికి అనువైన చోటైనా దొరకలేదు. ఆరేళ్ల నుంచి కథ నడు స్తోందిగానీ కంచికి చేరడం లేదు. భూములిచ్చిన రైతులు, వారి కష్టనష్టాలు, మీడియా, రాజకీయ, అరాచకీయ ప్రముఖులు అంతా కలిసి సమస్యని కమ్మేశారు. కుమ్మేశారు. చినికి చినికి గాలివాన అయింది. పనులు ముందుకు కదలడం లేదు. మాక్కావలసింది అదేనని తృప్తిగా నిట్టూరిస్తోంది వీళ్లకి సరిపోని అపోజిషన్‌.

ఇట్లాంటి పెద్ద సమస్యలుగా ప్రజ్వరి ల్లేటప్పుడు, సామాన్యుణ్ణి అడిగి చూడాలి. అదే చేశాను. అతని మారుపేరు ‘అడ్డ బుర్ర’. వట్టిపోయిన గోమాతతో నూనెగా నుగ తిప్పుతూ ఊర్లో బతికేస్తున్నాడు. ఒక ప్పుడు బాగా బతికి చెడ్డవాడు. గానుగ కొయ్య తొట్టె మీద కూచుని, ఓ మూల నుంచి వచ్చే రేడియో సర్వస్వం వింటూ, దొరికిన పేపర్లని అక్షరం వదలకుండా నాకేసేవాడు. ‘ఇదిగో నువ్‌ గోవుతో గానుగ తిప్పుతున్నావని మోదీకి ఫొటోతో సహా ఫిర్యాదు చేస్తా’నని బెదిరిస్తే– అడ్డబుర్ర విలాసంగా నవ్వి ‘మరి నా గానుగ ఎట్టా తిరగాల? ఎవరైనా వాళ్ళోళ్లకి పురమాయించ మను. లేదంటే పనిచేసే ఆవులకు రిటైర్మెంట్‌ ప్రకటించి నెలవారీ పింఛనైనా మంజూరు చెయ్యమను. పాపం! అవెట్టా బతకాల’ అని జాలిపడేవాడు. ఇవ్వాళ హాయిగా బతకాలంటే లోకజ్ఞానం కాదు మీడియా జ్ఞానం ముఖ్యం అనేవాడు గానుగ కిర్రు చప్పుళ్ల మధ్య. ‘నువ్వు కాణి ఖర్చులేకుండా అన్ని పేపర్లు చదివేస్తావు గదా, మరి ఆ ఫలానా పత్రికనే ఎక్కువమంది చదువుతారెందుకు?’ అని అడిగితే, అదంతే అంటాడు అడ్డ బుర్ర. ‘కల్లు తాగేసినంత జోరుగా పాలు లాగీలేదు గందా’ సామెత చెప్పి ముక్తాయించేవాడు. పేపర్లో నిజాలు, అబద్ధాలు, వార్తలు అని మూడు విధాలవి కలిసిపోయి ఉంటాయి. విడ గొట్టుకున్నవాడు విజ్ఞాని అని సూత్రీకరించేవాడు.

 క్యాపిటల్‌ దుమారంమీద చర్చ వచ్చింది అడ్డ బుర్రతో. మధ్యలో కిర్రు చప్పుడుకి చిరాకుపడ్డాడు. అదేదో మన అవస్తో, వ్యవస్తో అది కూడా నా గానుగ లాంటిదే. అదిలించినా అంతే కదిలించకపోయినా అంతే. ముసలి జీవం మూడుకాళ్లమీద ఎట్టా నడుసుద్దో అంతే. మళ్లీ విషయంలోకి వచ్చాడు. ‘అసల ప్పుడు అట్టా జరిగి ఉంటే అప్పుడసలు క్యాపిటల్‌ సమస్య వచ్చేదే కాదు’ అంటూ ఓ ఏకవాక్య స్టేట్‌మెంట్‌ వదిలాడు. అసలప్పుడేం జరి గింది? అందరం ప్రశ్నార్థకంగా నిలబడి ఉత్కంఠభరితంగా అరిచాం.

 అభయహస్తంతో అందర్నీ ఊరటపరి చాడు. అప్పట్లో ఆయన పార్టీపెట్టి జై కేత నం ఎగరేసే సరికి, అప్పటికే విశాఖలో స్థిర పడ్డ పీఠాలు పాంకోళ్లు చేతపట్టుకు కది లాయి. రా.. కదిలిరా, తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది అంటూ నినా దాలు చేసుకుంటూ పచ్చజెండా భుజాన వేసుకుని బలగమంతా భాగ్యనగరానికి కదిలింది. ఇక ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా, ఇంక మనకి తిరుగు లేదురా అంటూ ఇక్కడ తెలుగుజాతి ఎవరికి తోచిన మహా నిర్మాణాలు వాళ్లు ప్రారంభించారు. కొంతకాలానికి చిన్న నేతలు వయసు కొచ్చారు. వాళ్లకి తీవ్రమైన పదవుల కొరత వచ్చింది. దాంతో కొండలు కదిలాయ్‌. ఈ పాంకోళ్లు నాడు కదలకుండా విశాఖ లోనే ఉండి ఉంటే– అయిదువేల ఎకరాల్లో లేదంటే హీనపక్షం పదివేల ఎకరాల్లో చిత్ర నగరం వెలిసేది. ఇక్కడ లేని సముద్రం కూడా జతపడి ఉచిత సేవలు అందిస్తూ ఉండేది. విశాల సామ్రాజ్యం పాంకోళ్ల కిందకు వచ్చేది. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్పనేలో పూర్వ గాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్ప నేలో పూర్వగాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు భూ మార్గం నుంచి, ఆకాశమార్గం నుంచి మాత్రమే కాక జలమార్గం ద్వారా కూడా ఆ ఎంపైర్‌కి జనం వచ్చేవారు. కానీ కథ అడ్డంగా తిరిగింది అని ముగిం చాడు అడ్డబుర్ర.

             
శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top