ఇంత  పసిదానికి  ఈ గురక ఏమిటి?

Your baby seems to have a problem with Laurengo Malaysia - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌ 

 మా పాపకు ఐదున్నర నెలలు. తాను పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవల ఆ శబ్దం మరీ ఎక్కువయ్యింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే తగ్గిపోతుందన్నారు. పాప సమస్య ఏమిటి? మాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. 

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’  సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం...  మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్‌ అంటారు.  పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్‌ రావడానికి కారణం లారింగో మలేసియానే.  ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే  మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది.

ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్‌ రిఫ్లక్స్‌ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో  కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్‌), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్‌ స్టెనోసిస్, లారింజియల్‌ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్‌లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ కండిషన్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్‌ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్‌ స్టడీస్‌ చేయించాల్సి ఉంటుంది.

ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్‌ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్‌ ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. 

పిల్లి కరిచింది... సలహా ఇవ్వండి

 మా బాబుకి ఐదేళ్లు. వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్లినప్పుడు అది  కరిచింది. అది పెంపుడు పిల్లి కాదు. డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకెళ్తే పూర్తి వ్యాక్సిన్‌ వేయించాలని చెప్పారు. మావాడి విషయంలో ఆందోళనగా ఉంది. దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి.  
జంతువుల వల్ల మనుషులకు వచ్చే జబ్బులను, జంతువులు కరవటం వల్ల వచ్చే జబ్బులను జూనోటిక్‌ వ్యాధులు అంటారు.  ప్రమాదకరమైన జూనోటిక్‌ వ్యాధులలో రేబిస్‌ ఒకటి. అందరూ అనుకుంటున్నట్లు రేబిస్‌ కేవలం కుక్కల ద్వారానే కాక– పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, కోతులు, అరుదుగా ఎలుకల వల్ల కూడా కలుగుతుంది. అన్ని జంతువులలో రేబిస్‌ ఉండకపోవచ్చు. అయితే స్ట్రే యానిమల్స్‌ కరిచినప్పుడు– దాని ద్వారా రేబిస్‌ సంక్రమిస్తుందో లేదో అని నిర్ధారణకు అయ్యేవరకు వాటికి రేబిస్‌ ఉన్నట్లుగానే  పరిగణించి, జంతువు కాటుకు గురైన వారికి చికిత్స చేయాలి.

ఒక వేళ కరిచిన జంతువు పదిరోజులలోపు చనిపోయినా లేదా అది రేబిస్‌ ఉన్న జంతువు అని నిర్ధారణ అయినా పూర్తి ట్రీట్‌మెంట్‌ ఎంతైనా అవసరం.జంతువుల వల్ల అయిన గాయాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. గాయం 2, 3 కేటగిరీలకు చెందినదైతే వైద్యం తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. వ్యాక్సిన్‌ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కేటగిరీని బట్టి 3 నుంచి 5 సార్లు యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వటం కూడా జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో జంతువులు విపరీతంగా కరిచినప్పుడు వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబిస్‌ ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ కూడా ఇవ్వాలి. కరిచిన జంతువుకు రేబిస్‌ లేకపోయినా ఇది తప్పనిసరి. మామూలుగా మన పరిసరాలలో తిరిగే జంతువులు గీరటం లేదా కరవటం జరిగినప్పుడు మొదటి పదిరోజుల్లో ఆ జంతువుకి ఎటువంటి హాని జరగకపోతే మొదటి మూడు డోసులతో వ్యాక్సిన్‌ను నిలిపివేయవచ్చు. 

ఇంత చిన్న బాబుకూ తలనొప్పా? పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు కాసేపు నిశ్శబ్దంగా  పడుకోబెడితే  తలనొప్పి తగ్గుతోంది. కానీ చాలాసార్లు మాత్ర వేస్తేగానీ తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? వాడికి తగ్గేదెలా? 
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ బాబుకు తరచూ తలనొప్పి ఒకింత తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చిన్న పిల్లలతో పాటు టీనేజర్లలో తలనొప్పి రావడం మామూలే. పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్‌ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్‌ హెడేక్, అటనామిక్‌ డిస్ట్రబెన్సెస్‌ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు)  కూడా తలనొప్పి రావచ్చు. ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్‌ అని చెప్పవచ్చు. మైగ్రేన్‌ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు.

కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో 10 శాతం మందికి ఏదో ఒక రూపంలో మైగ్రేన్‌ కనిపిస్తుంది. తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్‌ న్యూరలాజికల్‌ సింప్టమ్స్‌) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్‌ పరీక్షలు అవసరమవుతాయి. 

ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్‌ ఫేజ్‌)లో ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్‌ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇవి కొన్ని నెలల పాటు వాడటం వల్ల లక్షణాలు మళ్లీ కనిపించకపోవడం లేదా చాలారోజుల పాటు కనిపించకుండా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బిహేవియర్‌ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది.

 ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్‌... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్‌ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధంగా ఒకేవేళకు ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేసేవారిలో నొప్పి తీవ్రత తక్కువ. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top