ఇంత చిన్న  పాపకు  గురకా? 

Your baby seems to have a problem with Laurengo Malaysia - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా పాపకు ఏడునెలల వయసు. పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ శబ్దం మరీ ఎక్కువగా ఉంటోది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే ‘కొద్దిరోజుల్లో తగ్గుతుంది’ అని చెప్పారు. పాప గురించి మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. 

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం...  మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరతా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటునప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్‌ అంటారు.  పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్‌ రావడానికి కారణం లారింగో మలేసియానే.  ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు.చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలు కావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగో మలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్‌ రిఫ్లక్స్‌ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు.

ఇలాంటి పిల్లల్లో  కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్‌), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్‌ స్టెనోసిస్, లారింజియల్‌ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్‌లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్‌ రిఫ్లక్స్‌ కండిషన్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్‌ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్‌ స్టడీస్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్‌ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగో మలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్‌ ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి.  

 

మా పాపకు ఐదున్నర ఏళ్లు. ఇటీవల మూడు నాలుగు సార్లు ఒంటి మీద దద్దుర్లలా వచ్చాయి. ఒక రోజు ఉండి మళ్లీ తగ్గుతున్నాయి. పాప చాలా చాలా ఇబ్బందిపడుతోంది. ఈ సమస్యకు మందులు కూడా వాడాం. అయితే తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తున్నాయి. మీ పాపకు ఇలా జరగడానికి కారణం ఏమిటి? దయచేసి పరిష్కారం చూపండి. 
 మీ పాపకు ఉన్న సమస్యను అర్టికేరియా అంటారు. ఈ సమస్యలో చర్మం పైభాగం (సూపర్‌ఫీషియల్‌ డర్మిస్‌) ఎర్రబడి కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఇది చిన్న ఎర్రటి మచ్చలా మొదలై శరీరమంతటా అనేక చోట్ల కనిపించవచ్చు.మనలోని 20 శాతం మందిలో జీవితకాలంలో కనీసం ఒకసారైనా కనిపించే అతి సాధారణ సమస్య ఇది. ఆర్టికేరియాలో అక్యూట్‌ అని, క్రానిక్‌ అని రెండురకాలు ఉంటాయి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు అక్యూట్‌ అర్టికేరియా అని చెప్పవచ్చు. ఆర్టికేరియాకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆహారం వల్ల (అంటే... గుడ్డు, గోధుమ, వేరుసెనగ (పల్లీ)లు, సముద్రపు చేపలు, కొందరిలో స్ట్రాబెర్రీస్‌); మందులు, ఏదైనా పురుగు కుట్టడం (అంటే... తేనెటీగలు లేదా చీమల వంటివి); ఇన్ఫెక్షన్లు(అంటేబ్యాక్టీరియల్‌ లేదా వైరల్‌); కాంటాక్ట్‌ అలర్జీలు (అంటే లేటెక్స్‌/రబ్బరు, పుప్పొడి వంటివి); గొంగళిపురుగులు, కొన్ని జంతువుల లాలాజలం తగలడం వల్ల; రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పాదనల వల్ల... మీరు చెబుతున్న అక్యూట్‌ అర్టికేరియా రావచ్చు.ఇక దీర్ఘకాలికంగా కనిపించే క్రానిక్‌ అర్టికేరియాలో 80 శాతం కేసుల్లో కారణం ఇదీ అని చెప్పడం కష్టం.  

కాకపోతే కొన్నిసార్లు చాలా వేడి, చల్లటి, ఒత్తిడితో కూడిన, కంపనాలతో ఉండే పరిసరాల వల్ల, థైరాయిడ్, రక్తానికి సంబంధించిన రుగ్మతల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్‌) అర్టికేరియా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అక్యూట్‌ అర్టికేరియాకు నట్స్‌తో కూడిన ఆహారం, ఆహారంలో వేసే కృత్రిమ రంగులు, పుప్పొడి, ఏదైనా పురుగు కుట్టడం, కడుపులో నులిపురుగులు, సింథటిక్‌ దుస్తులు, సీఫుడ్‌ వంటి వాటిని సాధారణ కారణాలుగా గుర్తించారు. కాబట్టి మీ పాప విషయంలో చికిత్సలో భాగంగా మొదట పైన పేర్కొన్న అంశాలలో మీ పాప అర్టికేరియాకు ఏది కారణం కావచ్చో దాన్ని గుర్తించి, దాని నుంచి కొన్నాళ్లు మీ పాపను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.ఇక మందుల విషయానికి వస్తే యాంటీహిస్టమైన్స్, హెచ్‌2 బ్లాకర్స్‌ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇక లక్షణాలు తీవ్రంగా కనిపించే వారిలో ఇమ్యూనో మాడ్యులేషన్‌ మెడిసిన్స్‌ కూడా వాడవచ్చు. మీ పాప విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీహిస్టమైన్స్‌లో హైడ్రాక్సిజీన్, సిట్రజీన్‌ వంటి మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య పదే పదే తిరగబెడుతూ, తీవ్రంగా కనిపిస్తుంటే కొన్ని ఇమ్యూనలాజికల్‌ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి తీవ్రతను బట్టి మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణుణ్ణి లేదా మీ పీడియాట్రీషియన్‌తో చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. 
 డా. రమేశ్‌బాబు దాసరి
 సీనియర్‌ పీడియాట్రీషియన్
రోహన్‌ హాస్పిటల్స్,  విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top