రైతు రాణులకు జేజేలు!

World Womens Day: Special story on women formers - Sakshi

కరం పొలంలో 25 క్వింటాళ్ల పండు మిర్చి దిగుబడి

ఎకరానికి కషాయాలు, జీవామృతం ఖర్చు రూ. 4,800 మాత్రమే

అంతర పంటలూ కలిసొచ్చాయి.. అటు ఆదాయం.. ఇటు ఆరోగ్యం

మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో చక్కని దిగుబడులు

కోటేశ్వరమ్మను ఎగతాళి చేసిన వారే భళా అంటున్నారు

మన దేశంలోని రైతు కుటుంబాల్లో 80–85% వరకు ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని జీవనం సాగించే ఈ వ్యవసాయ కుటుంబాల్లో పురుషుల కన్నా మహిళా రైతుల శ్రమే అధికం. దీక్షగా, క్రమశిక్షణగా వ్యవసాయం చేస్తూ అరకొర వనరులతోనే చక్కని ఫలితాలు సాధిస్తూ కుటుంబాల అభ్యున్నతికి అహరహం కృషి చేస్తున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోబలంతో నిలబడి వ్యవసాయాన్నే నమ్ముకొని కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ఈ ధీర వనితలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది.

‘మీ మిరప పంటలో తాలు కూడా లేదమ్మా..’
మిర్చి పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించటం సహజం. నారు వేసిన దగ్గర్నుంచి మిర్చి కోతలు కోస్తున్నంత వరకు దాడి చేస్తుంటాయి. ఒక పురుగుమందు పనిచేయకపోతే మరొకటి వాడుతూ రసాయన మందులతో రైతులు ఒక రకంగా యుద్ధమే చేస్తారు. అటువంటిది ఎలాంటి పురుగుమందులూ వాడకుండా కేవలం కషాయాలతోనే మిర్చిని పండించాలని చూసిన మహిళా రైతును, తోటి రైతులు ఎగతాళి చేశారు. మందులు కొట్టకుండా పంట ఎట్లా తీస్తావు? అంటూ ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని ఆచరించిన ఆ రైతు చేలో మిరప విరగపండింది. అంతర పంటలతోనూ ఆదాయాన్ని తీశారు.

నాడు నవ్విన రైతులే ఇప్పుడు ‘తాలు కూడా లేదమ్మా మీ పంటలో...’ అంటూ ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి ప్రపంచ బ్యాంకు బృందం సహా ఆ మిరప చేనును సందర్శించారు. శభాష్‌... అంటూ అభినందించారు. మిర్చి పంట సాగులో అద్భుత విజయం సాధించిన ఆ మహిళా రైతే పరమాత్ముల కోటేశ్వరమ్మ. గుంటూరు జిల్లా పెదనందిపాడు దగ్గర్లోని కొప్పర్రు. జిల్లాకు తలమానికమైన మిర్చిని కోటేశ్వరమ్మ, భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ నేపధ్యలలో రైతు దంపతులు పట్టుదలతో నూటికి నూరు శాతం రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

ఎకరంలో తొలి కోతకే 12 క్వింటాళ్లు
దుక్కిన దున్ని ఘన జీవామృతం వేయడంతో ఆరంభించి, బీజామృతంతో శుద్ధిచేసిన నారును నాటిన దగ్గర్నుంచి ప్రతి దశలోనూ మిరప మొక్కలకు ద్రవ జీవామృతంతో సహా రోగ నిరోధక శక్తికి, దృఢంగా ఉండేందుకు సప్త ధాన్యాంకుర కషాయాన్ని వాడుతూ, వివిధ రకాల కషాయాలతో తెగుళ్లను నిరోధిస్తూ మిర్చిని పండించుకున్నారు. ఎకరం పొలంలో తొలి కోతకే 12 క్వింటాళ్ల మిరప పండ్ల దిగుబడిని తీశారు. చెట్టు నిండుగా కనిపిస్తున్న మిరపకాయ, మరో 13 క్వింటాళ్లు వస్తాయన్న ధీమానిస్తోంది. అందులో వేసిన రకరకాల అంతర పంటలతో మిర్చి చేతికొచ్చేలోగానే దఫాలుగా ఆదాయాన్నీ కళ్ల చూశారు.

మిర్చి పంట సాగుకు పెట్టుబడులు రైతులందరికీ సమానమే అయినా, ఎరువులు, పురుగుమందులకే రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులందరూ ఎకరాకు రూ.75 వేలకు పైగా వ్యయం చేస్తే, ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్న కోటేశ్వరమ్మకు కషాయాలు, జీవామృతాల తయారీకి రూ.4,800 మాత్రమే ఖర్చయింది. అయితే, ఆమె మిర్చిని అందరికన్నా ఎక్కువ ధరకే అమ్మారు. రసాయన రహిత పంట తీశామన్న సంతృప్తినీ పొందానని కోటేశ్వరమ్మ అన్నారు.

ప్రకృతి వైపు మళ్లించిన పుల్లమజ్జిగ
    కొప్పర్రు గ్రామంలో మిరప, పత్తి పంటల సాగు అధికం. కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకున్న ఎకరం మెట్ట పొలానికి, మరో ఎకరం కౌలుకు తీసుకుని అవే పంటలు సాగు చేస్తుండేవారు. కొంత భూమిలో బెండకాయ, దోసకాయ వంటి కూరగాయలను పండించేవారు. కలుపు మందులు, పురుగు మందులు చల్లాల్సి వస్తుండేది. ఒక పంట తీసేసరికి రెండెకరాలకు కలిపి రూ.1.20 లక్షల వరకు వీటికే ఖర్చు చేసినట్టయ్యేది. పెట్టుబడికి, ఖర్చులకు పెద్దగా వ్యత్యాసం వుండేది కాదు. తాతలనాటి వ్యవసాయాన్ని వదులుకోలేక, అస్తుబిస్తు సంపాదనతో కొనసాగుతున్న కోటేశ్వరమ్మకు, ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తుండే చిరుద్యోగి ఒకరు చెప్పిన చిట్కాతో తరుణోపాయం కనిపించింది. ఆ ఉత్సాహం ఆమెను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించింది.

నాలుగేళ్ల క్రితం చేలోని మిరపకు పండాకు తెగులు ఆశించింది. ఎప్పట్లాగే నివారణ రసాయనిక పురుగు మందుల కోసం చూస్తున్న కోటేశ్వరమ్మకు, ‘పుల్ల మజ్జిగ కొట్టి చూడండి’ అన్న సూచన ఆలోచింపజేసింది. పోయేదేముంది.. పాలు ఖర్చే కదా! అనుకున్నారు. ‘నాలుగు లీటర్ల పాలు తీసుకొచ్చి, కాచి తోడువేశాం.. 5 రోజులు మురగనిచ్చి, నీటితో కలిపి 15 ట్యాంకులు పిచికారీ చేశాం.. కంట్రోలు అయింది... ప్రకృతి వ్యవసాయంపై అలా గురి కుదిరింది’ అని చెప్పారు కోటేశ్వరమ్మ. అదే పురుగుమందులు చల్లితే రూ.1,200 వరకు ఖర్చు. పురుగుమందు చల్లటం వల్ల చేతులు, ఒళ్లు దురదలు, కళ్లు మంటలు ఉండేవన్నారు. ఆ అనుభవంతో ప్రకృతి వ్యవసాయం సత్తా ఏమిటో తెలిసింది. గత మూడేళ్లుగా రసాయన ఎరువులు/ పురుగుమందుల జోలికే వెళ్లకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు.

‘మేం వేల రూపాయలు ఖర్చుపెట్టి మందులు వాడుతుంటేనే తెగుళ్లు పోవటం లేదు.. ఆకులు, ఎద్దుపేడ, ఆవు మూత్రంతోనే పోతాయా? అంటూ ఊళ్లోని రైతులు ఎకసెక్కంగా మాట్లాడారు.. ఎరువులు వేసిన చేలల్లోలా మొక్కలు గుబురుగా, కంటికి ఇంపుగా ఎదగలేదు. అది చూసి నవ్వారు. ఓపిగ్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చాం. అధిక వర్షాలకు మొక్కలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. మా కష్టం ఫలించింది. చేను అందంగా కనిపించకున్నా, మొక్క మొక్కకు నాణ్యమైన కాయ విరగ కాసింది. మొదట్లో ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీ చేలో తాలు కాయ ఒక్కటీ లేదంటూ మెచ్చుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు కోటేశ్వరమ్మ.

మిర్చిలో బంతి, జొన్న, ఉల్లి, ముల్లంగి...
గత ఆగస్టు 28న ఎకరంలో మిర్చి నారుతో నాట్లు వేశారు. ఎకరాకు 12 వేల మొక్కలు. సరిహద్దు పంటగా మూడు వైపులా జొన్న, మరోవైపు కంది వేశారు. ఎర పంటగా 400 బంతి మొక్కలు పెంచారు. అంతర పంటలుగా ఒక్కోటి నాలుగు వేల మొక్కలు వచ్చేలా ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర వేశారు. అనుసరించిన పద్ధతులను వివరిస్తూ, ముందుగా ఎనిమిది కిలోల బెల్లం, ఎనిమిది కిలోల శనగపిండి, నాలుగు గుప్పిళ్లు మట్టి, 40 లీటర్ల మూత్రం, 2500 కిలోల కంపోస్టు ఎరువుతో తయారుచేసిన 400 కిలోల ఘనజీవామృతాన్ని చల్లామని కోటేశ్వరమ్మ చెప్పారు. అయిదు కిలోల పేడ, అయిదు కిలోల ఆవు మూత్రం, 20 లీటర్ల నీరు, 15 గ్రాముల సున్నంతో చేసిన బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటాం. అయిదు కిలోల వేపాకు, ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి తయారుచేసిన 100 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేశాం.

కిలో పండు మిర్చి రూ. వంద
పచ్చళ్లకు అడుగుతున్నారని పండుకాయ వచ్చాక కోత మొదలుపెట్టారు. మార్కెట్లో పండుకాయ కిలో రూ.60 వుంటే కోటేశ్వరమ్మ పొలంలో పండు మిర్చి రూ.100 చొప్పున 1.60 క్వింటాళ్లు అమ్మకం చేశారు. మిగిలిన పంట కోసింది కోసినట్టుగా ఎండబెడుతున్నారు. మొత్తం మీద మరో 13 క్వింటాళ్లు వస్తాయని అంచనాతో ఉన్నారు. అంతర పంటల్లో ముందే పీకిన రూ.1000, బంతి పూలతో రూ.4,000, కొంతభాగం విక్రయించిన ఉల్లితో రూ.2,000, ముల్లంగితో మరో రూ.2,000 ఆదాయం సమకూరింది. ప్రకృతి వ్యవసాయం, అంతర పంటలు ఆదాయాన్నిస్తూ ఉంటే.. భూమిని నమ్ముకున్నందుకు నిశ్చింతగా అనిపిస్తోంది.. సమాజానికి ఆరోగ్యకర పంటలు అందిస్తున్నామన్న భావన తమకెంతో సంతృప్తినిస్తున్నదని కోటేశ్వరమ్మ సంతోషంగా చెప్పారు.  కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చాకిరీ మాత్రం చేసుకోవాల్సిందేనన్నారు. భర్తతో కలిసి ప్రతి రోజూ ఆరింటికల్లా పొలంలో దిగి, సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటున్నానన్నారు.

వళ్లు మంటలు.. కళ్లు మంటలు లేవు..
మూడేళ్ల నుంచి (రసాయనిక) మందుల్లేకుండా పట్టుదలగా పంటలు పండిస్తున్నాం. ఈ విషయం ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలిసి వచ్చి చూసెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఆ ఏముందిలే అన్న ఊహలో ఉన్నారు. ఇప్పుడు పొలంలోకి వచ్చి ఏమి వేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూస్తున్నారు. మందుల్లేని పండు మిరప కాయలకు ఈ ఏడు చాలా గిరాకీ వచ్చింది. ఎండు మిరపకాయలకు కూడా ముందే ఆర్డర్లు వస్తున్నాయి. ఎకరం కౌలు రూ. 30–40 వేలు కావటంతో ఇతర రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి వెనకాడుతున్నారు.

సొంత చేనే కదా అని మేం పట్టుదలతో చేస్తున్నాం. ఎకరానికి ఎరువులు, పురుగుమందులకే రూ. 60–70 వేలు ఖర్చు చేస్తున్నారు. మాకు గత ఏడాది జీవామృతానికి, కషాయాలకు 4 వేలు ఖర్చయింది. మందులు కొట్టే వాళ్లకు, నీళ్లు పోసే వాళ్లకు వళ్లు మంటలు, కళ్లు మంటలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. అయితే, కషాయాల తయారీలో వాసనలు, చాకిరీ గురించి కొందరు ఇబ్బంది పడుతున్నారు. మిషన్లు వస్తే సులభంగా ఉంటుంది. భూమి బాగు కోసం, ఆరోగ్యం కోసం ఒకరు అడుగేస్తే కదా.. పది మందీ నడిచేది.. అని మేం డీపీఎం రాజకుమారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పంటను అమ్ముకోవటంలో అంత ఇబ్బందేమీ లేదు.
– పరమాత్ముల కోటేశ్వరమ్మ(63013 51363), మహిళా రైతు, కొప్పర్రు, గుంటూరు జిల్లా


కల్లెం ఈశ్వరమ్మ


తనుగుల ఆగమ్మ


భర్త వేంకటేశ్వరరావుతో కలిసి కళ్లంలో మిరప పండ్లను ఎండబోస్తున్న కోటేశ్వరమ్మ
 

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top