మీ ఆరోగ్య ప్రపంచం

World Health Day is Celebrated on 7th of this Mmonth - Sakshi

ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్యదినోత్సవం 

ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్‌ ‘‘యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌’’. అంటే... అందరికీ ఆరోగ్య రక్షణ అందడం. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర్నుంచి...వృద్ధాప్యపు దశ వరకు అందరి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే నేటి ఈ ప్రత్యేక కథనం. మీ ప్రపంచం మీ కుటుంబమేగా!  అందుకే ప్రపంచ ఆరోగ్య దినాన మీ ఆరోగ్య ప్రపంచం కోసం చదవండి... చదివించండి.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందాల్సిందే (యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌) అన్నది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న పిలుపు. కానీ ఆచరణలో అది వాస్తవరూపం దాల్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోస్వచ్ఛందంగా ఆరోగ్యాన్ని పొందడం కోసం మనకు మనమే కొన్ని చర్యలు చేపట్టవచ్చు. మరికొన్ని జాగ్రత్తలతో అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ ఏడాది థీమ్‌ను మనమే పొందడానికి మనం పాటించాల్సిన సూచనలు/జాగ్రత్తలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. మనం పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలకు ముందుగా ఒకసారి ఆరోగ్యరంగంలో మన దేశం పరిస్థితిని చూద్దాం. ఇటీవల మన సమాజం దాదాపుగా పాశ్చాత్య జీవనశైలినే అనుసరిస్తోంది. దాంతో మన దేశంలోనూ నాన్‌–కమ్యూనికబుల్‌ డిసీజెస్‌గా మనం పేర్కొనే దాదాపుగా జీవనశైలి వల్ల వచ్చే డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి పెరుగుతున్నాయి.

2016 నాటి లెక్కల ప్రకారం మన దేశ జనాభా 132,41,71,000. అయితే మన జీడీపీలో మనం వైద్యానికి చేస్తున్న ఖర్చు కేవలం 4.7% మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది వరల్డ్‌ హెల్త్‌ డే కోసం ఇచ్చిన థీమ్‌ ‘యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌’. అంటే జనాభా అంతటికి ఆరోగ్యం అందడానికి ఉద్దేశించిన ‘సార్వత్రిక ఆరోగ్యం’ అనేది ఈ సారి నినాదమన్న మాట.  కానీ అది ఆచరణ సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి చాలా అంశాలు కారణమైనప్పటికీ అందులోని ఒక ప్రధాన కారణం... అర్హత ఉన్న వైద్యుల్లో (క్వాలిఫైడ్‌ డాక్టర్లు) దాదాపు నాలుగింట మూడొంతులు  నగర/పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

తాజా గణాంకాల ప్రకారం... భారత్‌లో కేవలం 28% ఉన్న నగర జనాభాకు మొత్తం డాక్టర్లలో 74% మంది నగరాల్లో నివసిస్తుండగా...  పల్లెల్లో నివాసం ఉంటున్న మిగతా 72% మందికి కేవలం 26% మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక మన దేశంలోని ప్రతి 10000 మందికీ కేవలం 17 మంది శిక్షణ పొందిన వైద్యం చేయడానికి అర్హులైన వైద్యసిబ్బంది (డాక్టర్లు, నర్సులు) మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతి 10000 మందికీ కనీసం 25 మంది శిక్షణ పొందిన వైద్యసిబ్బంది అయినా ఉండాలని సిఫార్సు చేస్తోంది. ఇక 10000 మందికి కేవలం 13 పడకలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఆ సంఖ్యకోసం కనీసం 35 పడకలు అవసరమని కూడా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటోంది.

చవకే గానీ అందుబాటులో లేదు... 
మనదేశంలోని ఇంకా విచిత్రమైన అంశమేమిటంటే... భారత్‌లోని పెద్ద నగరాల్లో ప్రపంచస్థాయి వైద్యసేవల్లో చాలావరకు లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద నగరాలతో పోలిస్తే భారత్‌లో దొరికే వైద్యసేవలు చాలా చవక. ఉదాహరణకు గుండె వంటి కొన్ని కీలక శస్త్రచికిత్సల వంటివి భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో 20 రెట్లు ఎక్కువ. పక్కనే ఉన్న మలేషియాలో కూడా ధరలు భారత్‌ కంటే రెట్టింపు. అయితే అవి ప్రస్తుతానికి విదేశీయులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. స్థానిక ప్రజలకు మాత్రం అందుబాటులో లేవు. దీనికి కారణం... 2016 నాటి ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం రోజుకు 4.5 డాలర్లు/ రూ. 310 మాత్రమే.

దాంతో  164 దేశాల్లోని తలసరి ఆదాయాల్లో భారత్‌ స్థానం 112. ఫలితంగా అంతర్జాతీయంగా పోలిస్తే దేశంలో ఇంత చవగ్గా వైద్యసదుపాయాలు లభ్యమవుతున్నా... ప్రస్తుతానికి భారతీయులకు మాత్రం అవి భరించలేనివే. ఇలాంటి గణాంకాల ప్రకారం వైద్యచికిత్స సామాన్యులకు అందుబాటులో లేదని స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఈ ఏడాది నినాదమైన సార్వత్రిక ఆరోగ్యం (యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌) ఇంకా నినాద స్థాయిలోనే ఉంది. అందుకే చిన్న పిల్లలు మొదలుకొని... వృద్ధుల వరకు వివిధ వర్గాల వారు అసలు హాస్పిటల్‌కే వెళ్లాల్సిన అవసరం లేకుండా... నిత్యం తమంతట తామే ఆరోగ్యం ఉండేందుకు కొన్ని సూచనలివి... 

0 నుంచి ఏడాది వరకు చిన్న పిల్లల ఆరోగ్యం కోసం... 
పిల్లల ఆరోగ్య సంరక్షణ అన్నది తల్లి గర్భం నుంచే మెుదలు కావాలి. ఇందుకోసం ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న కాబోయే తల్లి మూడు నెలల ముందునుంచే తాజా ఆకుకూరలు, పండ్లు లాంటివి తమ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనికి తోడుగా ఐరన్‌ టాబ్లెట్లు, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి మాత్రలు తీసుకుంటే పుట్టబోయే చిన్నారి ఆరోగ్యంగా బాగుండటమే కాకుండా... చాలా రకాల సమస్యలూ నివారితమవుతాయి. పిల్లలు పుట్టాక కనీసం ఆర్నెల్ల పాటు వారికి తల్లిపాలు తప్పక తాగించాలి. పుట్టగానే స్రవించే ముర్రుపాలను తప్పక పట్టాలి. కొన్ని అపోహల కారణంగా కొంతమంది ఆ పాలు పట్టరు.

అయితే చిన్న పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తే అవి వృద్ధాప్యం వరకు కూడా ఎన్నో జబ్బులను నివారిస్తాయన్నది నిరూపితమైన సత్యం. ఆ తర్వాత పిల్లలు పుట్టిన నాటి నుంచి ‘యూనివర్సల్‌ ఇవు్యూనైజేషన్‌’ కార్యక్రవుంలో భాగంగా ఆ చిన్నారులకు ఇవ్వాల్సిన అన్నిరకాల టీకాలు, వ్యాక్సిన్లు ఇప్పించడం ద్వారా వాళ్లు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. ఆర్నెల్ల పాపాయిలకోసం ఘనాహారం వైపునకు వుళ్లించేందుకు వూర్కెట్లో దొరికే ఖరీదైన ఆహారపదార్థాలు కాకుండా ఇంట్లోనే లభ్యవుయ్యే పదార్థాలతో పోషకాలు ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తయారుచేసి అందించవచ్చు. పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని వీనింగ్‌ అంటారు.

వీనింగ్‌ సమయంలో పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, కండరాల పెరుగుదల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. ఈ సవుయంలో 4 నుంచి 6 నెలల వయస్సులో...  వరి, రవ్వ లాంటి వాటితో బాగా మెత్తగా వండిన పదార్థాలు, ఐరన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు; 6 నుంచి 8 నెలల వయస్సులో...   బాగా గుజ్జులా ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొద్దిగా తాజా పండ్లు, 8 నుంచి 10 నెలల వయస్సులో ... (మాంసాహారం తినేవారైతే) గుజ్జుగా ఉడికించిన  వూంసం, చికెన్, చేపలు, గుడ్డుతో పాటు తినదగిన తృణధాన్యాలు; 11–12 నెలల వయస్సులో...     బాగా తరిగిన ఆహారం నుంచి క్రవుంగా పెద్ద వుుక్కలుగా కోసిన ఆహారం అన్ని పోషకాలు ఉన్న ఆహారం వంటి వాటివైపునకు వుళ్లించాలి.

ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు... పెరిగే పిల్లల కోసం...
ఇక మొదటి ఏడాది నుంచి పన్నెండు, పదమూడేళ్ల వరకు ఎదిగే వయసు కాబట్టి, అందుకు వీలుగా అన్ని రకాల పోషకాలు, విటమిన్లూ, మినరల్స్, మైక్రోన్యూట్రియెంట్స్‌... ఇవన్నీ పుష్కలంగా ఉండే పదార్థాలు తినిపించాలి. ఇందుకోసం వాళ్ల ఆహారంలో పొట్టుతో ఉండే కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ధాన్యాలు... అంటే గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు మొదలైనవి ఇవ్వండి. బేకరీ పదార్థాల కంటే  తాజా పండ్లనే ఎక్కువగా తినిపించాలి. ఎముకల ఆరోగ్యం కోసం... క్యాల్షియం ఎక్కువగా అందేలా చూడాలి. ఇందుకోసం వారికి రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌) తప్పనిసరిగా ఇవ్వాలి. ఆహారంలో భాగంగా అన్నం, చపాతి వంటి కార్బోహైడ్రేట్లతో పాటు పప్పులు (దాల్‌) లేదా శెనగలు, రాజ్మా వంటి ప్రోటీన్లు తీసుకునేలా చూడాలి. రోజూ ఓ కప్పు పెరుగు కూడా ఇస్తే మంచిదే. చాక్లెట్లు బిస్కెట్లకు బదులు కూరగాయలను సలాడ్స్‌రూపంలో తింటుండేలా వారికి అందుబాటులో ఉంచాలి.

వీటిని పిల్లలు చిరుతిండిలా నమలడం అలవాటు చేయండి. ప్రతిరోజూ ఉదయం రాత్రి గ్లాసెడు పాలు ఇవ్వండి.  ఇలా వారు తినేది తక్కువైనా... అందులోనే సాధ్యమైనన్ని వెరైటీలు... తాజా పళ్లు, తృణధాన్యాలు ఉండేలా చూడండి. ఇచ్చే పదార్థాలన్నీ వాళ్లు ఇష్టంగా తినేలా చూడాలి. ఉదాహరణకు పిల్లలు పండ్లు తినకుండా మారాం చేస్తుంటే... వాటిని  ఫ్రూట్‌ సలాడ్స్‌గా, కస్టర్డ్‌తో కలిపి పెట్టడం చేయండి. జ్యూస్‌గా తీసి ఇవ్వండి. పాలు తాగకపోతే మిల్క్‌షేక్‌గా మార్చి ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి. మాంసాహారం, చేపలూ (తినేవారైతేనే), లెగ్యూమ్స్‌ (దాల్స్‌), బాదాం, జీడిపప్పు, వాల్‌నట్‌ వంటి నట్స్‌ ఇవ్వాలి. వెన్న, నెయ్యి వంటి కొవ్వులుంటే ఆహారం ఎక్కువగా వద్దు.   వెన్న, నెయ్యి లాంటి శాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలను రుచికోసం మాత్రం  కొద్దిగానే తీసుకోవాలి. వేపుళ్లు కూడా అవాయిడ్‌ చేయాలి.

రజస్వల అయ్యే  వయసులోని అమ్మాయిలకు...  
అమ్మాయిలు సాధారణంగా తొమ్మిది, పదేళ్ల నుంచి పన్నెండు, పదమూడేళ్ల లోపే రజస్వల అవుతుంటారు. ఆ టైమ్‌లో కోల్పోయిన  ఐరన్‌ భర్తీ చేసుకోడానికి ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమ్మాయిలకు ఇవ్వడం వుంచిది. అంటే వూంసాహారం తినేవాళ్లయితే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, గసగసాలు (జింజెల్లీ సీడ్స్‌), అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్‌ వచ్చే వుుందే ఇవ్వాలి. పీరియడ్స్‌ సమయంలో ఉప్పు, కొవ#్వలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వడాన్ని అవాయిడ్‌ చేయండి. ఆ సవుయంలో అవి తీసుకుంటే ఆడపిల్లలు వుందకొడిగా ఉంటారు. ఒకేసారి ఎక్కువగా ఆహారం ఇవ్వడానికి బదులుగా కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహరం ఇవ్వండి. పీరియడ్స్‌  సవుయంలో అమామయిలకు  నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తుండండి. 

కౌమార యువత నుంచి మధ్య వయసు వచ్చే వరకు...
పదహారు లేదా 18 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి 45 ఏళ్లు వచ్చే వరకు ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసేవే ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు బియ్యం విషయానికి వస్తే దంపుడుబియ్యం, ఇతర ధాన్యాల్లో పొట్టుతీయని ముడి ధాన్యాలు తీసుకోవాలి. అలాగే కూరల విషయంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్‌) మంచివి. మాంసాహారంలో చేపలు చాలా మంచి ఆహారం.  అయితే మాంసాహారం తీసుకునేవారు ప్రోటీన్‌ల కోసం రెడ్‌ మీట్‌ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ వంటి వైట్‌ మీట్‌ తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. అరటి, నారింజ  వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. వాటితో పాటు పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలని నిర్ణయించుకోండి. 

మేలు చేయని ఆహారాలు:  కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌. మిగతా జాగ్రత్తలు  
►ఎముకలు గట్టిపడేలా విటమిన్‌–డి అందేలా రోజూ ఆరుబయట లేత ఎండలో/ సూర్యకాంతిలో నడవాలి
►ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లోని వారైతే... యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అవలంబించాలి. ఎప్పుడూ సానుకూల ధోరణితో (పాజిటివ్‌ దృక్పథంతో) ఉండాలి
►రోజు శరీరం అలసిపోయేలా వ్యాయామం చేయాలి
►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి
►నిద్ర విషయానికి వస్తే కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి.

మధ్యవయస్కుల నుంచి వృద్ధాప్యపు తొలి దశ వరకు... 
►మధ్య వయసు అయిన 45–48 ఏళ్ల నుంచి వృద్ధాప్యపు తొలి దశ అయిన 65–68 ఏళ్ల వరకు చాలా మందిలో
►డయాబెటిస్‌
►హైబీపీ
►ఆర్థరైటిస్‌
►గుండెజబ్బులు
►కొన్ని రకాల క్యాన్సర్లు
►మహిళల్లో హార్మోనల్‌ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ఒక వయసు దాటాక రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్‌ వంటివి కనిపిస్తుంటాయి. ఈ వయసులో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ►జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ప్రధానమైనవి...
►గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం...
►రోజూ ఆటలాడటం  
►రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు రక్తదానం చేయడం
►గుండెకు ఆరోగ్యాన్నిచ్చే కార్డియో వ్యాయామాలు చేయడం
►కనీసం వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి
►ఇక రక్తపోటు విషయానికి వస్తే అది ఎప్పుడూ 120–130 / 70–80 ఎంఎం హెచ్‌జీ లోపు ఉండేలా చూసుకోవాలి.  రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కోసం ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు వంటివి తినడం వంటి మంచి అలవాట్లు చేసుకోండి. ఒకవేళ మీ రక్తపోటు (డయాస్టోలిక్‌ ప్రెషర్‌)  90 కు మించి ఉంటే తక్షణం డాక్టర్‌ను సంప్రదించండి
►డయాబెటిస్‌ ఉన్నవారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే హాస్పిటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 70 ఏళ్లు వచ్చేవరకు ఆరోగ్యంగా గడపవచ్చు.

68 నుంచి 70 ఏళ్లు దాటిన వృద్ధుల విషయంలో... 
ఇక 68 ఏళ్ల నుంచి 70 ఏళ్లు దాటాక మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మాత్రం తరచూ హాస్పిటల్‌కు వెళ్లి ఏ టైమ్‌లో తీసుకోవాల్సిన వ్యాక్సిన్లను ఆ టైమ్‌లో  తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు... అంతకు ముందు ఎప్పుడూ తీసుకోని వారు ఒక డోసు ‘న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటితే మరోసారి ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది.

ప్రతి పదేళ్లకోమారు టెటనస్‌–డిఫ్తీరియా బూస్టర్‌ డోస్‌ తీసుకుంటూ ఉండాలి ∙గతంలో ఎప్పుడూ తీసుకోకపోతే 70 ఏళ్లు దాటక టీ–డాప్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది) ∙అరవై లేదా డెబ్భై దాటాక షింగిల్స్‌ లేదా హెర్పిస్‌ జోస్టర్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు.

డాక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్,
మ్యాక్స్‌ క్యూర్‌ హాస్పిటల్,మాదాపూర్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top