కుంచెడు కృతజ్ఞత | World Art Day Special Story | Sakshi
Sakshi News home page

కుంచెడు కృతజ్ఞత

Apr 15 2020 7:35 AM | Updated on Apr 15 2020 7:35 AM

World Art Day Special Story - Sakshi

నర్సుల గొప్పతనాన్ని కీర్తిస్తూ చైనా పౌరులు వేసిన కొన్ని చిత్రాలు

సైన్యం రెండు రకాల యుద్ధాలు చేస్తుంది. శత్రువును చొరబడనివ్వని యుద్ధం. తెగబడి వస్తే.. సంహరించే యుద్ధం. కరోనాపై ఇప్పుడు జరుగుతున్నది సంహారయుద్ధం.ఈ యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌ సైనికులు.. నర్సులు.కరోనా కొమ్ముల్ని వంచుతున్నారు.‘అంటు’ కొమ్మల్ని నరికేస్తున్నారు.

విరామం లేదు.. విరమణ లేదు..ఇల్లు లేదు..  వదిలేసి వెళ్లేది లేదు.‘సిస్టర్‌.. ఊపిరి అందట్లేదు’.. అటొక పరుగు.‘సిస్టర్‌.. మీ పాప వచ్చింది’.. ఇటొక పరుగు.ఎలా తీర్చుకోవాలి ఈ సైనికుల రుణం?ఎలా ఓర్చుకోవాలి ఈ కృతజ్ఞతా భారం?

కరోనా నుంచి చైనాను గట్టెక్కించిన వైద్య సేవకులలో తొంభై శాతం మంది మహిళా నర్సులే. కరోనాపై పోరాటం ఎలా ఉంటుందో ప్రపంచం మొదట చూసిందీ.. మాస్కులు తొలగిన ఆ చైనా నర్సుల ముఖాల్లోనే! ఒత్తుకుపోయి, నొక్కుకుపోయి, కమిలిపోయి..! మూడు నెలల పోరాటం తర్వాత చైనా ఇప్పటికి కాస్త కుదుట పడింది. ఆ దేశ ప్రజలు నర్సులకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నారు. మాటల్లో చెప్పలేనిది పాట అవుతుంది. నర్సులను కీర్తిస్తూ పాటలు పాడారు. సరిపోలేదు. మాటలు, పాటలు కాదని నిశ్శబ్ద, నిశ్చల చిత్రాలను గీయడం మొదలు పెట్టారు. ‘పవర్‌ ఉమన్‌’ గా నర్సులను రేఖాచిత్రాల్లోకి తెచ్చారు. ఒక యువతి.. నర్సు బాధ్యతల్ని తొడుక్కుంటోంది. ‘రూపాంతర చిత్రం’ అది.  ఒక ‘సిస్టర్‌’ కరోనాపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ‘సిస్టర్‌ వారియర్‌ చిత్రం’ అది. నర్సులు ఒకరికి ఒకరు ఊతం ఇచ్చుకుంటూ రోగులకు ఊపిరులు ఊదుతున్నారు. ‘నిరంతర సేవల చిత్రం’ అది. ఇంకా..  నర్సుల  నిస్వార్థానికి, అంకితభావానికి ప్రతీకగా అనేక చిత్రాలు.. గీశారు, గీస్తున్నారు చైనా పౌరులు.

ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఏమిచ్చినా తక్కువే అనిపిస్తున్నప్పుడు.. ‘ఆర్ట్‌’తో భారాన్ని దించుకోవచ్చు. అయితే ‘ఆర్ట్‌ ఎప్పటికీ పూర్తి కాదు. వదిలేసి వెళ్తామంతే’ అనే మాట వినే ఉంటారు. ఆ మాట అన్నది ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్చీ. ఇవాళ ఆయన జన్మదినం. యేటా ఈరోజు ‘వరల్డ్‌ ఆర్ట్‌ డే’ జరుపుకుంటున్నాం. నర్సుల త్యాగనిరతిని, క్రియాశీలత్వాన్ని స్తుతించడానికి చేతుల్లోకి మనం ఎన్ని కుంచెలు, ఎన్ని రంగులు తీసుకున్నా.. ఆ చిత్రాలు ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటాయి. తలవడమే తప్ప కొలవలేం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement