స్త్రీ రక్షణ ఇంకా ముఖ్యం

Woman protection is still important - Sakshi

నిరసన

అది ఢిల్లీలోని ఇండియా గేట్‌. అక్కడ ఒక స్త్రీ ఆవు మాస్క్‌ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. కలకత్తాలోని హౌరాబ్రిడ్జ్‌. అక్కడ మరో స్త్రీ ఆవు మాస్క్‌ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. ముంబైలో అరేబియా సముద్రం ఎదురుగా నిలుచుని ఉన్న ఆవు మాస్క్‌ స్త్రీ ఫొటోను కూడా అతడు తీశాడు.ఈ మూడు చోట్ల అనే ఉంది... దేశమంతా తిరుగుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆవు మాస్క్‌ ధరించిన స్త్రీలను సుజాత్రో ఘోష్‌ అనే ఆ 23 ఏళ్ల కుర్రవాడు ఫొటో తీయదలుచుకున్నాడు. తీసి వాటిని సోషల్‌ మీడియాలో పెట్టదలుచుకున్నాడు. ఎందుకు?దేశమంతా స్త్రీలు ఉన్నారు గనుక.అయితే?వారి మీద అత్యాచారాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి కనుక.దానికి ఇలాంటి నిరసన ఎందుకు? దేశంలో స్త్రీ రక్షణ కంటే మిన్నగా మత విశ్వాసాలు ముందుకొచ్చాయి. స్త్రీను కాపాడుకోవడంలో కంటే మత విశ్వాసాన్ని కాపాడుకోవడంలో మెజారిటీ సమాజం, రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. స్త్రీ మీద అత్యాచారం జరిగితే అరెస్టులు, శిక్షలు తేలడానికి ఏళ్లు పడుతుంది. కాని మత విశ్వాసాల విషయాలలో ఆఘమేఘాల మీద చట్టాలు, ఆర్డినెన్స్‌లు జారీ అయిపోతున్నాయి.

‘ఇది సరికాదు’ అంటాడు సుజాత్రో ఘోష్‌.కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడిన ఈ ఫొటోగ్రాఫర్‌ దేశంలో జరుగుతున్న అత్యాచారాల పై కలత చెందాడు. తన వంతుగా సృజనాత్మకంగా నిరసన తెలియ చేయాలనుకున్నాడు. ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు మాస్క్‌ కొని తెలిసిన స్త్రీకి తొడిగి ఒక ఫొటో తీశాడు. ఆ ఫొటో చూశాక అతడికి తన నిరసన విధానం ఏమిటో తెలిసి వచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాలలో వివిధ స్త్రీలను ఆవు మాస్క్‌తో ఫొటోలు తీసి స్త్రీ రక్షణ పట్ల సమాజం, ప్రభుత్వాలు చైతన్యవంతం అవడానికి కృషి చేస్తున్నాడు.ఈ ప్రయత్నం అతణ్ణి పాపులర్‌ చేస్తోంది. అయితే ఊహించినట్టుగానే కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కొడతాం, చంపుతాం అని మెసేజ్‌లు పెట్టినవారు కూడా ఉన్నారు. కాని వేలాది మంది స్త్రీలు కుల, మతాల ప్రమేయం లేకుండా తన నిరసన విధానానికి మద్దతు పలకడం చూసి సుజాత్రో ధైర్యంగా ఉన్నాడు.మంచి పనికి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. నా నిరసన ఆగదు అన్నాడతను.‘‘గోవు పట్ల సమాజంలో ఉన్న మనోభావాలకు విలువ ఇవ్వాల్సిందే. కాని గోవు కంటే ముందు స్త్రీ మాన ప్రాణమే ముఖ్యం అని భావించే సమాజాన్ని కూడా ఆశించడం అవసరమని ఇటీవలి అత్యాచార ఉదంతాలు నిరూపిస్తున్నాయి కదూ’’ అంటాడు సుజాత్రో. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top