
తిరువనంతపురం: ‘నేను భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు, మా పార్టీని ఇష్టపడే వారి కోసమే కాకుండా, భారతీయులందరి కోసం మాట్లాడతాను. ఎవరైనా సరే పార్టీ ప్రయోజనాల కన్నా దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని’ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పిలుపునిచ్చారు. ఇందుకు ఉదాహరణగా దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ‘భారతదేశమే నశించిపోతే ఇక ఎవరు బతుకుతారు?’ అని ప్రశ్నించారు. జాతీయ ఐక్యత అనేది రాజకీయ వైరాన్ని అధిగమించాలని థరూర్ పేర్కొన్నారు.
#WATCH | “To my mind, the nation comes first,” says Congress MP Shashi Tharoor, stressing that national security must rise above party lines. 🛡️
He calls for inter-party cooperation when the country’s interest is at stake, even if it ruffles feathers. 🇮🇳🗳️#ShashiTharoor… pic.twitter.com/Ut5FjJcEW4— Moneycontrol (@moneycontrolcom) July 20, 2025
ఇటీవలి కాలంలో ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కాంగ్రెస్ చేపడుతున్న దౌత్యపరమైన ప్రచారం, జాతీయవాద వైఖరిపై వస్తున్న విమర్శల నేపధ్యంలో శశి థరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ‘దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టి, భారతదేశం కోసం పనిచేయాలి. అప్పుడే మనమంతా శాంతియుతంగా జీవించగలం. నా దృష్టిలో దేశానికే తొలి ప్రాధాన్యత.. పార్టీలన్నీ దేశాన్ని మెరుగుపరచడానికి గల సాధనాలు. ఏ పార్టీకి చెందినవారైనా, ఆ పార్టీకి అనుగుణమైన మార్గంలో నడుచుకుంటూ మెరుగైన భారతదేశాన్ని రూపొందించేందుకు కృషిచేయాలి’ అని అన్నారు.
శశిథరూర్ తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంబంధాలు, భారత వైఖరిని అమెరికా వంటి దేశాలకు తెలియజేసేందుకు ఏర్పాటైన అఖిలపక్ష ప్రతినిధి బృందానికి శశిథరూర్ నాయకత్వం వహించారు. ఈ సమయంలో ఆయన ప్రసంగాలపై పలు విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పరోక్షంగా థరూర్‌ను లక్ష్యంగా చేసుకుని, కాంగ్రెస్ పార్టీ దేశానికే ప్రాధాన్యతనిస్తుందని, అయితే కొందరు ముందు ప్రధాని మోదీ, తరువాత దేశం అనే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు.