నిద్రలో మీరు ఎందుకు నవ్వారంటే... | Sakshi
Sakshi News home page

నిద్రలో మీరు ఎందుకు నవ్వారంటే...

Published Tue, Mar 3 2015 11:10 PM

నిద్రలో మీరు ఎందుకు నవ్వారంటే...

 నవ్వుతూ నవ్వుతూనే నిద్ర నుంచి మేల్కొంటాం.‘ఇంతకీ ఎందుకు నవ్వాను’’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తాజా కలను గుర్తు తెచ్చుకుంటాం. నిజానికి, అది మామూలు కల. నవ్వాల్సినంత సీనేమి దానిలో ఉండదు. మరి  ‘నవ్వు’ సంగతి ఏమిటి? కలలో నవ్వు అనేది ఆహ్లాదకరమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది.

ఒక సమస్యతో విపరీతంగా విసిగి వేసారి... ఎట్టకేలకు ఆ సమస్య నుంచి ‘విముక్తి’ దొరకడం కావచ్చు, పనిభారంతో ఒత్తిడికి గురవుతూ...ఆ పని పూర్తికాగానే లభించే ‘ఉపశమనం’ కావచ్చు, ఓటమి మీద ఓటమి ఎదురై...చివరికి ఊహించని అనూహ్యమైన విజయం ఎదురైనప్పుడు లభించే ‘ఆనందం’ కావచ్చు....ఇలా వివిధ రకాల ఆహ్లాదకర భావనల సమ్మేళనమే ఈ కల. ప్రేమలో పడినప్పుడు  కూడా ఇలాంటి కలలు వస్తాయి. ప్రేమలోని గాఢతను ఈ నవ్వు సూచిస్తుంది.

మరో కోణం ఏమిటంటే, సుఖదుఃఖాలకు అతీతమైన  స్థితిలోకి చేరినప్పుడు... ఎంత పెద్ద కష్టమైనా, దుఃఖమైనా మనసు తలుపు తట్టదు. ఇక్కడ ‘నవ్వడం’ అనేది భావోద్వేగాలకు అతీతమైన ‘సమ్యక్ దృష్టి’ అనే  భావనను సూచిస్తుంది.
 
 

Advertisement
Advertisement