బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?

Published Wed, Oct 28 2015 11:56 PM

What is preventing brain stroke?

ఆయుర్వేదం కౌన్సెలింగ్
 
నేను దానిమ్మ, సీతాఫలం చాలా ఇష్టంగా తింటుంటాను. అవి బాగా చలువ పదార్థాలనీ, ఆ పండ్లను తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని అంటున్నారు. మేము ఆయుర్వేదాన్ని విశ్వసిస్తాము. ఆయుర్వేదంలో వీటి ప్రస్తావనలు ఉంటే వివరించండి.
 - పేరి రామశర్మ, బొబ్బిలి

 మీరు విన్న నష్టాలు కేవలం అపోహలు మాత్రమే. దానిమ్మను సంస్కృతంలో దాడిమ, దంతబీజ, లోహితపుష్పక అంటారు. రుచిని బట్టి ఇందులో తియ్యటివి, పుల్లటివి, రెండింటి సమ్మేళనంతో ఉన్నవి అని మూడు రకాలుగా ఉంటాయి. ఈ ఫలం శరీరానికి చాలా మంచిది. దేహంలో మంట, జ్వరం, దప్పికలను తగ్గిస్తుంది. హృదయదౌర్బల్యం, నోటిపూతలను పోగొడుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.  శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. అరుచి, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించి, జీర్ణాశయాన్ని బలవత్తరం చేస్తుంది. రక్తవర్థకం, శక్తివర్థకం. శుక్రకరం.     ఈ చెట్టు బెరడును ఎండించి, చూర్ణం చేసి ఒక చెంచా పొడిని నీళ్లతో సేవిస్తే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొంటే కోరింత దగ్గు తగ్గుతుంది. పండుపై తొక్కను దంచి, రసం తీసి తేనెతో నాకిస్తే గర్భిణుల్లో అయ్యే వాంతులు తగ్గుతాయి. దీని పువ్వులను ఎండబెట్టి చూర్ణం చేసి తేనెతో కలిపి సేవిస్తే గొంతుబొంగురుపోయినప్పుడు సత్వరమే గుణం కనిపిస్తుంది. దానిమ్మ ఆకులను దంచి కనురెప్పలపై ఉంచితే కండ్లకలక తగ్గుతుంది.

సీతాఫలాన్ని సంస్కృతంలో ‘గండగాత్ర, కృష్ణబీజ’ అంటారు. ఈ ఫలం మధురరసం, శీతవీర్యం, గురు, స్నిగ్ధ గుణాత్మకం, శరీరానికి శక్తిని, పుష్టిని కలిగిస్తుంది. శరీరంలోని మంటలను తగ్గించి రక్తస్రావాలను అరికడుతుంది. దీని ఆకులు కొంచెం వేడిచేసి, ముద్దగా చేసి పట్టువేస్తే సెగగడ్డలు తగ్గుతాయి. పిప్పిపన్ను బాధతగ్గుతుంది. పచ్చి పండులోని గింజలను నీటితో ముద్దగా నూరిగానీ లేదా ఎండించిన గింజల చూర్ణాన్ని కొబ్బరినూనెతో కలిపిగానీ శిరోజాలకు పట్టించి, రాత్రిపూట ఉండనిచ్చి మర్నాటి ఉదయం తలస్నానం చేస్తే పేలు తగ్గుతాయి. ఈ గింజలను మేకపాలతో నూరి లేపనం చేస్తే శిరోజాలు దృఢంగా వృద్ధిచెందడమే గాక, పేనుకొరుకుడు వచ్చిన చోట్ల వెంట్రులు మొలిచే అవకాశముంది. కాయల్ని, గిజలను ఎండించి, చూర్ణం చేసి పంటలపై ప్రయోగిస్తే చీడపీడలూ తొలగిపోతాయి.

 గమనిక: కాకపోతే సీతాఫలంలోని అనేక భాగాలు కళ్లకు హానికరమని గుర్తుంచుకోవాలి. కాబట్టి వాటిని కళ్లకు దూరంగా ఉంచాలి. విత్తులు గర్భపాతకరం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. బహుశా ఈ అంశాలనే మీ మిత్రులు ప్రస్తావించి ఉంటారు. ఈ జాగ్రత్త మినహా మిగతా అన్ని అంశాలలో సీతాఫలం పూర్తిగా ఉపయోగకరం.
 
న్యూరో కౌన్సెలింగ్
 నా వయసు 33. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. ఇటీవల నాతో పనిచేస్తున్న నా మిత్రుడు అకస్మాత్తుగా మృతిచెందారు. ఎలా మృతి చెందారని విచారిస్తే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. అతనిదీ నా వయసే. మా స్నేహితుడు ఆకస్మికంగా మరణించినప్పటి నుంచి నాతో పాటు నా స్నేహితులందరూ భయాందోళనకు గురవుతున్నారు. మా అందరికీ డెడ్‌లైన్లు ఉండడంతో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మా స్నేహితుడికి ఈ వయసులో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - వివేక్, హైదరాబాద్

 బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తీసుకువెళితే క్లాట్ బర్‌స్టింగ్ థెరపీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాట పడిపోకుండా కాపాడవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడానికి ప్రతి ఒక్కరిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు బయటపడతాయి. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటును బట్టి లక్షణాలు ముఖం బలహీనం కావడం, మూతి వంకరపోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.     ఈ హెచ్చరికలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. ఒకవేళ మీకు రక్తపోటు, మధమేహంగానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకుంటూ మీ బరువును అదుపులో ఉంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలావరకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోగలుగుతారు.
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 50 ఏళ్లు. నాకు గత పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈ మధ్య ప్రయాణాలు చేసేప్పుడు ఎక్కువగా కాళ్ల వాపులు వస్తున్నాయి. నా బ్లడ్‌టెస్ట్‌లో క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్, యూరియా  28 ఎంజీ/డీఎల్ అని ఉన్నాయి. పోటీన్ మూడు ప్లస్ అని చెప్పారు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి.
 మనోహర్‌నాయుడు, కోదాడ

 మీ రిపోర్టు ప్రకారం మీకు యూరిన్‌లో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది. ఇది షుగర్ వల్ల వచ్చిన కిడ్నీ సమస్య వల్లనా లేదా ఇతర కారణాల వల్లనా అనే అంశం తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్‌ను కలిసి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నట్లయితే యూరిన్‌లో ప్రోటీన్ పోవడానికి కూడా అదే కారణం వల్లే అయి ఉంటుందని గుర్తించాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారం తీసుకోకముందు 100 ఎంజీ/డీఎల్, భోజనం తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేట్లుగా చూసుకోవాలి. కొలెస్టరాల్ పాళ్లనూ, బీపీ నియంత్రణలో ఉంచుకోవాలి. యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గించడం కోసం డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు తీసుకోవాలి. అవేకాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. అలాగే నొప్పి నివారణ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు.
 
 మా అబ్బాయి వయసు ఐదేళ్లు. ఈ మధ్య పొద్దునే లేచినప్పుడు వాడి కళ్లు, కాళ్లలో వాపు కనిపిస్తోంది. యూరిన్ పరీక్షల్లో ప్రోటీన్ మూడు ప్లస్ అని అన్నారు. తగిన సలహా ఇవ్వండి.
 - ప్రసాద్‌బాబు, అనకాపల్లి

 మీ బాబుకు నెఫ్రోఇక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పడతాయి. మొదట ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటలలో యూరిన్ ప్రొటీన్ టెస్ట్ చేయించండి. సీరమ్ అల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఇది చాలా సాధారణమైన సమస్య.  మొదటి మూడు నెలలూ స్టెరాయిడ్స్ వాడాలి. పదిహేనేళ్లలోపు పిల్లల్లో ఇది మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మందులు పూర్తికాలం వాడితే మొదటిసారి వచ్చినప్పుడే తగ్గిపోతుంది. ఆహారంలో ఉప్పు, కొవ్వు తగ్గించాలి. ఇన్ఫెక్షన్ వస్తే ఇది మళ్లీ రావచ్చు. కాబట్టి ఇన్ఫెక్షన్‌ను నివారించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement