
రాత్రంతా మేలుకుని, పగలు నిద్రపోయే వారు తమ ఆరోగ్యంపై మరికొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కొన్ని రోజులపాటు ఈ రకంగా చేసినా. వారి రక్తంలో ఉండే వంద రకాల ప్రొటీన్లలో మార్పులు చోటు చేసుకుంటాయని కెన్నెత్ రైట్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఇలా మార్పు చెందే ప్రొటీన్లలో రక్తంలో చక్కెర శాతాన్ని, జీవక్రియను, రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయగలవి ఉండటం గమనార్హం. ఈ కారణంగానే విమాన ప్రయాణం తరువాత లేదంటే నైట్ షిఫ్ట్‌లు చేసే వారిలో నిస్సత్తువ, నీరసం వంటివి కనిపిస్తాయని, రాత్రిళ్లు పని.. పగలు నిద్రలను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తే.. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఎక్కువ అవుతుందని వివరించారు
. రక్తంలో ఉన్న దాదాపు 30 ప్రొటీన్లు నేరుగా శరీరంలోని గడియారంపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అంచనా. గ్లూకగాన్ ప్రొటీన్‌నే తీసుకుంటే ఇది రక్తంలోకి మరింత ఎక్కువ చక్కెర చేరేలా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర తక్కువైన సందర్భంలో ఇది ఎక్కువైంది. సాధారణంగా ఈ మార్పు పగటిపూట జరిగేది. రాత్రిషిఫ్ట్‌లలో పనిచేసే వారి ఆరోగ్య పరిరక్షణకు కొత్త చికిత్సమార్గాలను వెతికేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని కెన్నెత్ రైట్ తెలిపారు.