Sakshi News home page

వీణావాణి ఫ్యామిలీ

Published Fri, Jul 1 2016 11:41 PM

వీణ‌-వాణిల అక్క అఖిల‌, త‌ల్లి నాగ‌ల‌క్ష్మి, తండ్రి ముర‌ళి, చెల్లి అంబిక‌ - Sakshi

ఆ‘పరేషాన్
వీణ-వాణి... వీరు 2003 అక్టోబరు 16న కలిసి పుట్టారు. దేహాలే వేరు, తలలు కలిసే ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వీరి శస్త్ర చికిత్స అంశంపై తరచు ప్రస్తావనకు వస్తోంది. వీరికి పన్నెండేళ్లు నిండాయి. (ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ జూన్ 30 గురువారం సంచికలో స్పెషల్ స్టోరీ ఇచ్చింది) నీలోఫర్‌లో పన్నెండేళ్లలోపు వారే ఉండాలనే నిబంధన ఉండడంతో వీరిని అక్కడి నుంచి తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటనేది అయో మయంగా మారింది. వీణ-వాణిల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు మారగాని మురళీ- నాగలక్ష్మీలను ‘సాక్షి’ ఫ్యామిలీ పలకరించింది. వారి మనోగతాన్ని తెలుసుకుంది.
 
వీణ-వాణిల పుట్టుకను దేవుడే నిర్ణయించాడు. ఆ దేవుడినే నమ్ముకున్నాం. అంతా మంచి జరుగుతుందనే ఆశతో ఉన్నాము. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా వీరిని విడదీసే శస్త్ర చికిత్సకు మాత్రం ముహూర్తం కుదరడంలేదు. ఇన్నాళ్ల పరిస్థితి వేరు. వీణ-వాణిలు ఇప్పుడు పెద్దవాళ్లవుతున్నారు. స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పటికే ఒక్కో సందర్భాల్లో ఒకరి అభిప్రాయం ఒక్కోలా ఉంటోంది. అమ్మాయిలు కావడం వల్ల ఇక నుంచి సమస్యలు పెరుగుతాయి. పరిణామాలు ఎలా ఉన్నా...

ఇప్పుడు శస్త్ర చికిత్స చేయడమే సరైనదని భావిస్తున్నాము. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ ఇప్పుడు అలవాటైంది. శస్త్ర చికిత్సతోనే ఇన్నాళ్లుగా... వాళ్లిద్దరు, మేము అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కలుగుతుంది. దీనికి ఇదే సరైన సమయం. ప్రభుత్వం, వైద్యులు స్పందించి ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలి.
 
ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదు
వీణ-వాణిలకు నీలోఫర్ తల్లి లాంటిది. 2006 ఏప్రిల్ 19 నుంచి వాళ్లు అక్కడే ఉంటున్నారు. ఇద్దరి బాగోగులు నీలోఫర్ డాక్టర్లు, సిబ్బందే చూస్తున్నారు. సమయానికి అన్నీ సమకూర్చుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా టీచర్‌ను పెట్టారు. ఇద్దరూ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడగలుగుతున్నారు. పుట్టిన రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు వీణ-వాణిలకు నీలోఫర్ తల్లిగా, తండ్రిగా నిలిచింది. మా కన్న బిడ్డలే అయినా పరిస్థితుల వల్ల మేం వారికి ఏమీ చేయలేకపోతున్నాము. వారికి దూరంగా బతుకుతున్నాము.

ఇప్పుడు వారికి అన్నీ తెలుస్తున్నాయి. ఇటీవల వారి దగ్గరికి వెళ్లినప్పుడు... ‘అక్క, చెల్లెను మీ దగ్గర ఉంచుకుంటున్నారు. మమ్మల్ని మాత్రం ఇక్కడే ఉంచుతున్నారు. మేం అనాథలమా? ఎందుకమ్మా ఇలా’ అని అడిగారు. వారి ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియలేదు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు.
 
ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు
జూన్ మొదటి వారంలో నిలోఫర్ అధికారులు ఫోన్ చేశారు. ‘జూన్ 8న నిలోఫర్ బోర్డు మీటింగ్ ఉంది, వీణ-వాణిల అంశం చర్చిస్తాము. ఆ రోజు మీరు రావాలి’ అని చెప్పారు. మేం వెళ్లాము. ఎయిమ్స్ పరీక్షల నివేదికలు వచ్చాయని వివరించారు. శస్త్ర చికిత్స చేస్తే ఇద్దరి ప్రాణానికి హామీ ఇవ్వలేని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమయ్యేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయని లండన్ వైద్య బృందం చెప్పిన విషయం గుర్తు చేశాము.

లండన్ వైద్య పరీక్షల నివేదికను వివరించారు. శస్త్ర చికిత్సలో ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. 12 ఏళ్ల లోపు వారే నీలోఫర్‌లో ఉండాలనే నిబంధన ఉందని చెప్పారు. వీణ-వాణిలను ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ వార్త మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. వీణ-వాణిలు పుట్టినప్పటి నుంచి ఆస్పత్రుల్లోనే ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. మా ఊళ్లో పరిస్థితి వేరు. వైద్య ఖర్చుల కోసం ఉన్న అర ఎకరం పొలం అమ్మేశాను.

నేను ఆటో నడుపుతుంటా. నాగలక్ష్మి కూలి పనులు చేస్తుంటుంది.  మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండలేము. అలా అని వీణ-వాణిలను ఊళ్లోకి తీసుకురాలేము. ఏం చేయాలో అయోమయంగా ఉంది. శస్త్ర చికిత్స కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. వీణ-వాణిలకు శస్త్ర చికిత్స చేయించడమే మంచిదనే ఉద్దేశంతో ఉన్నాము.సూర్యాపేట నుంచి...
పిల్లలు నల్లగొండ జిల్లా సూర్యపేటలోని విజయకృష్ణ నర్సింగ్ హోమ్‌లో పుట్టారు. తలలు కలిసి పుట్టడం మాకు అప్పుడు వింతగా అనిపించింది. విజయకృష్ణ నర్సింగ్ హోం నిర్వాహకురాలు డాక్టర్ విజయ మేడమ్ గుంటూరులోని డాక్టర్ నాయుడమ్మ దగ్గర పనిచేశారు. మా సంతానం విషయాన్ని విజయ మేడమ్ డాక్టర్ నాయుడమ్మతో చెప్పారు. మూడోరోజు నాయుడమ్మ సార్ వచ్చి పరిశీలించారు. వీణ-వాణి అని వాళ్లకు ఆయనే పేరు పెట్టారు. పిల్లలను గుంటూరుకు తీసుకెళ్లారు.

వీణ-వాణిల తలలు అంటుకుని ఉన్నాయి. పూర్తిగా అంటుకుని ఉండకుండా చర్మం పొరను విడదీసీ మళ్లీ కలవకుండా శస్త్రచికిత్స చేశారు. మరోసారి శస్త్రచికిత్స చేసి విడదీసే ప్రయత్నం చేస్తామని అన్నారు. వాళ్లు రెండున్నరేళ్లు గుంటూరులోనే డాక్టర్ నాయుడమ్మ సార్ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నాయుడమ్మ సార్ రిటైర్ అయ్యారు. అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చాము. సూపరింటెండెంట్ ఎన్‌సీకే రెడ్డి సార్ వీణ-వాణిని నీలోఫర్‌లోనే పెట్టుకుంటామని చెప్పారు.

పలుసార్లు పరీక్షలు నిర్వహించడం, శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు పలు దేశాల వైద్యులు రావడం, పరీక్షలు నిర్వహించడం అప్పటి నుంచి కొనసాగుతోంది. 2008లో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే మూడు నెలలు ఉన్నారు. డాక్టర్ ఆశిష్‌మెహతా పరిశీలించారు. శస్త్ర చికిత్సకు అవసరమైన వైద్య పరీక్షల కోసం చెన్నైకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్సకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. చేస్తే వీణ-వాణిల ప్రాణానికి భరోసా ఇవ్వలేమని, ఒకరే బతికే అవకాశం ఉందని చెప్పారు.

అక్కడి నుంచి మళ్లీ నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. 2009 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీలోఫర్‌కు వచ్చి వీణ-వాణిలను పరామర్శించారు. ఆ సంఘటన మరిచిపోలేం. వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స చేయిస్తానని చెప్పి రూ.3 కోట్లు విడుదల చేశారు. సెప్టెంబరులో వైఎస్సాఆర్ దివంగతులయ్యారు. మా ఆశలు కూలిపోయాయి. తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యను కలిశాము.

సింగపూర్‌కు చెందిన డాక్టర్ కీత్‌గో వచ్చి పరిశీలించారు. శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. ఎయిమ్స్‌లోనే చేయాలని ప్రభుత్వం భావించింది. అప్పటి నుంచి వివిధ దేశాల వైద్యులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. లండన్‌కు తీసుకువస్తే శస్త్ర చికిత్స చేస్తామని 2015 ఫిబ్రవరిలో అక్కడి నుంచి వచ్చిన వైద్యులు చెప్పారు. ఇలా ఎంత మంది వైద్యులు పరిశీలించినా... శస్త్రచికిత్స ఎప్పుడనేది కచ్చితంగా ఎవరూ చెప్పడంలేదు. ప్రభుత్వమే మా మొర ఆలకించాలి.
- పిన్నింటి గోపాల్, సాక్షిప్రతినిధి, వరంగల్
ఫొటోలు : పెద్దపెల్లి వరప్రసాద్

Advertisement

తప్పక చదవండి

Advertisement