క్రైమ్‌ గేట్‌

TV series on December 16 gang rape turns focus on cops - Sakshi

వెబ్‌ ఫ్లిక్స్‌

ఇండియా గేట్‌.. అమర వీరుల స్ఫూర్తి జ్వాలను కాపాడే గూడు! ఇండియా గేట్‌ మీద అమర వీరుల పేర్లు చెక్కి ఉంటాయి.దాని దగ్గర్లోనే మరో చిన్న కట్టడంలో దేశం కోసం ప్రాణాలొడ్డిన అనామక వీరుల కోసం ఓ జ్యోతి వెలుగుతూంటుంది!అక్కడే 2012లో ఇంకో అనామక నిర్భయ కోసం ఒక పోరాటం జరిగింది.. ఆ పోరాటం దేశాన్ని కుదిపేయడమే కాదు.. మహిళలను కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన చట్టాన్నీ తీసుకొచ్చింది..అంత గొప్ప చట్టం వెనుక ఉన్న నిర్భయ కేస్‌ ఏమిటి? దాన్నెలా ఛేదించారో చిత్రీకరించిన వెబ్‌ సిరీసే ‘డెల్హీ క్రైమ్‌!’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది

‘‘మేడమ్‌ ... రోడ్డు మీద ఓ జంట బట్టల్లేకుండా పడి ఉంటే ఇప్పుడే సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌కు తీసుకొచ్చాం.. అమ్మాయి పరిస్థితి బాలేదు’’ ‘‘ఊ...’’ మధ్యరాత్రి నిద్రలో వచ్చిన ఫోన్‌ కాల్‌కి ప్రిపేరవుతున్నట్టుగా.. కళ్లు నులుముకుంటూ ‘‘ఓకే... నేనొస్తున్నా...’’ అంటూ ఫోన్‌ డిస్కనెక్ట్‌ చేసింది సౌత్‌ ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేది.  ‘‘ఏమైంది?’’ పక్కనే ఉన్న భర్త అడుగుతుంటే ‘‘సీరియస్‌.. వెళ్లాలి’’ హాల్లోకి వచ్చింది గబగబా షూ వేసుకుంటూనే.  ఇది ‘‘డెల్హీ క్రైమ్‌’’లోని సన్నివేశం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగరంగా ఢిల్లీని ఖరారు పరిచిన దుర్ఘటన..  ‘‘కంట్రీ ఆఫ్‌ రేప్స్‌’’గా  అపకీర్తిని  మోసుకొచ్చిన విషాదం... 2012, డిసెంబర్‌ 16.. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌. మహిళలకు భద్రత లేదని, స్త్రీల ఆత్మగౌరవం అనే పదానికి అర్థమే తెలియని సమాజంగా నిరూపించిన  ఘటన. అందుకే అప్పటిదాకా అణిచి పెట్టుకున్న దుఃఖం పార్లమెంట్‌ మీదకు దండెత్తే సాహసంగా మారింది.  ఒళ్లు గగుర్పొడిచే ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెసే ‘‘డెల్హీ క్రైమ్‌’’. చాలా నిజాలకు కొన్ని కల్పితాలను జోడించి తీసిన సిరీస్‌. 

ముందు చెప్పుకున్న సన్నివేశం తర్వాత...
డీసీపీ వర్తికా చతుర్వేది(షెఫాలి షా) హడావిడిగా సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రికి వెళ్తూనే దారిలో తన అసిస్టెంట్‌ స్టాఫ్‌ అందరినీ అలర్ట్‌ చేస్తుంది. సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌కు రమ్మని ఆదేశాలిచ్చి తనూ చేరుకుంటుంది. అప్పటికే ఒంటినిండా గాయాలతో రక్తమోడుతూన్న అమ్మాయి.. దీపికను సర్జరీ కోసం థియేటర్‌కు తీసుకెళ్తూంటారు డాక్టర్స్‌. పేషంట్‌ కండీషన్‌ గురించి అడుగుతుంది డీసీపీ. ‘‘బాడీ బయట పార్ట్సే కాదు లోపలి పార్ట్సూ చాలా దెబ్బతిన్నాయి. గ్యాంగ్‌రేప్‌. ఐరన్‌రాడ్‌ కూడా ఇన్‌సర్ట్‌ చేశారు. లోపల పేగులు బయటకు లాగారు. క్రిటికల్‌ కండిషన్‌.. ఈ రాత్రి గడవొచ్చు’’ అని చెప్తూ థియేటర్‌లోకి వెళ్తుంది  డాక్టర్‌. దీపికతోపాటు హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిన అబ్బాయి ఆకాశ్‌ను కలుస్తుంది డీసీపీ. ‘‘సినిమా చూసి తొమ్మిదిగంటలప్పుడు ద్వారకా (ఢిల్లీలోని ఓ ప్రాంతం) వెళ్లడానికి బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాం.

 దొరకలేదు. రాత్రి అవుతోంది అలా వెయిట్‌ చేయడమెందుకని అక్కడి నుంచి ఓ ఆటో పట్టుకుని మునీర్కా వచ్చి అక్కడినుంచి ఓ బస్‌ ఎక్కాం. బస్‌లో ఆరుగురు ఉన్నారు. ఎక్కిన కొన్ని నిమిషాలకే దాదాగిరీ చేయడం మొదలుపెట్టారు. ఐరన్‌రాడ్‌తో నన్ను కొట్టి నా పర్స్, మొబైల్‌ ఫోన్, ఏటీఎం కార్డ్స్‌ లాక్కున్నారు.. అడ్డుపడ్డ దీపికనూ కొడ్తూ ఒకతను వెనక్కి తీసుకెళ్లాడు. తర్వాత మిగిలిన వాళ్లూ వెళ్లారు. కాసేపటికి కదులుతూన్న బస్‌లోంచి మమ్మల్ని రోడ్డు మీదకు విసిరేశారు.. నేకెడ్‌గా!’’ చెప్పాడు ఆకాశ్‌. భారంగా వార్డ్‌ బయటకు వస్తుంది డీసీపీ. అక్కడే దీపిక తల్లిదండ్రులుంటారు. వాళ్లకూ ధైర్యం చెప్పి ఆలోపే ఆసుపత్రికి చేరుకున్న తన స్టాఫ్‌తో కారిడార్‌లో సమావేశమవుతుంది. అందరిలో ఒకటే అభిప్రాయం.. వాళ్ల సర్వీస్‌లో ఇంతటి హేయమైన నేరాన్ని చూడలేదని. ఆమెలో తెలియని బాధ,  గుబులు మొదలవుతుంది.

ఆ రోజు సాయంకాలమే.. తన కూతురు చాంద్‌ని.. కాలేజ్‌ చదువుకోసం కెనడాకు పంపిన అప్లికేషన్‌ ఓకే అయినట్టు చెప్తుంది. ఢిల్లీని మించిన సిటీ లేదని.. సరిగ్గా ఎక్స్‌ప్లోర్‌ చేసుకొమ్మని.. కెనడా గినడా.. ఆలోచనలు కట్టిపెట్టమనీ గట్టిగా మందలిస్తుంది కూతురిని. ‘‘రాత్రి ఎనిమిదైతే చాలు కాలు బయటపెట్టడానికి  భయపడి చచ్చే ఢిల్లీ నీకు సేఫ్‌గా కనిపిస్తుందా? మెట్రోలో ఎక్కడమే పాపం.. ఎక్కడెక్కడో చేతులు వేసి తడమాలనుకునే పోకిరీ వెధవలున్న ఈ సిటీని సరిగ్గా ఎక్స్‌ప్లోర్‌ చేయాలా?’’ అంటూ అసంతృప్తి, ఆగ్రహం వెళ్లగక్కుతుంది కూతురు. ‘‘ఒక్కనెల టైమ్‌ ఇవ్వు.. నీచేత ఢిల్లీని నేను ఎక్స్‌ప్లోర్‌ చేయిస్తా.. ఇంత సేఫ్‌ ప్లేస్‌ వరల్డ్‌లో లేదనిపిస్తా’’ చాలెంజ్‌ చేస్తుంది డీసీపీ. నవ్వి ‘‘సరే.. అట్లాంటి ఢిల్లీని చూపిస్తే కెనడా ఆలోచన మానేస్తాలే’’ అంటూ తన కూతురు ప్రామిస్‌ చేసిన ఆ సంభాషణ గుర్తొస్తుంది డీసీపీకి.

ఆ భావాలేవీ బయట పడనివ్వకుండా స్టాఫ్‌తో అక్కడికక్కడే ఆ కేస్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఫామ్‌  చేసేస్తుంది. ఆ క్షణం నుంచే డ్యూటీస్‌నీ ఆర్డర్‌ చేస్తుంది. ఆ రోజు ఉదయమే .. ట్రైనీ ఐపీఎస్‌ నీతీ సింగ్‌(రసికా దుగ్గల్‌) .. చెక్‌పోస్ట్‌లో డ్యూటీ తీసుకోగానే ఏనుగు దంతాలను  స్మగ్లర్‌ను పట్టుకుంటుంది. ఆ విషయం తెలియగానే సంతోషపడ్తుంది డీసీపీ ‘‘అందుకే అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో వీలైనంత ఎక్కువ మంది ఆడవాళ్లను అప్పాయింట్‌ చేసుకోవాలి’’ అని. అలా ఆ అమ్మాయినీ తన టీమ్‌లో చేర్చుకుంటుంది. హాస్పిటల్‌లో దీపికకు, ఆమె తల్లిదండ్రులకు కేర్‌టేకర్‌గా.. మీడియాను హాస్పిటల్లోకి రానివ్వకుండా చూసుకునే డ్యూటీని అప్పజెప్తుంది ఆమెకు.

ఆరుగురు నేరస్థులు..
దీపిక స్నేహితుడు ఆకాశ్‌ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. వాళ్లు బస్‌ ఎక్కిన ప్రాంతం నుంచి వాళ్లను విసిరేసిన ప్రాంతం దాకా సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి కొన్ని క్లూస్‌ సంపాదిస్తుంది టీమ్‌. అలాగే బస్‌లో  ఆరుగురి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ ఆధారంగా  ముగ్గురి పేర్లను చెప్తాడు ఆకాశ్‌. వాళ్లో జై సింగ్‌ ప్రధాన నేరస్థుడని తెలుస్తుంది డీసీపీ అండ్‌ టీమ్‌కి. ఇన్సిడెంట్‌ గురించి తెల్లవారే టీవీల్లో హోరెత్తి పోతుంటే భయపడ్డ ఆరుగురూ పారిపోతారు. జైసింగ్‌ ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో పనిచేస్తుంటాడు. అది స్కూల్‌ బస్‌. మరో ప్రైవేట్‌ కంపెనీ ఎంప్లాయ్స్‌కీ కమ్యూట్‌గానూ పనిచేస్తూంటుంది. ఈ చర్య తర్వాత జైసింగ్‌ బస్‌ను శుభ్రం చేసేసి పార్కింగ్‌ ప్లేస్‌కి తీసుకొస్తుంటే అతణ్ణి పట్టుకుంటారు పోలీసులు.

ముందు తనకేం తెలియదని బుకాయిస్తాడు జై సింగ్‌. గట్టిగా అడిగితే ఒప్పుకుంటాడు. అప్పుడే అతని మానసిక వికారమూ బయటపడ్తుంది. జై సింగ్‌  నుంచి మిగిలిన వాళ్ల వివరాలనూ సేకరిస్తారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా ఏరియాస్‌ను డిటెక్ట్‌ చేసుకుంటూ ఒకొక్కరి జాడా తీస్తూ రాజస్థాన్, బీహార్‌కూ జర్నీ  చేసి నేరస్థుల బలహీనతలను వాడుకుంటూ... ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మొత్తానికి అయిదు రోజుల్లోపే ఆరుగురినీ పట్టుకుంటారు. ఈ ప్రయాణంలో ఆ ఆరుగురి మానసిక స్థితి, వాళ్ల కుటుంబ నేపథ్యాలు, పెరిగిన వాతావరణం, ఆర్థిక స్థితీ అర్థమవుతుంది. మొత్తానికి అయిదు రోజుల్లో ఆరుగురినీ పట్టుకుంటారు. 

రెండో కోణంలో...
ఇన్వెస్టిగేషన్‌ విషయంలో వచ్చే రాజకీయంగా ఒత్తిళ్లను తట్టుకోవడం ఒకెత్తయితే.. మీడియా చూపే అత్యుత్సాహాన్ని నిరోధించడం అంతకుమించిన తలనొప్పి అవుతుంది డీసీపీ అండ్‌ టీమ్‌కి. ప్రజా సంఘాలు, యూత్, ఫెమినిస్ట్స్‌ ఆర్గనైజేషన్స్‌ చేసే ధర్నాలు, ర్యాలీలలో ఏ అపశ్రుతి దొర్లకుండా చూసే బాధ్యతా అదనపు భారమవుతుంది. డీసీపీతో సహా టీమ్‌ అంతా ఆ అయిదు రోజులూ స్టేషన్‌లోనే  ఉంటారు ఇల్లు, కుటుంబాన్ని మరిచిపోయి. దీపిక విషయానికి వస్తే సర్జరీ అయినా ఆమె ఆరోగ్యం అంతగా మెరుగు పడదు. ఇంకా చేయాల్సిన సర్జరీలూ ఉంటాయి. ఆఖరి నేరస్థుడిని పట్టుకున్న రోజే దీపిక స్పృహలోకి వస్తుంది. మెజిస్ట్రేట్‌ ముందు జరిగినదంతా చెప్తూ స్టేట్‌మెంట్‌ ఇస్తుంది. ఆ నేరస్థులు కనిపిస్తే చాలు కొట్టి చంపేయాలన్నంత ఆవేశంతో ఉంటారు ఢిల్లీ ప్రజలు. పోలీస్‌ స్టేషన్,  కోర్ట్, ఇండియా గేట్‌ ముందు వందల సంఖ్యలో జనాలు గుంపులు గుంపులుగా. వాళ్ల బారిన పడకుండా  నేరస్థులను సురక్షితంగా కోర్ట్‌లో హాజరుపరిచి శిక్షార్హులను చేయాలన్నదే డీసీపీ అండ్‌ టీమ్‌ తపన.

ఇంకే కూతురికి ఇలాంటి పరిస్థితి రాకుండా.. మరే తల్లీ, తండ్రీ ఈ క్షోభకు గురికాకుండా చూడాలన్నదే వాళ్ల దృఢనిశ్చయం. ఈ క్రమంలో తమ పట్ల ప్రజల్లో నమ్మకం పోకుండా చూసుకోవడం మరో క్రూషియల్‌ టాస్క్‌. ఆఖరకు ఆ పోరాటంలో గెలుస్తారు అనుకున్నట్టుగానే మూడో కంట పడకుండా ఆ నేరస్థులను కోర్టుకు అప్పగించి. ఆ విజయాన్ని ఇండియా గేట్‌ ముందు సెలబ్రేట్‌ చేసుకుంటూంటే.. ట్రైనీ ఐపీఎస్‌ నీతి సింగ్‌.. ‘‘దీపిక మెడికల్‌ రిపోర్ట్‌ చదివారా? ఇంటర్నల్‌ ఆర్గాన్స్‌ రిపేర్‌ చేయలేనంత డామేజ్‌ అయ్యాయి. ఆమె బతకదు.. ఈ సెలబ్రేషన్స్‌ ఎందుకు?’’ అన్న మాటలతో ‘‘డెల్హీ క్రైమ్‌’’ ఎండ్‌ అవుతుంది. నిర్భయ కేస్‌ను ఇన్వెస్టిగేట్‌ చేసిన లేడీ ఆఫీసర్‌ ఛాయా శర్మ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను తీశారు ఇండో కెనడియన్‌ డైరెక్ట్‌ రిచీ మెహతా.  

– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top