భక్తురాలికి శ్రీవారి సేవల భాగ్యం

TTD New Member Vemireddy Prashanthi Reddy Special Story - Sakshi

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిలో సభ్యురాలిగా ఇటీవలే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియమితులయ్యారు. నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ప్రశాంతి ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలోనూ అవిశ్రాంతంగా మారిపోయారు. నాలుగేళ్ల క్రితం నెల్లూరు నగరంలో మొదటిసారిగా శ్రీవారి వైభవోత్సవాలను వీపీఆర్‌ ఫౌండేషన్  నేతృత్వంలో తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించారు. తిరుమలలో స్వామివారికి చేసే ప్రతి సేవను ఆ వైభవోత్సవాల్లో నిర్వహించారు.సుప్రభాతసేవ మొదలుకుని ఏకాంతసేవ వరకు అన్ని సేవలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ‘‘అప్పుడే స్వామివారికి మరింతసేవ చేయాలి, స్వామిసేవలో తరించాలనుకున్నాను. నా సంకల్పాన్నిఆ దేవదేవుడే నెరవేర్చాడని ప్రగాఢంగాఅనుకుంటున్నాను’’ అని ప్రశాంతి అన్నారు.

ప్రశాంతి బాల్యమంతా తిరుపతిలోనే గడిచింది. టీటీడీ స్కూల్, టీటీడీ మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ‘‘నిత్యం స్వామివారి పేరును తలుచుకుంటూ ఏడుకొండలను చూస్తూ పెరిగిన నాకు మాధవసేవ కూడా స్వామివారి ద్వారానే లభించడం భాగ్యంగా భావిస్తున్నాను. టీటీడీ బోర్డు సభ్యురాలిగా సామాన్యులకు స్వామివారి సేవ దక్కేలా కష్టపడతాను. కొత్త ప్రభుత్వంలో అనేక మార్పులు, ప్రత్యేక కేటగిరీ దర్శనాలు రద్దు ద్వారా రోజుకు 7,500 నుంచి 9,000 మంది వరకు అదనంగా స్వామివారిని దర్శించుకోనున్నారు’’ అన్నారామె. మహిళగా కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతూనే తమ ఫౌండేషన్  ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, యువజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ఇతర సేవా కార్యక్రమాలకు కో చైర్‌పర్సన్ గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

సంకల్పమే నడిపిస్తోంది
‘‘సంపాదించే అవకాశం దేవుడు మనకు ఇచ్చినప్పుడు అందులోంచి ఎక్కువ భాగం మానవసేవకు వినియోగించాలనేది మా సంకల్పం. ఆ సంకల్పమే మమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తోంది. 2015లో వీపీఆర్‌ ఫౌండేషన్ ను ప్రారంభించాం. నాటి నుంచీ స్కూల్, కళాశాలలో ఉచిత విద్యతోపాటు, విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, యూనిఫామ్, వైద్యం, బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నాం. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ బాధ్యతలు కూడా మా ఫౌండేషన్  ద్వారా చేస్తూ ప్రజలకు రక్షిత మంచినీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరిన్ని వాటర్‌ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కనపర్తిపాడులోనే స్కూల్‌ ప్రాంగణంలోనే పది పడకల ఆస్పత్రిని ప్రారంభించి అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. అలాగే కొత్తగా ‘హెల్త్‌ ఆన్  వీల్స్‌’ పేరుతో గ్రామాలకే మొబైల్‌ వాహనాలు వెళ్లి అన్నిరకాల వైద్యసేవలతోపాటు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు ప్రశాంతి.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను
బోర్డు సభ్యురాలిగా ఎంపికైనప్పుడు నా భర్త ప్రభాకర్‌రెడ్డి చెప్పిన మాట ఒక్కటే. ‘‘బాధ్యత పెరిగింది. సీఎం వైఎస్‌ జగన్  మనల్ని నమ్మి ప్రపంచ ఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థానం బోర్డులో చోటు కల్పించారు. మరింత ఆధ్యాత్మిక చింతనతో మానవసేవతోపాటు మాధవసేవ కొనసాగించాలి’’ అని. సీఎం జగన్‌ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.– వి. ప్రశాంతి రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు

నిజపాదుకలు తీసుకొచ్చాం
‘వీపీఆర్‌ ఆధ్యాత్మికం’ పేరుతో ఈ దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలకు వితరణ ఇవ్వడంతోపాటు నెల్లూరు నగరంలో ఏటా లక్షదీపోత్సవం ఘనంగా జరుపుతున్నారు. ‘‘గతేడాది షిర్డీ సాయిబాబా నిజపాదుకలను నగరానికి తీసుకువచ్చాం. భక్తులు సంతోషంగా దర్శించుకున్నారు. ఈ ఏడాది కార్తీకమాసంలో నిర్వహించే లక్షదీపోత్సవంలో భీమశంకరుడు, కంచి అత్తివరదరాజ స్వామి నమూనా దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ దేవాలయాలు సందర్శించలేని భక్తులు వీటిని దర్శించుకుంటారు’’ అని చెప్పారు ప్రశాంతి. గత నెల 21వ తేదీన టీటీడీ బోర్డు సభ్యురాలిగా స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు ఆమె. ‘‘మొదటి బోర్డు సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పైనే చర్చించాం. నెల్లూరులో టీటీడీ కల్యాణమండపం ప్రాంగణంలో స్వామివారి దేవాలయ నిర్మాణానికి, చిన్న దేవాలయాలకు, ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందులుండే దేవాలయాలకు టీటీడీ ద్వారా సహకారం అందించేందుకు కృషి చేస్తాను’’ అని చెప్పారు ప్రశాంతిరెడ్డి.– కాట్రపాటి కిశోర్, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top