వ్యాయామం చేసే అలవాటు ఉండి, వారికి తాగుడు అలవాటు కూడా ఉంటే...
కొత్త పరిశోధన
వ్యాయామం చేసే అలవాటు ఉండి, వారికి తాగుడు అలవాటు కూడా ఉంటే... ఎక్కువ వ్యాయామం చేసిన రోజున వారు ఒకింత ఎక్కువగా డ్రింక్ తీసుకుంటారట. అదీ సాధారణంగా వ్యాయామం తర్వాత వారు ‘బీర్’తాగడానికి ప్రాధాన్యం ఇస్తుంటారట. పందొమ్మిదేళ్ల వయసు నుంచి 89 ఏళ్ల వయసు వరకు ఉన్న దాదాపు 150కి పైగా వ్యక్తులపై యూఎస్‌కు చెందిన అధ్యయనవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వారంలోని మొదటి మూడు రోజులూ కాస్తంత తక్కువ వ్యాయామం చేయించారు. ఇక వీకెండ్ దగ్గరపడుతున్నప్పుడు వారితో కాస్తంత తీవ్రంగా వ్యాయామం చేయించారు.
వ్యాయామంలోని ఈ తేడాలు వారి తాగుడు అలవాటుపై ఏదైనా ప్రభావం చూపుతుందా అని పరిశీలించినప్పుడు మరింత ఎక్కువగా వ్యాయామం చేసిన రోజున తమకు తాము ఇచ్చుకునే రివార్డుగా వారు కాసింత ఎక్కువగా తాగేస్తున్నారట. ఎక్సర్‌సైజ్ కోసం వారు వినియోగించే విల్‌పవర్ వాళ్ల తాగుడు అలవాటును నియంత్రించుకోడానికి సరిపోవడం లేదని ఈ పరిశోధన ఫలితాలు పేర్కొంటున్నాయి. ఈ అధ్యయన సారాంశం యూఎస్‌కు చెందిన మెడికల్ జర్నల్ ‘హెల్త్ సైకాలజీ’లో ప్రచురితమైంది.