తెలివిజన్‌

Tenali Ramakrishna Was Born in The Poor Brahmin family - Sakshi

గ్రేట్‌  ఇండియన్‌  సీరియల్స్‌–14 

తెనాలి రామకృష్ణ తెలివే తెలివి.. విజనే విజను. ఇంకొకళ్లకు లేవు.. అలాంటి వికటకవులిక లేరు! ఆ తెలివిని, ఆ విజన్‌ని కలిపి దూరదర్శన్‌ వాళ్లు ‘తెనాలి రామ’గా ప్రసారం చేశారు.పదికాలాల నవ్వుల పువ్వుల్ని పూయించారు.

బతుకు బాటలో అతను హాస్య చతురత కల చమత్కారి. కష్టాన్ని తన ప్రతిభతో ఇష్టసఖిగా మార్చుకొని ఇంటి ముంగిట్లో కట్టేసుకున్న ధీశాలి. తలతీసేయాల్సిన పరిస్థితుల్లోనూ తలవంచక చమత్కారంతో మరణం చేతనే మెప్పు సాధించిన మహా మేధావి. తెలుగువారినే కాదు భారతదేశమంతా తన ప్రతిభతో ఆకట్టుకున్నవాడు. అతని పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఆ తెలివికి జోహార్‌ అంటుంది. అతడిని పరిచయం చేసుకోవాలంటే రాయల భువనవిజయానికి బయల్దేరాలి.

ఆ కాలానికి వెళ్లాలంటే ఇప్పుడు మనకు టైమ్‌ మిషన్‌ అక్కర్లేదు. 90ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చిన ‘తెనాలి రామ’ సీరియల్‌ను చూస్తే చాలు. నాటి చారిత్రక సంఘటలను కథలుగా పరిచయం చేయడానికి టెలివిజన్‌ నాడు ఎంతగానో ఉపయోగపడింది. అందుకు ఉదాహరణ ‘తెనాలి రామ’కృష్ణ కవి కథలనే చెప్పుకోవచ్చు.  ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో కూడిన సీరియల్స్‌ ఎన్ని వచ్చినప్పటికీ ‘తెనాలి రామ’ సీరియల్‌ ప్రస్తావన వస్తే మాత్రం నాటి పిల్లలు ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు టెలివిజన్‌ ఎన్నో ఆసక్తికర సీరియల్స్‌ను ప్రచారం చేసినప్పటికీ హాస్య సీరియల్స్‌లో తెనాలి రామ పెద్ద లెజండ్‌. 

బద్దకిస్టు
రామకృష్ణుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పుట్టింది గుంటూరులో. కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో తల్లి ఎంతో కష్టమ్మీద రామకృష్ణను పెంచుతుంటుంది. రామకృష్ణ సోమరిపోతు. ఎప్పుడూ నిద్రపోవాలని చూస్తుంటాడు. తినమని పండు ఇస్తే దాని తొక్క తీయాలి కదా అని బద్ధకించి అలాగే చేతిలో పెట్టుకొని నిద్రపోతాడు. స్కూల్‌కి వెళితే గురువు చెప్పే పాఠాల మీద ఎంత మాత్రమూ ఆసక్తి ఉండదు. తల్లికి రామకృష్ణ పెంపకం చాలా తలనొప్పిగా ఉంటుంది. నదిలో స్నానం చేసి రమ్మని తల్లి పోరితే వెళ్లి అక్కడి బండరాళ్ల మీద పడుకొని నిద్రపోతుంటాడు. నది దగ్గర జపం చేసుకుంటున్న ఒక సాధువు రామకృష్ణ పడుకుని ఉండడం చూసి ఓ రోజు విసుక్కుంటాడు ‘కాళీమాత గుడికి వెళ్లి పడుకోపో.. నా జపానికి విఘాతం కలిగించకు’ అని కోప్పడతాడు. విధిలేక రామకృష్ణ అమ్మవారి గుడికి వెళతాడు. ఆకలేస్తే తనకు కావల్సిన ప్రసాదాన్ని తినేసి అక్కడే పడుకుంటాడు. కలలో దేవత ప్రత్యక్షమై ధనం, జ్ఞానం ఉన్న రెండు గిన్నెల నిండా ప్రసాదం ఇస్తుంది తినమని.

అవి తిన్న రామకృష్ణుడు నిద్రలేచి అమ్మవారి వైపుగా చూస్తాడు. ఆమె పాదాల వద్ద గిన్నెలోని ప్రసాదాన్ని సేవించి, దండం పెట్టుకొని పరుగున ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే రామకృష్ణుడు పడుకొని లేకపోవడం చూసిన తల్లి ఆశ్చర్యపోతుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నది దగ్గరకు వెళుతుంది. కొడుకు కనిపించడు. అక్కడే ఉన్న సాధువుని అడుగుతుంది తన కొడుకు గురించి. ‘రామకృష్ణుడు బ్రహ్మముహూర్తంలోనే వచ్చి నదీ స్నానం చేసి వెళ్లాడు’ అని చెబుతాడు. తల్లి ఆశ్చర్యపోతూ ఇంటికి చేరుకుంటుంది. రామకృష్ణుడు పూజ చేస్తూ కనిపిస్తాడు. ఆకలేస్తుందని, పాఠశాలకు వెళ్లాలని ఏదైనా తినడానికి ఇమ్మని తల్లిని త్వరపెడతాడు. ఆవుకు మేత తెచ్చి వేస్తాడు. తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. ఖాళీ సమయం ఉంటే పాఠాలు వల్లెవేస్తుంటాడు. గురువును మెప్పించిన శిష్యుడు అవుతాడు. తల్లి ఆనందంతో కొడుకును చూసుకొని మురిసిపోతుంది.

చిన్ననాటి చమత్కారం
ఇంటిలో సరుకులు మోయడానికి కష్టంగా ఉందని తెలుసుకున్న రామకృష్ణుడు ఓ ఆలోచన చేస్తాడు. ఓ రోజు బట్టలు ఉతికే అతని దగ్గరకు వెళ్లి తన మాటలతో మెప్పించి, గాడిదను తీసుకెళతాడు. కొంతదూరం వెళ్లాక గాడిదకు శక్తి లేక అడుగు వేయలేకపోతుంది. మేతకోసం చూస్తాడు. ఒకామె గడ్డిమోపును నెత్తిమీద పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్లడం చూస్తాడు. ఆమెను కొద్దిగా మేత అడిగితే డబ్బు లేనిదే ఇవ్వను అంటుంది. గాడిదను తీసుకెళ్లి ఒకచోట ఉంచి, వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. దూరంగా ఒక సంపన్నుడు గుర్రం తీసుకొని రావడం చూస్తాడు. ఆ సమయంలో రామకృష్ణుడు గాడిదను ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ సంపన్నుడు ఆశ్చర్యపోయి ‘గాడిదను వేడుకుంటున్నావేం’ అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ఈ గాడిద మహిమాన్వితమైనది. దీనికి పిడికెడు గడ్డి వేస్తే ఏం కోరుకుంటే అది అవుతుంద’ని, చెబుతాడు.

గడ్డి అమ్ముడుపోక నీరసంగా ఒక దగ్గర కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్లి పిడికెడు గడ్డి కొని తీసుకొస్తే చాలంటాడు. ఆ సంపన్నుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దారిన పోయేవారంతా వచ్చి గాడిదకు గడ్డి కొని ఇస్తారు, డబ్బులూ సమర్పించుకుంటారు. ఒకరు ఇద్దరు పోయి వందల మంది గాడిదకు మేత వేయడానికి వస్తారు. సాయంకాలమయ్యాక అంతా వెళ్లిపోయి రేపు రండి అని చెబుతాడు. సాయంకాలం బట్టలు ఉతికే అతను రామకృష్ణుడు తల్లి దగ్గరకు వచ్చి నా గాడిదను ఇవ్వమని వేడుకుంటాడు. తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడే గాడిదతో వచ్చిన రామకృష్ణుడు ‘గాడిద మహారాజు సంపాదన ఇది. ఇదంతా నీదే’ అని బట్టలు ఉతికే అతనికి ఇస్తాడు. ‘నా  సంపాదన ఇది’ అంటూ తల్లికి కొంత భాగాన్ని ఇస్తాడు. 

మాటలతో కోటలు
చమత్కారానికో, లేక పిలవడానికి సులువు అనో కానీ.. కొద్ది కాలంలో రామకృష్ణుడినే ఊరివాళ్లు రామలింగా అని పిలిచేవారు. తల్లికి పనుల్లో సాయపడుతూ, విద్యను అభ్యసిస్తూ పెరిగి పెద్దవుతాడు. పెళ్లి చేసుకొని గృహస్థు అవుతాడు. ఒకరోజు ఆ ఊళ్లో ఆచారి అనే వ్యక్తి రామలింగడి కాళ్ల మీద పడతాడు కాపాడమని. విషయం ఏంటని అడుగుతాడు రామకృష్ణుడు. సేట్‌ తన జాతకం అడిగితే చూసి ‘నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. నీ పరివారం అంతా ముందే మరణిస్తారు’ అని చెప్పాను. తన పనివాళ్లతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. నా దోషమేమీ లేదు ఉన్నదున్నట్టు చెప్పాను’ వగరుస్తూ అన్నాడు ఆచారి. ఆచారికి ఓ రహస్యం చెప్పి సేట్‌ని కలుస్తాడు రామకృష్ణుడు.

కోపంలో ఉన్న సేట్‌ ఆచారిని తెగ తిడుతుంటాడు. రామకృష్ణుడు వెళ్లగానే ‘ఇంట్లో అందరూ జబ్బు చేసి చచ్చిపోతారని వాడు చెప్పాడు. శాంతి చేయాలి..’ అని టెన్షన్‌ పడుతూ ఉంటాడు సేట్‌. ఆ ఆచారి చెప్పింది అబద్ధం. బృహస్పతి వరం పొందిన ఓ సిద్ధుడు చెట్టుకింద కొలువుదీరాడు. ఎవరితోనూ అతను మాట్లాడడు. ఈ రాత్రే వెళ్లి అతన్ని కలవండి’ అని చెబుతాడు రామకృష్ణుడు. అలాగేనని వెళతాడు సేట్‌. రామకృష్ణుడు చెప్పిన విధంగా చెట్టుకింద ఉన్న స్వామీజీని చూసి ‘స్వామీజీ నేను పెద్ద పరేశాన్‌లో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి ఇది. దయచేసి చెప్పండి’ అని వేడుకుంటాడు. జాతకం చూసిన అతను.. ‘మూడేళ్ల క్రితం మీ తండ్రి మరణించారు. వారం రోజులుగా మీ ఇంట్లో వారంతా మంచం పట్టారు. నువ్వు దీర్ఘాయుష్కుడివి. మీ ఇంట్లో వారందరికంటే నువ్వు రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతావు’ అని చెబుతాడు.

అతను చెప్పిన దానికి చాలా సంతోషించిన సేట్‌ డబ్బు కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ వేషం కట్టింది ఆచారియేనని ఆ సేట్‌కి తెలియదు. మాట తీరుతో ఆపదల నుంచి ఎలా బయటపడవచ్చో రామకృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిరూపిస్తాడు. ఆచారి రామకృష్ణుడిని కలిసి ‘రామా.. నువ్వు చాలా చమత్కారివి. చెప్పినదాన్నే మరో విధంగా చెప్పి నన్ను కాపాడావు’ అని మెచ్చుకొని ‘ఇంత తెలివైనవాడివి ఈ ఊళ్లో ఉంటే ఎలా? నువ్వు రాజ సభలో ఉండాలి. ఎందుకు ప్రయత్నించకూడదు’ అంటాడు. ఆ ఆలోచనతో భార్య సీతతో విజయనగరం బయల్దేరుతాడు రామకృష్ణుడు.

కోటలోకి దారేది
కోటలోకి వెళ్లడానికి ఎవరి రికమెండేషనూ లేదు. కనీసం పరిచయస్థులెవరూ లేరు. రోజూ కోట దగ్గరకు చేరి వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. ఓ రోజు కోటలోకి వెళ్లబోతున్న రాజగురువును కలుసుకుంటాడు. ‘మీరు నాకు తెలుసు.. మీరు ఫలానా కదా! మీరు మా ఊరు వచ్చారు. అప్పుడు నేనే దగ్గరుండి భోజనం వడ్డించాను’ అంటూ.. మాటలు కలుపుతాడు. రాజగురువు సందేహంగా చూసి, అనేక ప్రశ్నలు వేసి, తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఆలోచన చేసిన రామకృష్ణుడు రాజ భటులతో ‘రాజగురువుతో మాట్లాడుతుండగా చూశారుగా. రాజు గొప్ప బహుమానం ఇస్తానని చెబితే వచ్చాను. అందులో కొంత భాగం మీకు ఇద్దామనుకున్నాను. కానీ, మీరు లోపలికి వెళ్లనివ్వడం లేదు’ అంటాడు. ఆ మాటలు భటులను ఆకట్టుకుంటాయి. బహుమానంలో తమకూ కొంత భాగం ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటారు వాళ్లు. అలా కోటలోకి వెళతాడు రామకృష్ణుడు. 

కోటలో మొదటి ఛాలెంజ్‌
రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్‌ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అందరూ అతన్ని కీర్తిస్తారు. ‘నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?’ అని సవాల్‌ విసురుతాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు ‘మహారాజా అనుమతి ఇస్తే, నేను ఈ సవాల్‌ను ఎదుర్కొంటాను’ అని ముందుకు వస్తాడు. రాజు అనుమతితో కారం తెప్పించి, ‘ఈ కారం కళ్ల మీదుగా వేసుకొని భరించగలవా?’ అంటాడు. తన వల్ల కాదంటాడు ఇంద్రజాలికుడు. రామకృష్ణుడు రెండు గుప్పిళ్ల నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల  మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు.

రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే ‘వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ’ అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఈ ఇనామ్‌లో భాగం ఉంది మహారాజా’ అని కోరుతాడు. ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు.

రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని  చేతి ఉంగరాన్ని బహుకరిస్తాడు. అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు. వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు. ఇతని జీవిత సంఘటనలన్నీ చమత్కారపు కథనాలుగానే ఆకట్టుకుంటాయి. అక్బర్‌–బీర్బల్‌ కథల మాదిరిగానే రాయలు–రామకృష్ణుడు కథలుగా, తెనాలిరామలింగడి కథలుగా చిన్నాపెద్దను ఆకట్టుకున్నాయి. ఈ కథలను దర్శించిన చిన్నా పెద్ద పెదవులపై నవ్వులను పూశాయి. ‘శభాష్‌ తెనాలి రామ’ అని రామకృష్ణ తెలివికి జనం చేతులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి.
– ఎన్‌.ఆర్‌

దొంగల చేత నీళ్లు
ఓ రాత్రి పూట తన ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు రామకృçష్ణుడు. భార్యతో గట్టిగా అరిచి చెబుతూ ‘మన ఇంట్లో దొంగలు పడి, సర్వమూ దోచుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ‘నగలు, డబ్బు అంతా మూట గట్టి బావిలో వేద్దాం’ అని దొంగలకు వినపడేలా చెప్పి, ఓ మూటను బావిలో వేస్తాడు. రామకృష్ణుడు బావిలో వేసింది నగలు, డబ్బు ఉన్న మూటనే అని నమ్మిన దొంగలు తెల్లవార్లూ బావిలో నీటిని తోడుతూనే ఉంటారు. రామకృష్ణుడు ఆ నీటిని తన తోటకు పాదులు తీసి, మళ్లించుకుంటూ ఉంటాడు. తెల్లవారు జామున అలసిపోయిన దొంగలతో తోటకు నీళ్లు సరిపోయేలా పనిచేశారని కృతజ్ఞతలు చెబుతాడు రామకృష్ణుడు. అంతే! దొంగలు పారిపోతారు.  

తెనాలి రామ
►‘తెనాలి రామ’ సీరియల్‌ను తీసిన దర్శకుడు టి.ఎస్‌.నాగభరణ. రామకృష్ణుడిగా నాగభరణయే ఈ సీరియల్‌లో నటించారు.

►చిన్ననాటి రామకృష్ణుడిగా మాస్టర్‌ కార్తీక్‌ నటనలో మెప్పించాడు.

►కథా రచయిత్రి కమలా లక్ష్మణ్‌ (ఆర్కే లక్ష్మణ్‌ సతీమణి) రాసిన కథలే తెనాలి రామ సీరియల్‌కు మూలం. 

►ఆర్కేలక్ష్మణ్‌ ఈ సీరియల్‌కి కార్టూన్‌ లైన్స్‌ ఇచ్చారు.

►రామకృష్ణుడు పెరిగింది తెనాలి అగ్రహారమైన తూములూరులో.ఇంటిపేరు గార్లపాటి కన్నా తెనాలి అనేపేరే రామకృష్ణుడి ఇంటిపేరుగా స్థిరపడింది.రామకృష్ణుడికే రామలింగడు అనే మరో పేరు ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top