సుజలాం... సుఫలాం... వందే వాటర్ ఏటియం! | Sujalam ... suphalam ... Vande Water Exhibition! | Sakshi
Sakshi News home page

సుజలాం... సుఫలాం... వందే వాటర్ ఏటియం!

Oct 9 2014 10:19 PM | Updated on Sep 2 2017 2:35 PM

సుజలాం... సుఫలాం... వందే వాటర్ ఏటియం!

సుజలాం... సుఫలాం... వందే వాటర్ ఏటియం!

గ్రామాల్లో కూడా నీటికి ఎలాంటి లోటూ లేదు. దీనికి కారణం.... వాటర్ ఏటియం! నీలి విప్లవంలాగే... ఇది నీటివిప్లవం అంటున్నారు కొందరు. దీని గురించి తెలుసుకుందాం....

ఎడారిలో నడిచి వెళుతుంటే... ఉన్నట్టుండి ఒయాసిస్సు ఒకటి ప్రత్యక్షమై ‘నేనున్నాను’ అని దాహం తీరిస్తే ఎంత సంతోషం!అక్షరాలా అలాంటి సంతోషమే... ఇప్పుడు రాజస్థాన్‌లోని పలు గ్రామాల ప్రజల్లో కనిపిస్తుంది. కరవు తాండవమాడే చోట... కన్నీరు తప్ప నీరే ఉండదు. అయితే  ఇప్పుడు అలాంటి గ్రామాల్లో కూడా నీటికి ఎలాంటి లోటూ లేదు. దీనికి కారణం.... వాటర్ ఏటియం! నీలి విప్లవంలాగే... ఇది నీటివిప్లవం అంటున్నారు కొందరు. దీని గురించి తెలుసుకుందాం....

గతంలో ఒకసారి...
 అల్వర్ జిల్లాలోని బకర్‌పూర్ అనే గ్రామం.
 ఆ గ్రామానికి తన బంధువులను చూడడానికి ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. బస్సు దిగగానే ఒక చిన్నపాటి రేకుల షెడ్డు హోటల్‌లోకి దూరి ‘టీ’ ఆర్డర్ ఇచ్చాడు. ‘టీ’ తాగడానికి ముందు ‘‘కాస్త మంచి నీళ్లు ఇవ్వు’’ అని అడిగాడు. సగానికి తక్కువగా ఉన్న ఒక నీటి  గ్లాసు ఇచ్చాడు  హోటలాయన.

 ‘‘ఏమిటయ్యా ఇది...కొంచెం నిండుగా ఇవ్వొచ్చు కదా!’’ అని ఆ ఢిల్లీ వ్యక్తి అనేసరికి ‘‘అవసరమైతే, మరో టీ ఫ్రీగా ఇస్తాను.  అంతేగానీ నీళ్లు అడక్కండి’’ అని నిర్మొహమాటంగా చెప్పి తమ గ్రామ నీటిసమస్యలను గురించి ఏకరువు పెట్టాడు. అది ఆ గ్రామానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని జిల్లా వ్యాప్తంగా అలాంటి సమస్య ఉందని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆ ఢిల్లీ వాలా.
 
ఇప్పటి పరిస్థితి....

 హైదరాబాద్ లాంటి పట్టణాల్లో  సింగిల్ టీ తాగడానికి...ఏడు రూపాయలు వెచ్చించాలి. మనం చెప్పుకున్న బకర్‌పూర్ గ్రామంలో ఇప్పుడు అయిదు రూపాయల వెచ్చిస్తే చాలు... 20 లీటర్ల తాగు నీరు లభిస్తుంది!
 రాజస్థాన్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, కైర్న్ ఇండియాతో కలిసి(కైర్న్ ఇండియా మన దేశంలోని అతి పెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లొరేషన్ ప్రొడక్షన్ కంపెనీ) ఆర్‌వో(రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్ల ద్వారా వందలాది గ్రామీణ ప్రాంతాలకు రోజు పొడుగూతా సురక్షితమైన నీటిని అందుబాటులోకి తెచ్చింది.  ఈ పథకానికి ‘జీవన్ అమృత్’ అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఏటియం ద్వారా నీటిని తీసుకోవచ్చు. కార్డు ప్రాథమిక ధర 150 రూపాయలు. ఇదే ధరతో కార్డును రీఛార్జ్ చేసుకోవచ్చు.
 వాటర్ కార్డుల ద్వారా వచ్చిన ఆదాయం గ్రామ నీటి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ దాన్ని ఆర్‌వో ప్లాంట్ల నిర్వహణకు, ఏటియం ఆపరేటర్ల జీతభత్యాలు, విద్యుత్ ఖర్చుల కోసం వినియోగిస్తుంది. మిగిలిన డబ్బును గ్రామ అభివృద్ధి నిధికి జమ చేస్తుంది.
 ఒకప్పుడు ఈ గ్రామల్లో నీటి కోసం ‘పానీ’పట్ యుద్ధాలెన్నో జరిగేవి.  నీళ్ల ట్యాంక్ రాగానే జనాలు ఎగబడేవారు. లెక్కలేనన్ని తగాదాలు. ఒక గ్రామానికి సంబంధించిన తగాదాల్లో 70 శాతం నీళ్ల ట్యాంకు తగాదాలే అంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.
  
‘‘ఒకప్పుడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ఒకవేళ దొరికినా... స్వచ్ఛమైన నీరు దొరికేది కాదు.  ఇప్పుడు పరిస్థితులలో  పూర్తిగా మార్పు వచ్చింది. ఏ టైమ్‌లోనైనా సురక్షితమైన నీరు దొరుకుతుంది’’ అంటున్నాడు రాజస్థాన్‌లోని కవస్ గ్రామానికి చెందిన రామ్‌ప్యారీ అనే గ్రామస్థుడు.
 
విచిత్రమేమిటంటే, వాటర్ ఏటియంలు అందుబాటులో వచ్చినప్పటికీ కొందరు గ్రామస్థులు నీటి కోసం సంప్రదాయ మార్గాలనే అనుసరించేవారు. సుదూర  ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావడానికి కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. ఈ విషయంలో ‘సవాయ్ పదమ్‌సింగ్’ గ్రామ సర్పంచ్ రతన్ రామ్ ముందు వరుసలో ఉన్నాడు. కేవలం తన గ్రామ ప్రజలను మాత్రమే కాకుండా, చుట్టూ ఉన్న గ్రామప్రజలకు ఏటియం వాటర్ గురించి, వాటి ప్రయోజనం గురించి విస్తృతంగా ప్రచారం చేసి అందరూ   ఏటియంలు వినియోగించేలా కృషి చేశాడు.
 
వాటర్ ఏటియం గొప్పదనం గురించి కథలు కూడా విరివిగా ఇప్పుడు వినబడుతున్నాయి. ఏటియం వాటర్ వినియోగం వలన ఆరోగ్యం మెరుగుపడిందని, చురుగ్గా ఉండగలుగుతున్నామని చాలామంది ఇప్పుడు సంతోషంతో చెబుతున్నారు. ‘‘మా నాన్న కీళ్లనొప్పులు తట్టుకోలేక ఎప్పుడూ మందులు తీసుకునేవారు. ఏటియం నీటిని వాడడం మొదలు పెట్టిన తరువాత...అదేం మహత్యమోగానీ నొప్పులు తగ్గిపోయాయి. నాన్న  పెయిన్‌కిల్లర్స్ వాడడం పూర్తిగా మానేశారు’’ అంటున్నాడు పదమ్‌సింగ్ గ్రామానికి చెందిన ఒక చిన్న వ్యాపారి.
 గతంలో గ్రామస్థులు మున్సిపల్ వాటర్, భూగర్భ జలాల మీద ఎక్కువగా  ఆధారపడేవారు. రేఖా అతోలియా అనే గృహిణి మాటల్లో చెప్పాలంటే‘ -
 ‘ఆ నీళ్లు కనీసం వంట చేయడానికి కూడా పనికిరావు’.
 దీనికి కారణం... ఆ జలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడమే.
 పెద్ద పెద్ద కంపెనీల సామాజిక సేవా విభాగాల సహకారంతో... రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన ‘జీవన్ అమృత్’ పథకం గ్రామీణ ప్రజలకు ఫ్లోరైడ్ లేని స్వచ్ఛమైన జలాలను అందించడమే కాదు... ఇరవై నాలుగు గంటలు నీరు అందుబాటులో ఉండేలా చేస్తుంది. మరిన్ని ప్రాంతాలలో, మరిన్ని ప్లాంట్లను నిర్మించి, వాటర్ ఏటియమ్‌ల సంఖ్యను పెంచాలని రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది. ఏది ఏమైనా ఏటియంల పుణ్యమా అని రాజస్థాన్‌లోని పలు గ్రామాలు నీటికళతో కళకళలాడుతున్నాయి.
 
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో ‘కంగ్లామరేట్ పిరమల్ గ్రూప్’కు చెందిన సామాజిక సేవా విభాగం ‘పిరమల్ ఫౌండేషన్’ అధునిక సౌంకేతిక జ్ఞానంతో స్వచ్ఛమైన  జలాన్ని ఏటియంల ద్వారా ప్రజలకు అందిస్తోంది. ఈ పథకానికి ‘సర్వ్‌జల్’ అని పేరు పెట్టారు.
     
హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వాటర్ ఏటీయంలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. 50 పైసలకు లీటర్ మంచినీరు లభిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మరిన్ని ప్రాంతాలలో వాటర్ ఏటీయంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
     
ఢిల్లీలో పెలైట్ ప్రాజెక్ట్‌గా మొదలు పెట్టిన వాటర్ ఏటియంలు విజయవంతం కావడంతో... మరిన్ని ప్రాంతాలలో ఏటియంలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement