గుండెల్లో గుడారం

In Such a Time Every house Brought the Circus to the Television - Sakshi

గ్రేట్‌  ఇండియన్‌ సీరియల్స్‌–16 

సాయంత్రమైతే గిర్రున తిరిగే సర్కస్‌ లైటు ఫోకస్‌ ఊరిమీద పడుతుంది.పిల్లలూ పెద్దలూ సంబరంగా బయలుదేరి వెళతారు.పులులూ సింహాలు హంసల్లా అటు నుంచి ఇటుకు ఇటు నుంచి అటుకు ఎగిరే మనుషులు జోకర్లు...సర్కస్‌ గుడారం ఇచ్చే ఆనందం ఎంతో.కాని ఆ గుడారాన్నే జీవితం చేసుకున్న వాళ్ల మధ్య ఎన్నో అనుబంధాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. నవ్వులూ ఏడుపులూ ఉంటాయి.వాటిని మొదటిసారి చూపించి ప్రేక్షకుల గుండెల్లో గుడారం వేసిన సీరియల్‌ ‘సర్కస్‌’.

ఊయలలూగుతున్న రంగు రంగుల చిలుకలు.. సైకిల్‌ తొక్కుతూ గిరి గిరా తిరగేసే భారీ ఏనుగు.. రింగ్‌ మాస్టర్‌ చెప్పినట్టు ఆడే పులులు.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సన్నని తీగలమీద జెండాలు పట్టుకొని మరీ అవలీలగా తిరిగే అమ్మాయిలు.. ఒక వైపు నుంచి మరో వైపుకు గాల్లోనే ఫల్టీలు కొట్టే అబ్బాయిలు..ఇవన్నీ చూస్తున్న పిల్లలు నవ్వులతో కేరింతలు కొట్టారు. పెద్దలు ఊపిరి బిగబట్టి చూశారు. ఇది సినిమా కాదు.. సర్కస్‌. ఈ పేరు వింటూనే మీ చెవుల్లో ఓ పాట ‘సర్కస్‌ హై భాయ్‌ సర్కస్‌ హై.. ఏ దునియా ఏక్‌ సర్కస్‌ హై.. రంగ్‌ బిరంగీ సర్కస్‌ హై.. ’ అంటూ రింగులుగా తిరుగుతుండాలి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా కాకుండా జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు సర్కస్‌ పెద్ద వేదికగా ఉండేది.

కొన్ని సర్కస్‌ కంపెనీలు చిన్నా పెద్ద టౌన్‌లకు కూడా వెళ్లి నెలా రెండు నెలలు వినోదాన్ని పంచి తిరిగి మరో చోటుకు వెళ్లేవి. అలాంటి రోజుల్లో ప్రతి ఇంటికి సర్కస్‌ను మోసుకొచ్చింది దూరదర్శన్‌. 1989లో పంతొమ్మిది వారాల పాటు సర్కస్‌ ఫీట్లతో ఇంటిల్లిపాదినీ తన ప్రపంచంలోకి లాక్కొచ్చింది. ప్రపంచంలో ఉన్నదంతా సర్కస్‌లో ఉందని చూపింది. ఎందుకంటే సర్కస్‌ అనేదే ఓ ప్రపంచం కాబట్టి. అక్కడ రాగద్వేషాలున్నాయి, గుండెదాటని కష్టాలున్నాయి, ఎగిసిపడే కెరటాలున్నాయి. మంచి ఉంది. చెడు ఉంది. దీని కోసం రచయిత దర్శకులు అజీజ్‌ మిర్జా, కుందన్‌ షాహ్‌లు కలిసి ఒక సర్కస్‌ ట్రూప్‌నే తయారుచేశారు. దీంట్లో షారూఖ్‌ ఖాన్, రేణుకా సహానే, అశుతోష్‌ గోవరికర్‌ వంటి ముఖ్యులు నటించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రసారమైన ఈ సీరియల్‌ని పిల్లలు సర్కస్‌కి వెళ్లినంతగా ఎంజాయ్‌చేశారు.

కళాకారుల నిలయం
సర్కస్‌ అనేది కొంతమంది కలిసి పనులు చేసుకుంటూ, తమకు వచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉండే ఒక కంపెనీ మాత్రమే కాదు. కొంతమంది చుట్టూత కలిసి ఉండే జీవితం. అది అపోలో సర్కస్‌. దాని యజమాని బాబూజీ. సర్కస్‌ కంపెనీలో ఉన్నవారందరినీ తన బిడ్డల్లానే చూసుకునేంత ఉదాత్తుడు. పై చదువుల కోసం కొడుకు శేఖరన్‌ని వేరే చోట ఉంచి చదివిస్తుంటాడు. సర్కస్‌లోని కష్టనష్టాలేవీ కొడుకుకు తెలియవు. రోజు రోజుకూ సర్కస్‌ను నడపడం భారంగా అనిపిస్తుంటుంది బాబూజీకి. అయినా, దాంట్లోనే పుట్టి పెరిగిన బాబూజీ సర్కస్‌ని కాపాడుకోవడమే ధ్యేయంగా జీవిస్తుంటాడు.

ఒకసారి జంతువులను అమ్మే సింగ్‌ బాబూజీని కలిసి, తన దగ్గర ఉన్న ఎలుగును కొనుగోలు చేయమని అడుగుతాడు. కానీ, బాబూజీ తనకున్న ఆర్థిక కష్టాల గురించి చెప్పి వద్దంటాడు. చదువు పూర్తయి తన కొడుకు శేఖరన్‌ సర్కస్‌కి వస్తున్నాడని అందరికీ చెబుతాడు బాబూజీ. శేఖరన్‌ చిన్ననాటి నేస్తం మరియతో పాటు అంతా సంతోషిస్తారు. శేఖరన్‌ వచ్చాక సర్కస్‌లో అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ముందు వద్దనుకున్న ఎలుగును శేఖరన్‌ కోసం కొనడానికి సిద్ధమవుతాడు బాబూజీ. అయితే, శేఖరన్‌ సర్కస్‌ తనకు వద్దని, సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెడుతుంటాడు.

కొడుకు మాట కాదనలేక బాబూజీ మౌనంగా బాధపడుతుంటాడు. సర్కస్‌ పనులు వదిలేసి తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తిరిగి స్నేహితుల వద్దకు వెళ్లిపోతాడు శేఖరన్‌. కొడుకు మీద ఆశ వదులుకున్న బాబూజీ సర్కస్‌లో క్లిష్టమైన ఫీట్‌ చేయడానికి సాహసిస్తాడు. ఆ సమయంలో గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరుతాడు. విషయం తెలిసి శేఖరన్‌ తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి బాగు కోసం సర్కస్‌ ఎప్పటిమాదిరిగానే నడుస్తుందని, తానే దగ్గరుండి చూసుకుంటానని మాట ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. శేఖరన్‌ ఆధ్వర్యంలో సర్కస్‌కి కొత్త రూపు వస్తుంది.

ప్రమాదాల ప్రయత్నం 
తాగుబోతైన జొనాథన్‌ని బాబూజీ సర్కస్‌ నుంచి బయటకు వెళ్లగొట్టకుండా, తాగడానికి డబ్బులు కూడా ఇవ్వడం కంపెనీలో చాలా మందికి అర్థం కాదు. అతని వల్ల కంపెనీకి ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు భావిస్తారు. అయితే, జొనాథన్‌ అపోలో సర్కస్‌కు విశ్వసనీయుడని తెలుసుకుంటారు. జొనాథన్‌ యువకుడిగా ఉన్నప్పుడు అపోలో సర్కస్‌లో ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌. ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోతాడు. దీంతో తప్పనిసరిగా అతను తన  కళ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కూతురు మరియను తనలా ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ కావాలని, సర్కస్‌ ఫీట్లు చేయాలని బలవంతం చేస్తాడు.

సర్కస్‌లోని వారంతా జొనాథన్‌ తపనను అర్ధం చేసుకొని, సర్దిచెబుతారు. కూతురుని క్షమించమని అడుగుతాడు జొనాథన్‌. తండ్రి తపించే కళను తనూ నేర్చుకోవాలని రోజూ ఫీట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది మరియ. కానీ, తన వల్ల కాకపోవడంతో బాధపడుతుంది. మాజీ ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ షామిలీ మాటలతో స్ఫూర్తి పొందిన మరియ మళ్లీ ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంతో మరియ విజయవంతం అవడంతో జొనాథన్‌ సంతోషంతో పొంగిపోతాడు. సర్కస్‌లోని వారంతా అభినందిస్తారు. 

ప్రియమైన సర్కస్‌
సర్కస్‌ కంపెనీయే తమ ఇల్లుగా భావించే అందరి మధ్య ఒక విడదీయ లేని ప్రేమ ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లల ఆలనపాలనా చూడడటం, పిల్లలు పెద్దవాళ్లతో కలిసిపోవడం.. కుటుంబాన్ని తలపిస్తుంది. అయితే, సర్కస్‌ సీరియల్‌ అనగానే షారూఖ్, రేణుకా సహానే ప్రేమే మన కళ్ల ముందు కదులుతుంది. అయితే, అంతకు ముందే షామిలీ– ఆదిత్య ప్రేమ కళ్లకు కడుతుంది. సర్కస్‌లోనే వయోలిన్‌ ఆర్టిస్ట్‌ ఆదిత్య, ట్రపీజ్‌ ఆర్టిస్ట్‌ షామిలీ ప్రేమించుకుంటారు. అయితే, షామిలీని రింగ్‌ మాస్టర్‌ సుబృద్‌ ప్రేమిస్తాడు. ఆదిత్య మీద తప్పుడు నేరం మోపి జైలు శిక్ష పడేలా చేస్తాడు సుబృద్‌. ఆ తర్వాత షామిలీని పెళ్లి చేసుకుంటాడు. పదేళ్ల తర్వాత ఆదిత్య జైలు నుంచి తిరిగి వస్తాడు. విషయం తెలిసిన షామిలీ చాలా బాధపడుతుంది.

షామిలీ తిరస్కారం సుబృద్‌ని బాధిస్తుంది. ప్రదర్శన మధ్యలో సుబృద్‌ పులి పంజా బారిన పడతాడు. పెళ్లి తర్వాత  ట్రపీజ్‌ ఆర్ట్‌కు దూరమైన షామిలీ పదేళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్‌ చేసి తన ఫీట్లతో తిరిగి పాత వైభవాన్ని పొందుతుంది. శారీరక వైకల్యంతో బాధపడే కళందర్‌ తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమయ్యాడో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాడు. దూరమైన తల్లిదండ్రులు ఒకరోజు కళందర్‌ని సర్కస్‌లో కలుసుకుంటారు. కళందర్‌ తమ కొడుకు జగదీష్‌ అని, చిన్నప్పుడే తమ నుంచి దూరమైన బిడ్డ అని, తమతో పాటు రమ్మంటారు. ఈ సర్కసే తన ఇల్లు అని, ఇదే తన ప్రపంచం అని చెప్పి కంటతడిపెట్టిస్తాడు కళందర్‌. అపోలో సర్కస్‌లో జరుపుకునే పండగలు, జంగూమంగూ చేసే కామెడీ సర్కస్‌ అంతా సందడిని నింపుతుంది.

మనస్ఫూర్తిగా బాధ్యత
హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన∙బాబూజీ సర్కస్‌లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. సంబరంగా జరుగుతున్న సర్కస్‌ ప్రదర్శన మధ్యలోనే బాబూజీ ప్రాణాలు వదలుతాడు. సర్కస్‌ను నడపడం తన వల్ల కాదంటాడు శేఖరన్‌. అంతా బాధలో మునిగిపోతారు. అర్థరాత్రి నిద్రపట్టక కూర్చున్న శేఖరన్‌కి తన తండ్రి ఆ సర్కస్‌లోనే కనిపిస్తుంటాడు. శేఖరన్‌ వద్దకు వచ్చిన మరియ తెల్లవారేసరికి సర్కస్‌ను వదిలిపెట్టి నీదైన ప్రపంచంలోకి వెళ్లిపొమ్మంటుంది. శేఖరన్‌ని తీసుకెళ్లడానికి అతని స్నేహితుడు వస్తాడు.

బయటి వరకు వచ్చిన శేఖరన్‌కి తండ్రి ఫొటో లోపలే మర్చిపోయానని గుర్తొచ్చి తిరిగి సర్కస్‌లోకి వెళతాడు. అక్కడ తండ్రి తనను విడిచి వెళ్లద్దని అదృశ్యంగా చెప్పే మాటలు శేఖరన్‌లో మార్పు తీసుకువస్తాయి. శేఖరన్‌ మనస్ఫూర్తిగా సర్కస్‌ బాధ్యతలు స్వీకరించడంతో సీరియల్‌ ముగుస్తుంది. ఒక యువకుడు ఇబ్బందుల్లో ఉన్న తండ్రి సర్కస్‌ను తను తీసుకొని ఎలా మేనేజ్‌ చేశాడన్నదే ఈ కథ. సర్కస్‌ కంపెనీతో తండ్రికి ఉండే బంధం, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొడుకుతో పాటు కంపెనీలో ఉన్నవారిందరూ పడే తపన మన కళ్ల ముందు కదలాడుతుంది. 
– ఎన్‌.ఆర్‌

బాలీవుడ్‌ బాద్షా, సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ముప్పై ఏళ్ల క్రితం అప్పుడప్పుడే నటనలో నిలదొక్కుకోవడానికి శ్రమిస్తున్న రోజులు. షారూఖ్‌కి ఫస్ట్‌ బ్రేక్‌ ఫౌజీ సీరియల్‌తో టీవీ అవకాశం ఇచ్చినా ఇప్పటికి షారూఖ్‌ ఇండస్ట్రీలో ఫస్ట్‌ డేస్‌ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్కస్‌ సీరియల్‌ ప్రస్తావనే వస్తుంది. దూరదర్శన్‌ షారూఖ్‌ నటనకి సర్కస్‌తో ఓ పెద్ద వేదికనిచ్చింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top