వెయ్యి నవలల చెయ్యి

వెయ్యి నవలల చెయ్యి


అరవై ఏళ్ళ క్రితం ఆయన రచనలంటే తెలుగు పాఠకులకు వేలంవెర్రి. నెల తిరిగే లోపలే పదే పదే ముద్రణకు వచ్చిన ఆయన నవలలు కొల్లలు. రచననే వృత్తిగా చేసుకొని, వెయ్యికి పైగా నవలలు రాసి, సామాన్యుల్లో పఠనాభిలాషను పెంచి, పుస్తకాలకు పాఠకలోకాన్ని అందించిన ఆ తెలుగు రచయిత  - కొవ్వలి లక్ష్మీనరసింహారావు. పాపులర్‌గా... కొవ్వలి! ఏడాదికి వంద నవలల చొప్పున రాసి, 30వ ఏటకే 600 నవలలు పూర్తిచేసిన ఘనత కొవ్వలిది. ఆయన రచనలపై సాహిత్య అకాడెమీ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రేపు హైదరాబాద్‌లో ‘చర్చా సదస్సు’ నిర్వహిస్తున్నాయి. సందర్భంగా కొవ్వలి రెండో కుమారుడు, రిటైర్‌‌డ బ్యాంక్ అధికారి లక్ష్మీనారాయణ పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు...  

 

కొవ్వలి లాంటి సుప్రసిద్ధుడికి సంతానమైనందుకు మా తోబుట్టువులం నలుగురం ఇవాళ్టికీ ఎంతో గర్విస్తుంటాం. వెనక్కి తిరిగి చూస్తే - నాన్న జీవితం, రచనా జీవితం గమ్మత్తుగా సాగాయనిపిస్తుంది. ఆయన పుట్టింది నూట రెండేళ్ళ క్రితం జూలై 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తణుకులో! మా తాతయ్య ప్లీడరు గుమస్తా. రెండేళ్ళ వయసులోనే తల్లి పోవడంతో, అక్కల దగ్గరే నాన్న పెరిగారు. రాజమండ్రిలోని వీరేశలింగం హైస్కూల్‌లో మెట్రిక్ చదివే రోజుల్లో ప్రముఖులు జయంతి గంగన్న హెడ్‌మాస్టర్, ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు లెక్కల మాస్టారు.. నాన్నను తీర్చిదిద్దినవారు ఆ ఇద్దరూ!



నాన్న రచనలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఒకటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర పోడూరులో నాన్న, వాళ్ళ అక్కయ్య పోడూరి కామేశ్వరమ్మ దగ్గర ఉన్న రోజులవి. ఒకరోజున ఒక ఇల్లాలు ఇంట్లో చంటి పిల్లాడు మలవిసర్జన చేస్తే, ఒక కావ్యంలోని కాగితం చించి, దాంతో శుభ్రం చేసి, కిటికీలో నుంచి పారేయడం నాన్న కంట పడింది. అర్థం కాని ఆ గ్రాంథిక భాష, విషయం వల్ల ఆ పని చేసినట్లు ఆ ఇల్లాలు చెప్పడంతో నాన్నలో ఆలోచన మొదలైంది. వెంటనే ఆయన ఇల్లొదిలి, ఏడాది పాటు దేశాటన చేశారు. ఎలాంటి భాషతో, ఏ విషయాల మీద రాస్తే సాహిత్యం జనానికి చేరుతుందని అందరినీ అడిగి ఒక అభిప్రాయానికి వచ్చారు. తిరిగొచ్చాక 23వ ఏట 1935లో తొలి నవల ‘పల్లెపడుచులు’ రాశారు. వాడుక భాష, ఆకర్షణీయమైన శైలితో సాగిన ఆ సాంఘిక నవలకు మంచి స్పందన రావడంతో వరుసగా నవలలు రాసుకుంటూ వెళ్ళారు. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ, స్త్రీ స్వేచ్ఛను ప్రతిపాదిస్తూ, సంఘ సంస్కరణ దృష్టితో ఆయన రాసిన నవలలు కొద్ది రోజుల్లోనే ఆకట్టుకున్నాయి. మూడు పదుల వయసొచ్చేనాటికి 600 నవలలు రాశారాయన.



 సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, అపరాధ పరిశోధన - ఇలా అన్ని కోవల రచనలూ ఆయన చేశారు. అతి తక్కువ ధరకే పుస్తకాలివ్వాలని తపించారు. నాన్న అధిక శాతం నవలలు రాసింది ఏలూరు, రాజమండ్రిల్లో! సినిమా వాళ్ళ పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాక, ‘భయంకర్’ అనే కలం పేరుతో డిటెక్టివ్ రచనలు చేశారు.

 నిజానికి, నాన్నకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమావాళ్ళు బలవంతపెట్టడంతో మద్రాసుకు వెళ్ళారు. నటి కన్నాంబ సొంత చిత్రాలు నిర్మించ తలపెట్టినప్పుడు మొదటి సినిమా ‘తల్లిప్రేమ’ (1941)కు నాన్నతోనే రాయించారు. అది ఆయన తొలి సినీ రచన. తరువాత డి.ఎల్. నారాయణ ‘వినోదా’ సంస్థను స్థాపించి, సినిమాలు తీస్తూ, నాన్న గారి ‘మెత్తని దొంగ’ నవల ఆధారంగా ‘శాంతి’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం పేకేటి శివరామ్ తొలి సినిమా. అలా 1950ల నుంచి మద్రాసులో నాన్న స్థిరపడ్డారు. కైకాల సత్యనారాయణ తొలి చిత్రం ‘సిపాయి కూతురు’ నాన్న నవలే.



నాన్న రచనలంటే నటి సూర్యకాంతం గారికి మహా ఇష్టం. ఆయన తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను ఆమెకే అంకితమిచ్చారు. ఆ సభలో నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్ వచ్చి, ఉచితంగా పాట కచ్చేరీ చేశారు. అలాగే, నాన్నకి మద్రాసులో షష్టిపూర్తి జరుగుతుంటే, ఆ విషయం వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని, గాయకులు ఘంటసాల స్వయంగా వచ్చారు. ‘‘కొవ్వలి గారి షష్టి పూర్తి అంటే దేవుడి పెళ్ళి లాంటిది. దానికి ఎవరూ రమ్మని ప్రత్యేకించి, ఆహ్వానించనక్కర లేదు’’ అంటూ శాలువా కప్పివెళ్ళారు. నటులు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, చిత్తూరు నాగయ్య గార్లు మేమంటే అభిమానం చూపేవారు. నాన్న గారు పోయాక ఆ మధ్య తిరుమలలో వెంకన్న కల్యాణం చేయించుకొని, మద్రాసుకు కుటుంబ సమేతంగా వెళుతున్నాను. ఆ రోజున మా సీట్ల వెనకాలే బాపు - రమణలు కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ‘కొవ్వలి గారి అబ్బాయి’నంటూ పరిచయం చేసుకున్నా. బాపు ఎంతో సంతోషించారు. ముళ్ళపూడి వారైతే లేచి నిల్చొని, ‘తెలుగు రచయితలకు పాఠకుల భిక్ష పెట్టింది మీ నాన్న గారే!’ అంటూ నమస్కరించారు. నాన్న రచనా వారసత్వం పిల్లలెవరికీ రాకపోయినా, ఆ రోజుల్లో ఆయన మీద ప్రముఖులకున్న గౌరవం ఇవాళ్టికీ మాకు మిగిలిన అపురూప వారసత్వం. ఆత్మాభిమానంతో, ఎవరినీ ఏ సాయం అడగని తత్త్వం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలైనా మమ్మల్ని మంచి పౌరులుగా నాన్న పెంచారు.



 నాన్న నవలల జాబితా మొత్తం మా దగ్గర ఉంది. మొత్తం వెయ్యిన్నొక్క నవలలు. అయితే, మొదటి నుంచి రచనల్ని భద్రపరుచుకొనే అలవాటు నాన్నకు లేదు. దాంతో, తొలి రోజుల్లో రాసిన నవలలు కొన్ని వందలు మా దగ్గర లేవు. పెళ్ళయిన తరువాత నుంచి మా అమ్మ ప్రతి నవల కాపీ భద్రంగా దాచేది. అలా మా దగ్గర ఇప్పటికి అయిదారొందల నవలలే ఉన్నాయి. మిగిలినవి సేకరిస్తున్నాం. తాజాగా ‘విశాలాంధ్ర’ వారు 18, ‘ఎమెస్కో’ వారు 43 పుస్తకాలు ప్రచురించారు. పాతిక భాగాల జానపద నవల ‘జగజ్జాణ’ను వెయ్యి పేజీలతో ఒకే సంపుటిగా ఇటీవల విడుదల చేస్తే, చక్కటి స్పందన వచ్చింది. త్వరలో ‘విషకన్య’ రానుంది.



 వెయ్యిన్నొక్క నవలలు రాసిన ఆధునిక తెలుగు రచయితగా నాన్న గారు కొవ్వలిది ఇవాళ్టికీ ఒక రికార్డే. ఇప్పటికి నూట రెండేళ్ళ క్రితం పుట్టిన ఆ మనిషిని ఇవాళ్టికీ సజీవంగా నిలిపింది ఆ రచనలే. అవన్నీ మళ్ళీ అందుబాటులోకి రావాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ర్పచారం, ‘చౌకబారు నవలలు’ అంటూ వచ్చిన అపప్రథ తొలగిపోవాలి. అదే మేము కోరుకొనేది. సాహిత్య అకాడెమీ ‘చర్చా సదస్సు’ ఆ కృషిలో మొదటిమెట్టు!

 

 

స్త్రీ స్వేచ్ఛ, సంఘసంస్కరణ లాంటి భావాలతో రచనలు చేసినందు వల్లే నాన్న గారి నవలలపై అప్పట్లో ఛాందసులు, సంప్రదాయవాదులు లేనిపోని ప్రచారం చేశారు. ఆ నవలల్ని గమనిస్తే, వాటిలో ఒక్క శాతమైనా అసభ్యత, అశ్లీలం ఉండవు. పెపైచ్చు, ప్రతి నవలకూ ముందే ‘సూచన’ అంటూ నాన్న ఆ రచన ద్వారా సమాజానికి తానివ్వదలుచుకున్న సందేశం ఏమిటో రాశారు. ఆ సూచనలన్నీ ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నాం.

 

- రెంటాల జయదేవ

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top