స్ట్రీట్‌ హరాస్‌మెంట్‌?

Street Harassment? - Sakshi

ఆ అమ్మాయి విరుగుడు కనిపెట్టిందివీధుల వెంట నడిచే ఆడపిల్లలను వేధించే పోకిరీలను ఎదుర్కొనడానికి ఢిల్లీలోనిఒక యువతి నడుం బిగించడం సత్ఫలితాలను ఇస్తోంది.ఆ నడక చూడు...హైస్సా...ఆ డ్రస్సు ఏముంది గురూ..ఆజా మేరీ సన్ని లియోన్‌...ఏమండీ.. టైమెంతో చెప్తారా...మీ ఇల్లెక్కడా?వీధులు మగవాళ్లు నడవడానికి మాత్రమే కాదు. మనుషులందరూ నడవడానికి. కాని వీధులకు కూడా జెండర్‌ ఉంది. మన దేశంలో చాలా మటుకు వీధులు ‘పురుష వీధులు’. అంటే పురుషులు మాత్రమే ‘సేఫ్‌’గా భావించే వీధులు. కాని నిజమైన వీధులు ఏమంటే ‘స్త్రీలు నడవడానికి సేఫ్‌గా భావించే’ వీధులు. భారతదేశంలోని చాలా ఊళ్లలో, నగరాల్లో తొంభై శాతం వీధులు స్త్రీలకు సేఫ్‌ కాదేమో అన్న భావన కలిగిస్తుంటాయి. ఇక స్త్రీలకు అత్యంత ప్రమాదకరంగా మారిన ఢిల్లీ నగరంలో అయితే ప్రతి వీధి ఒక సాలెగూడే. ఈ పరిస్థితిని మార్చాలి అనుకుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మొదలెట్టిన సుదీర్ఘ, పెద్ద పోరాటం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది.

చుట్టూ తిరిగి వెళ్లడమే మేలు
స్వాతి నిన్న మొన్నటి ఢిల్లీలోని మంగోల్‌పురిలో తన కాలేజ్‌కు చుట్టూ తిరిగి వెళ్లేది. ఆ చుట్టూ తిరగడం వల్ల ఆమెకు రెండు కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. స్ట్రయిట్‌ దారిలో తను వెళ్లడం ఇబ్బంది. ఆ దారిలో ఒక మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర పోకిరీలు ఉంటారు. వాళ్లు ఏమైనా కామెంట్‌ చేస్తే తాను భయపడుతుంది. అందుకే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సంగతి ఇంట్లో చెప్పడానికి లేదు. చెప్తే ఏమవుతుందో తెలుసా? నీకసలు కాలేజీ వద్దు ఏం వద్దు ఇంట్లో కూర్చో అని కూర్చోబెడతారు. దాని కంటే ఈ బాధ పడటం మేలు. అందుకే స్వాతి ఈ తిప్పలు పడుతోంది. కాని ఆ తిప్పలు ఆమెలో ఒక గాఢమైన సంకల్పాన్నైతే తీసుకునేలా చేశాయి.

సేఫర్‌ సిటీ
స్వాతి కాలేజ్‌ పాసైంది. వెంటనే ఉద్యోగం అంటూ బయలు దేరకుండా తాను చేయవలసిన పనిలోకి దిగింది. ఢిల్లీలోనే ఉన్న ‘ప్లాన్‌ ఇంటర్నేషనల్‌’ అనే ఒక బాలల హక్కుల సంస్థను సంప్రదించి వాళ్లతో తన మనసులోని భావన చేప్పింది. ఆమెకు వాళ్లు మద్దతు ఇస్తామని చెప్పారు. అలా మొదలైందే ‘సేఫర్‌ సిటీస్‌’ కార్యక్రమం. అంటే ‘భద్రత నగరాలు’ అని అర్థం. ఈ భద్రత అందరికీ. ముఖ్యంగా స్త్రీలకి. స్వాతి ప్రమేయంతో ఢిల్లీలో ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నీ సేఫర్‌ సిటీ కార్యక్రమంలో చేతులు కలిపాయి. దాదాపు పది వేల మంది కార్యకర్తలు సభ్యులుగా మారారు. వీరిలో దాదాపు 8 వేల మంది యువతులే. వీళ్లందరూ ఢిల్లీలోని వివిధ కాలనీల వీధులను ఆడవాళ్లు, ఈడొచ్చిన అమ్మాయిలు సేఫ్‌గా తిరిగే ప్రదేశాలుగా మార్చాలనుకున్నారు.

మూడు ప్రదేశాలు
ప్రతి వీధిలో స్ట్రీట్‌ హరాస్‌మెంట్‌కు వీలయ్యే ప్రదేశాలు మూడు ఉంటాయి. ఒకటి: వెలుగు తక్కువ ఉన్న ప్రాంతం 2. నిరుపయోగమైన పేవ్‌మెంట్లు ఉన్న ప్రాంతం 3. పాడుబడ్డ ప్రదేశాలు. ఈ మూడు ప్రదేశాల మీద దృష్టి పెట్టడం సేఫర్‌ సిటీస్‌ కార్యకర్తల పని. వీరు మొదట పోలీసు వారితో, కార్పోరేషన్‌ వారితో ఈ సమస్యలను చెబుతారు. ఎక్కడైతే లైట్లు వెలగవో అక్కడ లైట్లు పెట్టించడం, పాడుబడ్డ ప్రాంతాలను శుభ్రం చేయడం వంటి పనులతో అల్లరి పెట్టే వాళ్ల ముఖాలు వెలుగులోకి వస్తాయనే భయంతో సగం హరాస్‌మెంట్‌ తగ్గింది. ఆ తర్వాత ఈ కార్యకర్తలు స్ట్రీట్‌ హరాస్‌మెంట్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుకాణదారులను, అపార్ట్‌మెంట్‌ వాసులను సంప్రదించి వారికి సమస్యను వివరించి అలా అల్లరి పెట్టే వారిపై నిఘా పెట్టమని కోరుతారు. వీళ్ల విన్నపం మీద చాలామంది దుకాణాదారులు అదనపు లైట్లు వెలిగించి వీధులను కాంతి మయం చేశారు. కొన్ని అపార్ట్‌మెంట్ల వాళ్లు ‘సేఫ్‌ హోమ్‌’ అని బోర్డులు పెట్టారు. అంటే ఏ ఆడపిల్లైనా పోకిరీల వల్ల వీధిలో వేధింపులు ఎదుర్కొంటే ఈ అపార్ట్‌మెంట్‌లలోకి ధైర్యంగా వెళ్లి షెల్టర్‌ తీసుకోవచ్చన్న మాట. వీళ్లు చేసిన ఇంకో పని కాలేజీలు, స్కూళ్లు మొదలయ్యే వదిలే సమయాల్లో పోలీసుల కదలికలు ఉండేలా పోలీస్‌ స్టేషన్లలో చెప్పి ఏర్పాటు చేయడం. ఈ సమయాల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక ఆడపిల్లలను తాకడం, తడమడం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించే ఈ ఏర్పాటు కూడా సత్ఫలితాలు ఇచ్చింది.

మాట్లాడితే సమస్య తగ్గుతుంది
ఆడపిల్లలకు సమస్య ఎవరితో? అబ్బాయిలతో. అబ్బాయిలతో మాట్లాడితే సగం సమస్య తగ్గుతుంది. ఎదుగుతున్న వయసులో ఉన్న అబ్బాయిలను ముఖ్యంగా కాలేజీ అబ్బాయిలను కలిసి మాట్లాడాలని సేఫర్‌ సిటీస్‌ కార్యకర్తలు భావిస్తారు. అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడి ‘అలా మీరు కామెంట్‌ చేయడం, వేధించడం వల్ల ఆడపిల్లలు చాలా బాధ పడతారు’ అని చెబుతారు. సరిగా అర్థం చేయిస్తే మారే అబ్బాయిలు చాలామంది ఉన్నారని ఈ ప్రయత్నం వల్ల రుజువైంది. అలాగే తల్లిదండ్రులతో కూడా మాట్లాడతారు. అబ్బాయిలను అమ్మాయిల విషయంలో సంస్కారవంతం చేయాలని, అలాగే అమ్మాయిలను స్వేచ్ఛగా తిరిగే ధైర్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలని చెబుతారు. ఈ ప్రయత్నాలన్నింటి వల్ల ఢిల్లీలోని ‘మంగోల్‌ పురి’లో స్ట్రీట్‌ హరాస్‌మెంట్‌ బాగా తగ్గింది.

ఇది సరిపోదు
కాని ఇదొక్కడే సరిపోదని స్వాతికీ ఇంకా ఇలాంటి ఆలోచనలు చేస్తున్న కార్యకర్తలకూ తెలుసు. అసలు సమాజంలో అత్యధికులకు స్త్రీలంటే చిన్న చూపు ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణం అని వాళ్లు అర్థం చేసుకున్నారు. మగవాళ్లు అనడానికి... ఆడవాళ్లు పడటానికి అన్నట్టుగా ఈ సంస్కృతిలో నాటుకు పోవడమే అసలు సమస్య. కాని అంతమాత్రాన నిస్పృహ చెందాల్సింది కూడా లేదు. ప్రయత్నిస్తూ పోవడం, మాట్లాడుతూ పోవడం, పోరాడుతూ ఉండటమే సత్ఫలితాలు ఇస్తుంది.మనిషి తన పోరాటంతో అనేక హక్కులు సాధించుకున్నాడు.స్త్రీలు కూడా తమ పోరాటంతో భద్రమైన వీధులను సాధించుకోవాలనుకుంటున్నారు.

వీళ్ల విన్నపం మీద చాలామంది దుకాణాదారులు అదనపు లైట్లు వెలిగించి వీధులను కాంతి మయం చేశారు. కొన్ని అపార్ట్‌మెంట్ల వాళ్లు ‘సేఫ్‌ హోమ్‌’ అని బోర్డులు పెట్టారు. అంటే ఏ ఆడపిల్లైనా పోకిరీల వల్ల వీధిలో వేధింపులు ఎదుర్కొంటే ఈ అపార్ట్‌మెంట్‌లలోకి ధైర్యంగా వెళ్లి షెల్టర్‌ తీసుకోవచ్చన్న మాట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top