ఫిడేలు తాతగారు

Story About Dwaram Venkataswamy Naidu - Sakshi

జయంతి

చిన్నప్పటినుంచీ మా చిన్నతాతకు సంబంధించిన మూడు పెట్టెల గురించి వింటూ పెరిగాను. ఒకటి ఆయన ఫిడేలు పెట్టె. చలం ‘మ్యూజింగ్స్‌’లో రాశారు కదా. నాయుడుగారూ, చలంగారూ ఒకసారి ఒకే రైలుపెట్టెలో ప్రయాణం చేయడం గురించి. ఏలూరు అడ్వొకేట్‌ పి.వి.రమణారావుగారికి నాయుడుగారన్నా, వీణధనమ్మాళ్‌ అన్నా గొప్ప ఆరాధన. ఆయన కూడా ఆ రోజు నాయుడుగారితోపాటు ఆ రైలులోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ రమణరావుగారి మాటలెట్లా ఉన్నాయో చలం రాస్తారు. ఆ రైలుబండి, ఆ పట్టాలూ అన్నీ నాయుడుగారి కోసం, ఆ ఫిడేలు కోసమే వేసినట్లూ, మిగతావారంతా వాళ్ళ అదృష్టంకొద్దీ ఆ బండెక్కినట్లూనట. ‘‘అయ్యో, ముట్టుకోకండి, అది నాయుడుగారి వయొలిన్‌’’ అని గాభరా పడతాడు రమణారావు. ఆరాధనంటే అదీ అంటారు చలం. పైగా నాయుడుగారు చలంగార్ని అడిగారట, ‘మీ పుస్తకాలేమైనా పంపించండి’  అని. అమ్మో నాయుడుగారు నా పుస్తకాలు చదువుతారా అని నివ్వెరపోయారు చలం. 
∙∙ 
చిన్నపిల్లల మధ్య వయొలిన్‌తో చిన్నతాత విన్యాసాలు చూసి తీరాలి. పది పదిహేనుమంది  కూర్చునేవారు ఆయన చుట్టూనూ. తలుపులన్నీ మూయించేసేవారు. చిన్న వెలుతురు మసకచీకటిలా ఉండేది. ఆయన పచార్లు చేస్తుంటే నన్నో, మా చెల్లి మనోరమనో ఒక వయొలిన్‌తో కూర్చుని ఒక సాకీ లాగనో, రిఫ్రైన్‌ లాగనో ‘ఓరోరి బండివాడా వగలమారి బండివాడా’ పల్లవి మెల్లగా వాయించమనేవారు. పచార్లు చేస్తూనే మధ్యలో ఆయన ఆ పాట అందంగా వాయించేవారు. పచార్లు ఆగేవికావు. పాట బండిలాగా సాగిపోతూనే ఉండేది. మధ్యమధ్యలో బండిచక్రం కిర్రు చప్పుడు వినిపించేవారు. ఎడ్ల మెడలో గంటలు, బండివాడి ‘ఎహెయ్‌’ అరుపూ, చెట్లమీంచి పక్షుల కలరవాలు, వీధిలో కుక్కలు మొరగటం, గాడిద అరుపులూ ఇవన్నీనూ. పిల్లలు నవ్వేవారు. ఆ నవ్వులు కూడా ఆయన ఫిడేలు అనుకరించేది. ఇంతేనా! సడెన్‌గా అలా నడుస్తూనే వయొలిన్‌ వీపువెనకాతలకి తలక్రిందులుగా దించి కుడిచెయ్యి కమాను సరిగ్గా తీగలమీద పడేట్టు చేసి పాట బ్రేక్‌ లేకుండా కంటిన్యూ చేసేవారు. అమ్మో! అని పిల్లల కేకలు. మళ్ళీ నడక. ఈసారి నిలబడిపోయి ఒక కాలు ఎత్తి వయొలిన్‌ కాళ్ళ మధ్యనుంచి వెనక్కీ ప్రక్కకీ పెట్టి అదే పాట వాయించడం. ఇందాకటి వీపుగోకుడు వాద్యం ఆట గురించి నేను తర్వాత ‘‘ఇదేవిటండీ ఎక్కడా వినలేదు, కనలేదు, కథల్లో చదవలేదు’’ అంటే, ఆయన ఇంకెవరూ లేకుండా చూసి నాతో చెప్పారు. ‘‘ఓయ్, నా చిన్నప్పుడు పెళ్ళి ఊరేగింపుల్లోనూ, దేవుడు ఊరేగింపుల్లోనూ సానిమేళా లుండేవోయ్‌. ఆ మేళాల్లో ఫిడేలు ఉండేది. నాట్యం ఆగిపోయినప్పుడు ఆ ఫిడేలు వాయించేవాళ్ళు ఇలాంటి ఫీట్స్‌ చేసేవాళ్ళు జనాల కోసం. అవి ఇప్పుడు పోయాయి. అందుకని మీకు కొత్త’’.  ఫీట్స్‌ ఎవరైనా ప్రయత్నించి చెయ్యగలరేమో కాని అంత ప్రిసిషన్, కౌశలం, శ్రుతిభాగ్యం, నాజూకు, సుతారం, ఫీట్స్‌లో కూడా ఉండాలంటే అసాధారణ రహస్య పరిశ్రమా? లేదా అది ఒక అసామాన్య, అతీత సహజశక్తా? ఆయనతో పోల్చగలిగిన మాస్టరీ నాకైతే చార్లీ చాప్లిన్‌లో మాత్రమే కనిపిస్తుంది. (ద్వారం వెంకటస్వామినాయుడు జయంతి నవంబర్‌ 8న మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వీవీఐటీ, నంబూరు ప్రచురిస్తున్న ‘ఫిడేలు నాయుడుగారు’ విడుదల కానుంది. )
- ద్వారం దుర్గాప్రసాదరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top