స్పోర్ట్స్‌ స్టార్స్‌

Sports Based Movies In Telugu - Sakshi

‘ఆట గదరా శివా’... అని జీవుడు దేవుడు గురించి అనుకోవచ్చు. హీరో హీరోయిన్లు ఆటాడుకుందాంరా అని డైరెక్టర్‌తో అంటున్నారు. కొందరు కబడ్డీ ఆడుతున్నారు..కొందరు బాక్సింగ్‌ గ్లవ్స్‌ తొడుక్కుంటున్నారు..కొందరు ట్రాక్‌ మీద బుల్లెట్‌ సౌండ్‌ వినగానే పరుగు తీయడానికి రెడీ అవుతున్నారు..మరికొందరు కుస్తీ గోదాలో తొడగొడుతున్నారు. కథలిప్పుడు ఆట ఆటగా ఉన్నాయి. ప్రేక్షకుల చేత కలెక్షన్లనే పాయింట్లు కోరుతున్నాయి. గెలిచిన వారికే సక్సెస్‌ కప్‌! టాలీవుడ్‌ను స్పోర్ట్స్‌ ఫీవర్‌ పట్టుకున్నట్లుంది. బాక్సింగ్, రన్నింగ్, హాకీ... ఇలా ఏ ఆటలో మంచి కథ దొరికితే ఆ క్రీడాకారులుగా మారిపోయి మైదానంలోకి అడుగుపెడుతున్నారు నటీనటులు. ఇండస్ట్రీ గ్రౌండ్‌లో వెండితెర వేదికపై సూపర్‌ హిట్‌ కప్పు కొట్టాలనే కసితో ఆటకు రెడీ అయ్యారు. స్టోర్స్‌ స్టార్స్‌గా ప్రేక్షకుల నుంచి రికార్డు వసూళ్లు అందుకోవాలనే సంకల్పంతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ టోర్నీకి సిద్ధమవుతున్న సినిమా స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

స్వారీకి సై
‘గురు’ సినిమాలో బాక్సర్‌గా బాక్సాఫీస్‌కు ఫటా ఫట్‌ పంచ్‌లు ఇచ్చిన వెంకటేశ్‌ మరో స్పోర్ట్స్‌ మూవీ కోసం గుర్రపు స్వారీకి సై అన్నారని సమాచారం. ఈ స్పోర్ట్స్‌ సినిమాకు ‘పెళ్ళిచూపులు’ ఫేమ్‌ తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట రేస్‌ క్లబ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని టాక్‌. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తున్నారట తరుణ్‌ భాస్కర్‌.

కబడ్డీ... కబడ్డీ..
కబడ్డీలాంటి ఆటలకు గోపీచంద్‌లాంటి కటౌట్‌ ఉన్న హీరోలు బాగా సూట్‌ అవుతారు. త్వరలో గోపీచంద్‌ కబడ్డీ కోర్టులోకి అడుగుపెట్టనున్నారు. కానీ ఆటగాడిగా కాదు.. కోచ్‌గా. కోర్టులోకి దిగి తన జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చి గెలుపు మంత్రం చెప్పబోతున్నారు. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్‌ నటించనున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకుడు. ఈ చిత్రంలో తెలంగాణ జట్టు కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తారు.

గెలుపు గోల్‌
మ్యాచ్‌లో తన సహచర ఆటగాడు అందించిన పాస్‌ అందుకుని హాకీ స్టిక్‌తో బంతిని ఎక్స్‌ప్రెస్‌ వేగంతో గోల్‌ పోస్ట్‌ వైపు తీసుకెళ్తున్నారు సందీప్‌ కిషన్‌. మ్యాచ్‌ని మలుపు తిప్పే ఓ గోల్‌ కోసం గోల్‌పోస్ట్‌లోకి షాట్‌ కొట్టారు. ఆ నెక్ట్స్‌ ఏమైందో ఇప్పుడే చెబితే ఎలా? ఆటను, ఆ షాట్‌ను వెండితెరపై చూస్తేనే కదా అసలు మజా. ప్రేక్షకులకు ఆ కిక్‌ను అందించడానికే ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో హాకీ ప్లేయర్‌ అవతారం ఎత్తారు సందీప్‌ కిషన్‌. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

కలల పరుగు
400 మీటర్స్‌ స్ప్రింటర్‌గా సరికొత్త ట్రాక్‌ రికార్డును క్రియేట్‌ చేయాలనుకునే కలలవైపు పరుగులు పెడుతున్నారు ఆది పినిశెట్టి. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘క్లాప్‌’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆకాంక్షా సింగ్‌ హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారు. అథ్లెట్‌ విష్ణు పాత్రలో నటిస్తున్నారు ఆది పినిశెట్టి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం.

గురి పెట్టాడు
బాణం చేతపట్టి హిట్‌ మూవీపై గురి పెట్టారు నాగశౌర్య. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ స్పోర్ట్స్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది. ఈలోపు ఆర్చరీ (విలు విద్య)లో ప్రత్యేక్ష శిక్షణ తీసుకునే పనిలో బిజీగా ఉంటారట నాగశౌర్య.

డబుల్‌ ధమాకా
బాక్సర్‌గా... రేసర్‌గా.. ఒకేసారి రెండు ఆటలు ఆడటానికి రెడీ అవుతున్నారట విజయ్‌ దేవరకొండ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫైటర్‌’. ఈ చిత్రం కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుందని, విజయ్‌ బాక్సర్‌గా నటిస్తారని టాక్‌. మరోవైపు ‘హీరో’ చిత్రం కోసం రేసర్‌గా ట్రాక్‌లో పడ్డారు విజయ్‌. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆనంద్‌ అన్నామళై దర్శకుడు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌గా విజయ్‌ దేవరకొండ కనిపించిన సంగతి తెలిసిందే.

మరికొన్ని...
ఆల్రెడీ కొంతమంది హీరోలు క్రీడాకారులుగా సాధన మొదలుపెట్టేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇందులో గోపీచంద్‌ పాత్రలో సుధీర్‌ బాబు నటించనున్నారు. సుధీర్‌బాబు ఆల్రెడీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అనే విషయం తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తారు. ‘గద్దలకొండ గణేష్‌’ తర్వాత చేయబోతున్న చిత్రంలో  వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో కిరణ్‌ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్‌లో రానా నటిస్తారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రధారిగా నగేష్‌ కుకునూరు దర్శకత్వంలో స్పోర్ట్స్‌ కామెడీ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘కౌశల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్‌’ సినిమాలో క్రికెటర్‌గా కనిపించిన ఐశ్వర్యా రాజేష్‌ ‘మిస్‌ మ్యాచ్‌’ సినిమాలో రెజ్లర్‌గా నటించారు. ఎన్‌.వి. నిర్మల్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయ్‌ శంకర్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
– ముసిమి శివాంజనేయులు
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top