నటరాజ పున్నమి | Sakshi
Sakshi News home page

నటరాజ పున్నమి

Published Mon, Jan 16 2017 10:52 PM

నటరాజ పున్నమి

యామిని

యామిని కృష్ణమూర్తి (76) నాట్యకళాకారిణి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో.. నిండు పున్నమినాడు జన్మించిన యామిని తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. అక్కడే నాట్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌’ నాట్యాచార్యురాలిగా బోధనాంశాలలో నిమగ్నమై వున్నారు. యామిని అసలు పేరు పూర్ణతిలక. నాట్యంలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. పద్మవిభూషన్‌ గ్రహీత కూడా. ఇటీవల ‘నటరాజ డాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ అకాడమీ’ వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. యామినితో ముచ్చటించింది. ఆ విశేషాలు:

యామిని తండ్రి కృష్ణమూర్తి కూతుర్ని కూడా తనలా పండితురాలిని చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేశారు. అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం... ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థాన గురించి చెప్పడ మొదలుపెట్టారు యామినీ.
తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్‌ కళాక్షేత్రకు తీసుకువెళ్లారు. యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు.

పండుగలన్నీ నాట్య వేదిక మీదే!
భరతనాట్యం నేర్చుకునే సందర్భంలోనే కూచిపూడి నాట్యం వైపు యామిని మనసు మళ్లింది. ఆ తర్వాత కూచిపూడి వైభవానికి ఆమె పాటుపడ్డారు. అది చాలా చిత్రంగా జరిగింది.తర్వాత ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు కేలూచరణ్‌ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యం అభ్యసించారు.  ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ... ఒక్కోటి గంట సేపు ప్రదర్శించేదాన్ని. మరొక విషయం చెప్పాలి. నాకు పండుగలన్నీ నాట్యవేదిక మీదే జరిగేవి. ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో నా నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం’’ అని చెప్పారు యామిని.

ఆలయాలు తొలి నాట్యాలయాలు
యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చెన్నైలోని చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గర కావడంతో,  దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటూ వివరించారు యామిని. – డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ

‘యామిని ఉందా?’  
►ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘‘యామిని ఉందా’’ అని అడిగేవారు. ∙నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో ‘క్షీరసాగరమథనం’ నృత్యరూపకం ప్రదర్శించడం ఒక మధురానుభూతి.

►కలకత్తా ప్రజలను చూస్తే ‘ఆర్ట్‌ ఈజ్‌ ఇన్‌ దెయిర్‌ హార్ట్స్‌’ అనిపిస్తుంది.

►నేను లోన్లీ పర్సన్‌ కాను, ఎలోన్‌గా ఉంటాను, డిలైటెడ్‌గా ఉన్నాను. ∙విమర్శించాలనుకునేవారు... సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు అని – సూర్యుడిని కూడా విమర్శిస్తారు.

బందిపోట్ల కోసం నాట్యం!
ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్‌లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు.  

నాట్యం నేర్పింది ‘రైతు బిడ్డ’
వేదాంతం రాఘవయ్య గారి ‘రైతు బిడ్డ’ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది.

 
Advertisement
 
Advertisement