శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్థానిక సత్రంలో అభ్యంతరకర సినీ పాటలతో వేడుకలు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని ఒక ప్రైవేట్ సత్రంలో వసతి పొందిన యాత్రికులు డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాది వేడుకల్లో భాగంగా పాటలు పాడుతూ, చిందులు వేస్తూ కేక్ కటింగ్ చేశారు. శ్రీశైలంలో కొన్నేళ్లుగా ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోరాదని దేవస్థానం కూడా ఆంక్షలు విధించింది. 10 ఏళ్ల క్రితం దేవస్థానం ప్రధాన రాజగోపురం ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పాలతో కూడిన ఆర్చ్ కటౌట్, ధ్వజస్తంభం వద్ద అలంకరణ చేసేవారు.
అయితే అప్పటి దేవదాయ కమిషనర్ అనురాధ పుణ్యక్షేత్రంలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలు నిషిద్ధమని ప్రకటించడంతో నేటి వరకు దేవస్థానంతో పాటు స్థానికులు కూడా నూతన సంవత్సర వేడుకలకు స్వస్తి పలికారు. కానీ దేవదాయ నిబంధనలకు విరుద్ధంగా సత్రంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే ఈ సత్రం నిర్మాణ దాతలలో ఒకరు కర్నూలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు కావడంతోనే పోలీసులు, ఆలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్టు సమాచారం. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన సత్రం నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జి.మల్లికార్జున డిమాండ్ చేశారు.


