
కొత్త కిడ్
టీనేజ్‌లోంచి క్వీన్ ఏజ్‌లోకి వచ్చిన కొత్త కిడ్ జెలెనా ఒస్టాపెంకో!
టీనేజ్‌లోంచి క్వీన్ ఏజ్‌లోకి వచ్చిన కొత్త కిడ్ జెలెనా ఒస్టాపెంకో! ఫ్రెంచి ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లోకి అడుగుపెట్టిన ఈ రాకుమారి.. మహామహా టెన్నిస్ పచ్చిక మైదానాలన్నిటినీ తనకు రెడ్ కార్పెట్‌గా మార్చుకోబోతున్నారా?! పారిస్‌లో
ఆమె కనబరిచిన ఫుట్‌వర్క్‌ను చూస్తే ఉమెన్ టెన్నిస్‌లో కొత్త శకం ఆరంభం అయినట్లే కనిపిస్తోంది.
జెలెనా ఒస్టాపెంకో టెన్నిస్ క్రీడాకారిణి
జననం : 1997 జూన్ 8
జన్మస్థలం : రీగా, లాత్వియా
ఎత్తు : 5 అడుగుల తొమ్మిదిన్నర అంగుళాలు
ఆట తీరు : రైట్ హ్యాండెడ్
కోచ్ : అనబెల్ మెదీనా గ్యారిగ్స్ (మహిళ)
తల్లిదండ్రులు : జవ్‌జెనిస్, జెకోవ్‌లెవా
ర్యాంకు : 47 (ఇక ఇప్పుడు 12కి చేరుకోవచ్చు)
జెలెనాకు ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆమెకో ఫోన్ ఉందేమో కానీ, ఆ ఫోన్ నెంబర్ మానవ మాత్రుల దగ్గర లేదు! శనివారం జెలెనా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవగానే లాత్వియా అధ్యక్షుడు రైమండ్స్ వెజెనిస్ నుంచి జెలెనా తల్లి జెకోవ్‌లెవాకు కాల్ వచ్చింది. ‘‘మీ అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పండి’’ అని. ఆ తర్వాత ఆయన తల్లిని, కూతుర్ని అభినందనల్లో ముంచెత్తారు. జూన్ పదిహేనున రైమండ్స్ పుట్టిన రోజు. ఐదు రోజుల ముందే ఆయన తన బర్త్‌డే చేసుకున్నంతగా సంబరపడిపోయారు. కాదా మరి! లాత్వియాకు అది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆ టైటిల్‌ను సాధించి తెచ్చింది తన దేశ పౌరురాలు.
జెలెనాకు టెన్నిస్‌లో ఫస్ట్ కోచ్ ఆమె తల్లే. టీవీలో సెరెనా విలియమ్స్‌ని చూపిస్తూ ‘నువ్వలా ఆడాలి’ అంటూ ఆమెను ఆడించింది. పట్టుపట్టి టెన్నిస్ నేర్పించింది. బాసిన్‌స్కీపై సెమీఫైనల్‌లో కూతురు విజయం సాధించగానే ‘‘తను ఎప్పటికైనా స్లామ్ ఫైనల్‌కు వెళుతుందని మా నమ్మకం. అందుకు ఎంతో సమయం లేదని ఇప్పుడు అనిపిస్తోంది’ అని తమ ఇంటి ముందు గుమికూడిన టీవీ చానళ్ల ప్రతినిధులతో అన్నారామె.
ఫైనల్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్‌ను ఓడించడానికి ముందు తన కెరీర్ మొత్తం మీద 54 మంది జగజ్జెట్టీలను టెన్నిస్ కోర్టులలో మట్టుపెట్టింది జెలెనా. ‘ఈ పిడుగు కొట్టిన షాట్‌లకు నా కడుపు కదిలిపోయింది’ అని సిమోనా హలెప్ బహిరంగంగానే అంగీకరించారు. ఈ విజయంతో జెలెనాకు 21 లక్షల యూరోల ప్రైజ్ మనీ చేతికి వచ్చింది. సుమారు 15 కోట్ల 10 లక్షల రూపాయలు! రకరకాల ఉద్యోగాలు చేసి, తినీతినకా దాచి, ఔదార్యం గల అజ్ఞాత దాతల నుంచి ఆర్థిక సహాయం పొంది కూతుర్ని టెన్నిస్ క్రీడాకారిణిగా నిలబెట్టిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కాస్త ‘బ్రీతింగ్ స్పేస్’ దొరికినట్టే. ఆట కోసం జెలెనా ఎంత కష్టపడుతుందో వాళ్లకు తెలుసు. అయితే ఆ కష్టాన్ని ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె తల్లి చూడదలచుకోలేదు! తను చూస్తుండగా ఆడుతున్నప్పుడు కూతురు స్ట్రెస్‌కు గురువుతుందేమోనన్న భయంతో ఆమె కోర్టు బయటే ఉండిపోయారు!
జెలెనా ఆట దూకుడుగా ఉంటుంది. బాల్ మిస్ అయితే ఆమె కోపం చూడలేం. నిరుడు ఆక్లాండ్‌లో ఆడుతూ బ్రిటన్ ప్లేయర్ నవోమీ బ్రాడీతో వాదనకు దిగి, ర్యాకెట్‌ను విసిరి కొడితే అది వెళ్లి బాల్ బాయ్‌కి తగిలినంత పనవడం.. టెన్నిస్ క్రీడాభిమానులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే పవర్ షాట్‌ల మ్యాచ్‌ని ఒక పుష్పగుచ్ఛంగా అందించింది జెలెనా ఒస్టాపెంకో. ఆ గుచ్ఛంలోని కొన్ని పరిమళాలు మీకోసం.. బ్రీఫ్‌గా.
వన్ బై వన్
ఒక ఒలింపిక్స్ చాంపియన్, ఒక యూఎస్ ఓపెన్ చాంపియన్, ఒక ప్రపంచ మాజీ నంబర్ వన్, ఒక సీడెడ్ ప్లేయర్.. వీళ్లందర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మట్టికరిపిస్తూ ఫైనల్‌కి చేరిన 20 ఏళ్ల కొత్తమ్మాయి జెలెనా వొస్తాపెంకో శనివారం నాడు మూడో సీడ్ సిమోనా హలప్‌పై ఘన విజయం సాధించి గ్రాండ్ స్లామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జెలెనా ధాటికి ఏ రౌండ్‌లో ఎవరు చేతులెత్తేశారో చూడండి.
1. రెండో రౌండ్ మోనికా ఫుయిగ్ (ఫ్యూర్టోరికో)
2. ప్రిక్వార్టర్ ఫైనల్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)
3. క్వార్టర్ ఫైనల్ వోజ్నియాకి (డెన్మార్క్)
4. సెమీ ఫైనల్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)
5. ఫైనల్ సిమోనా హలెప్(రొమేనియా)
దృఢమైన ఓక్ వృక్షం
యు.ఎస్. క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో పాటు జెలెనాకు ఎర్నెస్ట్ గల్‌బైస్ కూడా అభిమాన క్రీడాకారుడు. గల్‌బైస్ పుట్టిందీ లాత్వియాలో జెలెనా జన్మస్థలం రిగాలోనే. జెలెనాకు ‘అలోనా’ అని పిలిపించుకోవడం ఇష్టం. స్నేహితులు, బంధువులు అంతా ఆమెను అలోనా అనే పిలుస్తారు. ప్రొఫెషనల్‌గా కూడా అలోనా అనే పేరుతోనే గుర్తింపు పొందాలని అనుకున్నా లాత్వియా నిబంధనల ప్రకారం అది కష్టమైన విషయం. అందుకే ఆటలో మాత్రం ఈ ‘అలోనా’.. జెలెనా నే! అలోనా అంటే హెబ్రూ భాషలో దృఢమైన ఓక్ వృక్షం అని అర్థం.
బర్త్‌డే బేబీ
జూన్ 8 గురువారం. ఫ్రెంచ్ ఓపెన్ మొదలైన పదో రోజు. అదే రోజు ఉమెన్ సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో జెలెనా, స్విస్ అమ్మాయి బాసిన్‌స్కీ తలపడుతున్నారు. ఆ రోజు ఎవరు గెలిచినా అది వారికి బర్త్‌డే గిఫ్ట్ అవుతుంది. జెలెనా, బాసిన్‌స్కీ ఇద్దరూ జూన్ 8నే పుట్టారు. అయితే బాసిన్‌స్కీ బర్త్ ఇయర్ 1989. జెలెనా కన్నా ఎనిమిదేళ్లు పెద్ద. ఆటలో కూడా జెలెనా కన్నా అనుభవజ్ఞురాలు. చివరికి బర్త్‌డే గిఫ్ట్ జెలెనా చేతికి వచ్చింది.
అమ్మ చెప్పింది
జెలెనా తండ్రి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఉక్రెయి¯Œ నగరం జపోరిజియాలో అక్కడి ఫుట్‌బాల్ క్లబ్ తరఫున గోల్‌కీపర్. జెలెనా నానమ్మ జపోరిజియాలోనే ఉంటుంది. జెలెనా కజిన్ బ్రదర్ మక్సిమ్ యు.ఎస్.లో ఉంటున్నాడు. జెలెనాకు టెన్నిస్‌పై ఇష్టం కలగడానికి ఆమె తల్లే కారణం. ఆమె టెన్నిస్ కోచ్. అలా ఐదవ ఏటే జెలెనా టెన్నిస్ ర్యాకెట్ పట్టింది. అదే ఏజ్‌లో డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ‘నేషనల్ లాత్వియన్ చాంపియన్‌షిప్స్ ఫర్ బాల్‌రూమ్ డాన్సింగ్’ కోసం పోటీ పడింది. అయితే పన్నెండేళ్లు వచ్చేసరికి జెలెనా దృష్టి పూర్తిగా టెన్నిస్ వైపు మళ్లింది. టెన్నిస్‌లో ఇప్పటి తన కోఆర్డినేషన్‌కి, ఫుట్‌వర్క్ నైపుణ్యానికి అప్పుడు నేర్చుకున్న డాన్సే ఉపయోగపడిందని జెలెనా అంటుంది. ఆమె ఫేవరేట్ డాన్స్ సాల్సా. ఇప్పటికీ వారానికి నాలుగు సార్లు డ్యాన్స్‌కు వెళుతుంది. జెలెనా మూడు భాషలు మాట్లాడుతుంది. లాత్వియా, రష్యన్, ఇంగ్లిష్.
ఒక విజయం... అనేక విశేషాలు
∙కేవలం 20 లక్షల జనాభా ఉన్న ఐరోపా దేశం లాత్వియా నుంచి గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి క్రీడాకారిణి.కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మొదటి ఇద్దరూ.. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (యు.ఎస్), పురుషుల విభాగంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్). బార్బరా 1979లో(ఆస్ట్రేలియన్ ఓపెన్), గుస్తావో కుయెర్టన్ 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నారు.1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ టైటిల్ గెలుచుకున్న రోజే మన లేటెస్టు హీరోయిన్ జెలెనా ఒస్టాపెంకో జన్మించడం విశేషం.
ఒస్టాపెంకో విజయానికి మరికొన్ని ప్రత్యేకతలు
1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణి.1997లో ఇవా మయోలీ (19 సం. 300 రోజులు) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, 2006లో మరియా షరపోవా (19 సం. 77 రోజులు) తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన చిన్న వయసు అమ్మాయి.2001లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలి సెట్‌లో ఓడిపోయాక కూడా టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్.