మిస్‌ ఎబిలిటీ

Special story to DISABILITY Miss Ability - Sakshi

డిజ్‌ఎబిలిటీని ‘మిస్‌ ఎబిలిటీ’గా మార్చిన వసుంధర అనే యువతి మహా సంకల్ప బలం ఇది. జీవితమంతా పోరాటంతోనే గడిపి, చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో పడలేక రాజీనామా చేసి, సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి దివ్యాంగుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తున్న వసుంధర.. అందాల పోటీలను కూడా నిర్వహించి.. అందం కేవలం దేహ సౌందర్యానికే పరిమితం కాదనీ, ప్రతిభలోనూ అందం ఉంటుందని చాటి చెప్పారు.  హెచ్‌ఎస్‌బిసిలో పనిచేస్తున్న రేఖారాణి ప్రత్యేకమైన హెయిర్‌ స్టయిల్‌తో లేరు. వేదిక మీద ఆమె తన శరీరం గురించి, తనకున్న లోపాల గురించి పట్టించుకోలేదు. గ్లామరస్‌గా లేరు, జీరో సైజు కూడా కాదు, కాని ప్రత్యేకమైన అందం కలిగిన అమ్మాయి. ర్యాంపు మీద వీల్‌ ఛెయిర్‌లోనే తన గాంభీర్యాన్ని, తన ప్రతిభను ప్రదర్శించి, పోటీలో పాల్గొన్న పదహారు మందిలో ‘మిస్‌ ఎబిలిటీ’ టైటిల్‌ గెలిచారు.  గతంలో ‘కాగ్నిజెంట్‌’లో పనిచేసిన లక్ష్మీ సుందరి కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. 2011లో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో లక్ష్మీ సుందరి వీల్‌ చైర్‌కే పరిమితమైపోయినా, ఈ ‘మిస్‌ ఎబిలిటీ’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ‘‘మేం ఎంత ప్రత్యేకమో ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రయత్నం’’ అంటారు ఈ ఈవెంట్‌ను నిర్వహించిన ‘వేవ్‌ మీడియా’ సంస్థ సిఈవో వసుంధర కొప్పుల. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ‘వేవ్‌ మీడియా’ అందాల పోటీలు జరిగాయి. దివ్యాంగురాలైన వసుంధర, దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వున్నారు.

తమ్ముడు మోసుకెళ్లేవాడు
వసుంధర స్వగ్రామం అనంతపురం జిల్లా సెట్టూరు. తల్లి ప్రమీల, తండ్రి ఆనందరావు, తమ్ముడు రాజేంద్రప్రసాద్‌. వసుంధర చిన్నపిల్లగా ఉన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. తల్లి గార్మెంట్స్‌ బిజినెస్‌ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫారమ్స్‌ తయారుచేసి సప్లయి చేస్తున్నారు. వసుంధరకు రెండేళ్ల వయసులో వేసిన పోలియో వ్యాక్సిన్‌ వికటించి ఆమె రెండు కాళ్లూ బలహీనమయ్యాయి. వసుంధరకు ఏడు సంవత్సరాలు వచ్చేవరకు ఎంతోమంది వైద్యులకి చూపించింది తల్లి. నయం కాలేదు. చందమామ వంటి పుస్తకాలు చదవడానికైనా ఉంటుందని వసుంధరను స్కూల్‌లో వేశారు. స్కూల్‌లో టీచర్లు, స్నేహితులు అందరూ వసుంధరను తమతో సమానంగానే చూశారు. స్పెషల్‌ కిడ్‌లాగ ఏ ఒక్కరూ చూడలేదు. వసుంధర తమ్ముడు కూడా అదే స్కూల్‌లో చదువుకుంటూ, అక్కను ఒక క్లాసు నుంచి మరొక క్లాసుకి ఎత్తుకుని తీసుకువెళ్లేవాడు.‘అమ్మ వద్దన్నా.. బయటికొచ్చేశాను’ వసుంధర చక్రాల బండికే పరిమితమైపోయినా, మానసికంగా కుంగిపోలేదు. పట్టుపట్టి బికామ్‌ పూర్తి చేశారు. సి.ఏ. చేస్తూ మధ్యలో వదిలేసి, ఎం.ఏ. మాస్‌ కమ్యూనికేషన్‌ చదివారు. ‘‘మీడియాలో ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఒక్కర్తినే ఉంటానంటే అమ్మ వద్దన్నా, ఆమె మాటను కాదని, బయటకు వచ్చేశాను’’ అంటున్న వసుంధర, తనకు అమ్మ వల్లే ఇంత శక్తి వచ్చిందంటున్నారు. తనలాంటి వందమందిని కలిసి వారి సమస్యల గురించి వినతి పత్రం తయారుచేసి, అబ్దుల్‌ కలామ్‌కి అందచేశారు వసుంధర. ఆయన తక్షణమే దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటయ్యేలా అధికారులను ఆదేశించారు.

వసుంధర నిర్వహించిన అందాల పోటీలో ‘మిస్‌ ఎబిలిటీ’ టైటిల్‌ విన్నర్‌ రేఖారాణి, రన్నరప్‌ లక్ష్మీ సుందరిలతో వసుంధర 

ఆత్మాభిమానంతో రాజీనామా!
చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్లడానికి తల్లి అంగీకరించనప్పుడు.. ‘‘నేనేమీ అడవిలోకి వెళ్లట్లేదు’’ అని ఆమెను ఒప్పించిన వసుంధర ఒక సంవత్సరం పాటు ఒక టీవీ చానెల్‌లో ఉద్యోగం చేశారు. అక్కడ వివక్షకు గురయ్యారు. ఆమె పనిచేసినా పనిచేయకపోయినా జీతం ఇచ్చేయమని మేనేజ్‌మెంట్‌ అన్నట్లు తెలిసి ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో తన సొంత సంస్థ ‘వేవ్‌ మీడియా’ ప్రారంభించారు. ఆ తర్వాత ‘అంధుల క్రికెట్‌’ నిర్వహించారు. వారి సంస్థ తరఫున 2015లో ‘మిస్‌ ఎబిలిటీ’ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకుంటే, 2018 ఏప్రిల్‌ నాటికి కార్యరూపం దాల్చింది. ‘‘మాతో పనిచేయాలంటే సెన్సిబుల్‌గా ఉండాలి. అది నాలాంటి వాళ్లకి మాత్రమే తెలుస్తుంది’’ అంటారు వసుంధర. 

తలా ఒక చెయ్యేస్తే చాలు
చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు వసుంధర. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నిటినీ ఒంటరిగానే అధిగమిస్తున్నారు. అంతేకాదు, తనలాంటివారికి అండగా నిలుస్తున్నారు, వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు వసుంధర. ‘‘దివ్యాంగులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే వారిని నమ్మి గ్యారంటీ ఇచ్చేవారు ఉండరు. చదువుకోనివారు సైతం లోన్‌ తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు వీరికి ఎందుకు ఇవ్వకూడదు? ప్రభుత్వం వీరి తరఫున నిలబడి లోన్లు ఇప్పించాలి’’ అంటున్నారు వసుంధర. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేవారు, వీరి గురించి ఆలోచించి, వీరు చేసేవాటికి కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కదా అంటారు వసుంధర. ‘‘పెద్ద పెద్ద కంపెనీలు మా తరఫున ప్రచారం చేయొచ్చు కదా’’ అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, దివ్యాంగులు అన్నిరకాల వస్త్రాలు ధరించలేరు కనుక వారికి అనుగుణంగా అందమైన వస్త్రాల ను ప్రత్యేకంగా బొటిక్‌వారు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేసే మొత్తంలో ఐదు శాతం దివ్యాంగుల సంక్షేమానికి వినియోగించాలని, ఏడాదికి వందమందినైనా ఉద్యోగాలకు ఆహ్వానించాలని కోరుతున్నారు. 

అవార్డులు.. పురస్కారాలు
►లేడీ లెజెండ్‌ అవార్డు – 2018 (ట్యూటర్స్‌ ప్రైడ్‌ ఆర్గనైజేషన్‌)
►విశిష్ట సేవా పురస్కార్‌ 2018 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి)
►ఇండియన్‌ అడ్వాంటేజ్‌ ఉమెన్‌ అవార్డు 2018 (దేశవ్యాప్తంగా వచ్చిన 19,300 అప్లికేషన్లలో 25 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరు).
►2013లో జరిగిన ‘మిస్‌ వీల్‌ చెయిర్‌’ ప్రోగ్రామ్‌లో ‘మోస్ట్‌ వోటెడ్‌ గర్ల్‌ ఆఫ్‌ ద నేషన్‌’ అవార్డు (ఆంధ్రప్రదేశ్‌ నుంచి) 
►తెలుగు రక్షణ సమితి, హైదరాబాద్‌ వారి నుంచి 2013 ఉత్తమ కవయిత్రి బహుమతి. 
– వైజయంతి పురాణపండ
వసుంధర మెయిల్‌ ఐడీ:koppulavasundhara@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top