కొండల్లో కొలువేల్పు

Special Story About Kivasing - Sakshi

ఉద్యోగం ఉన్న ఇంట్లో దేవుడు ఉన్నట్లే. దేవుడి పటాన్నైతే తెచ్చిపెట్టుకోవచ్చు. ఉద్యోగాన్ని ఎవరు పటం కట్టి ఇస్తారు? పటాలతో కొండపైకి వెళ్లింది కివాసింగ్‌. మాట తీరును మెరుగుపరిచే పటం.. డబ్బులు కాసే ఐడియాల పటం.. మార్కెటింగ్‌కు పదును పెట్టే పటం.. అన్నీ కలిపి చూస్తే.. దేవుడు ప్రత్యక్షం! కుమావోన్‌ కొలువేల్పు కివా ఇప్పుడు.

సరస్సులు కొండలపైకి ఎగసిపడలేవు. కివాసింగ్‌ రెండున్నరేళ్లుగా కొండలపైకి వెళ్లివస్తోంది. కొద్దిరోజులు కొండలపైనే ఉంటుంది కూడా. ‘సరస్సుల జిల్లా’ నైనిటాల్‌ అమ్మాయి కివాసింగ్‌. ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’ లో ప్రోగ్రామ్స్‌ స్పెషలిస్టుగా అనుభవం ఉన్నవారికి చిన్నా చితకా ఉద్యోగాలేమీ రావు. నెత్తిన పెట్టుకుని విమానాల్లో ఊరేగించే ఉద్యోగాలే అన్నీ. అవొద్దనుకుని దేవుడి గుడి మెట్లు ఎక్కినట్లుగా.. కుమావోన్‌ కొండల్లోని ప్రతి గడపా ఎక్కి దిగుతోంది. ఏముంటాయి కొండల్లో! ఏముంటాయేమిటి? కొండలే ఉంటాయా! మనుషులు ఉండరా? వాళ్లకు పిల్లలు ఉండరా? వాళ్లు పెద్దయి ఉండరా? ఉద్యోగాల కోసం చూస్తూ ఉండరా?

‘‘నా పేరు కివాసింగ్‌ అమ్మా. నైనిటాల్‌ నుంచి వచ్చాను. మీ కిందే నేను ఉండేది. మీరు కొండపైన, నేను సరస్సు పక్కన..’’
ఆమె చేతిలో ఉన్న ఫైల్స్, ల్యాప్‌టాప్‌ చూస్తారు వాళ్లు. ఆమె ముఖంపై చిరునవ్వును కూడా. ఇంట్లోకి రమ్మనే అవసరం ఉండదు. కొండల్లో భాగమై ఉండే ఇళ్లు కనుక కొండంతా ఇల్లే. కూర్చునే చోటు, నిలబడే చోటు అంటూ ఏమీ ఉండవు. 
కూర్చున్నాక కివాసింగ్‌ అడుగుతుంది.. ‘‘చదువుకునే పిల్లలు గానీ, చదువుకున్న పిల్లలు గానీ ఇంట్లో ఉన్నారా?’’ అని. 
‘‘ఉన్నారు తల్లీ. నీ అంత పిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తావా?’’.. వాళ్ల ప్రశ్న. 
నవ్వుతుంది కివాసింగ్‌. ‘‘ఏం ఉద్యోగం?’’ అంటుంది. ‘‘ఏదైనా.. ఇల్లు గడవడానికి నాలుగు రూపాయలు వస్తే చాలు’’ అంటారు.
కుమావోన్‌ ప్రాంతంలో ప్రతి ఇంటి ముందూ కనిపించే మందార చెట్టులా, కనిపించకుండా ప్రతి చెట్టుకూ విరబూసే ఆశ.. ఉద్యోగం. 
బడికి పోతున్న పిల్లలున్నవాళ్లయితే.. ‘‘నీలాగా ఇంగ్లిష్‌ మాట్లాడాలి. నీలాగా కంప్యూటర్‌ వచ్చి ఉండాలి. అప్పుడు వాళ్లకు ఉద్యోగం వస్తుంది’’ అంటారు. మధ్యలో కివాసింగ్‌ ఫోన్‌ మాట్లాడ్డం విని ఉంటారు వాళ్లు. శ్రావ్యమైన ఆ కంఠంలోంచి జలపాతంలా దూకుతుండే ఇంగ్లిష్‌తో తమ పిల్లలకు తలస్నానం చేయించలేక గానీ.. లేకుంటే అంతపనీ చేసేవారు. 
‘‘ఇంగ్లిష్‌ వస్తుంది అమ్మా.. చక్కగా మాట్లాడగలరు కూడా. నాకంటే చక్కగా..’’ అంటుంది కివాసింగ్‌. ఇదంతా రెండేళ్ల క్రితం వరకు. 
కివాసింగ్‌ టీమ్‌లోని వాలంటీర్‌

కుమావోన్‌కు కివాసింగ్‌ ఇప్పుడు తరచూ ఏమీ వెళ్లడం లేదు. ఆమె తరఫున వాలంటీర్‌లు వెళుతున్నారు. సాయంత్రాలు స్కూల్లో, కాలేజీ ఆవరణల్లో వర్క్‌షాపులు పెడుతున్నారు. వర్క్‌షాపు అనే మాట ఎంత లేదన్నా కాస్త గంభీరమైనదే. ఏదో కార్ఖానా అన్నట్లు ఉంటుంది. అలాంటి భయాలేమీ కలగకుండా వాలంటీర్లు పిల్లల్ని కలుసుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికీ, ఇంగ్లిష్‌ అనే కాదు.. అసలంటూ చక్కగా మాట్లాడ్డానికి, కొత్తవాళ్లతోనైనా చొరవగా మాట్లాడడానికీ వారికి ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తున్నారు. ఈ వాలంటీర్‌లలోనే నికార్సయిన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పించేవారు ఉంటారు. పిల్లల టీచర్‌లకు కూడా వాళ్లు బోధనలోని మెళుకువలు నేర్పిస్తుంటారు.

‘మెళకువ’ అంటే చెప్పడంలో మెళకువ కాదు, వినేలా చెప్పడంలో సరళత. అలాగే పిల్లల ఆసక్తుల్ని అడిగి తెలుసుకుని వాటిపై మరింత ఆసక్తిని కలిగించేందుకు స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇస్తుంటారు. ఇక చదువు అయిపోయి, ఉద్యోగాల కోసం చూస్తున్న యువతుల వర్క్‌షాపు వేరుగా ఉంటుంది. క్యాంపస్‌ సెలక్షన్‌కు కంపెనీల వాళ్లు వచ్చినట్లు కొండల్లోకి వచ్చి రిక్రూట్‌ చేసుకునే వారూ ఉంటారు. అదంతా కూడా కివాసింగ్‌ ఏర్పాటే. అయితే వాళ్లేమీ పెద్ద పెద్ద అర్హతల కోసం చూడరు. ‘అదుంటే బాగుండేది, ఇదుంటే బాగుండేది’ అనరు. ‘మీరేం చేయగలరు?’ అని అడుగుతారు. కుమావోన్‌ అమ్మాయిలు తగ్గుతారా! ‘ఏదైనా చేయగలం’ అంటారు. ‘ఇక్కడే ఉండి ఏం చేయగలరు?’ అని వీళ్లు మళ్లీ అడుగుతారు. అప్పుడు అమ్మాయిల ఆలోచన స్వయం ఉపాధి వైపు మళ్లుతుంది. ఆ కొండల్లో తమకు ఏ ముడిసరుకు లభిస్తుందో గమనిస్తారు.

సెలక్షన్‌ వాళ్లు వెళ్లిన మొదట్లో ఒక అమ్మాయి.. ‘ఐపన్‌ జాపపద కళ మాకు ప్రత్యేకం’ అని చెప్పింది. కుట్లు అల్లికల వంటిది ఐపన్‌. వాటితో అలంకరిస్తూ బ్యాగుల్ని తయారు చేసి మార్కెట్‌ చేసుకోవచ్చు అని వీళ్లు ఐడియా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఇంకో టీమ్‌ వచ్చి కుమావోన్‌ ‘మహిళా పారిశ్రామిక వేత్త’లకు మార్కెటింగ్‌ ఎలా చేయాలో చెప్పి వెళ్లింది. ‘ఇక మీద మిమ్మల్ని మీరు ఎప్పుడూ కుమావోన్‌ అమ్మాయిల్లా చూసుకోకండి. మీ ఉత్పత్తులకు మీరు యజమానుల్లా ఉండండి’ అని కూడా! అమ్మాయిల కాన్ఫిడెన్స్‌ కళకళలాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరైనా వెళ్లి కుమావోన్‌లో చూడొచ్చు. ఎవరెస్టునే ఎక్కాలనేముందీ, సొంత కాళ్లపైన కూడా నిలబడొచ్చు. కుమావోన్‌లోని రెండు గ్రామాలకు ఆ శక్తిని ఇచ్చిన కివాసింగ్‌.. మిగతా గ్రామాలకూ చేరేందుకు టూల్‌ కిట్‌తో ఇప్పుడు నెట్‌లో ‘మౌటేన్‌ విలేజ్‌ ఫౌండేషన్‌’ అనే వెబ్‌ గుడారం వేసుకుని ఉంది. 
ఐపన్‌ ఆర్ట్‌తో సంచుల తయారీ : కుమావోన్‌ యువతులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top