నా దగ్గర ఉండు నాన్నా..

Special Story About Fathers Day Special - Sakshi

నేడు ఫాదర్స్‌ డే

ఇంట్లో మేకప్‌ లేకుండా తిరిగే హీరో నాన్న. ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియని నిస్వార్థ జీవి నాన్న. దేవుడి కంటే ముందు మొర ఆలకించేవాడు నాన్న. ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో మోసే హెర్కులస్‌ నాన్న. ఇవ్వాళ్ల నాన్నకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన రోజు. ఆయనను గట్టిగా గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఆయనతో మాట్లాడాల్సిన రోజు. ఆయన మాట్లాడేది వినాల్సిన రోజు. నాన్నకు నమస్కారం చేసుకోవాల్సిన రోజు.

నాన్నా... చిన్నప్పుడు ఆడుకోవడానికి నీ ఛాతీని ప్లేగ్రౌండ్‌ చేశావు. నీ వీపుని స్కూటర్‌ని చేశావు. హుప్‌ అని ఎగరేసి ఆకాశానికి ఎగిరినట్టే అనిపించావు. నీకున్న సైకిల్‌ మీద ముందో వెనుకో కూచోబెట్టుకోకుండా ఎప్పుడూ సీటు మీదే కూచోబెట్టి నువ్వు మాత్రం నడుస్తూ సైకిల్‌ని, నన్నూ నెట్టుకొచ్చావు. జ్వరం నాకు వచ్చేది. కాని థర్మామీటర్‌ పెట్టి చూస్తే టెంపరేచర్‌ నీకు చూపించేది. పగలంతా పని చేసిన అమ్మ రాత్రి అలసి నిద్రపోతే నన్ను చూసుకోడానికి నువ్వు కదా నాన్నా గూర్ఖా అయ్యేవాడివి. నైట్‌ వాచ్‌మన్‌ అయ్యేవాడివి. జీతం భత్యం లేని కాపలాదారువి అయ్యేవాడివి కదా. సినిమా నచ్చక నేను ఏడిస్తే ఎన్నిసార్లు హాలు బయట తిప్పుతూ ఉండిపోయావ్‌. బిస్కెట్‌ కొనిపెట్టి నేను తింటూ ఉంటే అదే సినిమా అనుకున్నావ్‌.

నీ ఉద్యోగం ఏమిటో. అందులో నీ సంతోషం ఏమిటో. నువ్వు ఎవరికి తల వొంచుతున్నావో. ఎక్కడ వెన్ను వంచుతున్నావో. మమ్మల్ని నిలబెట్టడానికే కదా నాన్నా అదంతా. సాయంత్రం వస్తూ వస్తూ డజన్‌ అరటిపళ్లు తేగలిగిననాడు నీ ముఖంలో సంతోషం. నెలాఖరున ఉత్త చేతులతో వచ్చినప్పుడు ముఖం చూపించడానికి కూడా మొహమాటం. నువ్వు తినే నాలుగు ముద్దలు కూడా అమ్మ ఒక్కోసారి వంట చెడగొట్టినప్పుడు నోరు మెదపకుండా తినేవాడివి. ఒక్క వొక్కపలుకు దొరికితే నోట్లో వేసుకొని అదే వైభోగం అన్నట్టు కూనిరాగం తీసేవాడివి. రెండు లుంగీలను సంవత్సరమంతా కడుతూ, చిరిగిన వైపును ఎంత నైసుగా మడతలోకి తోసేవాడివో. నా కొత్త టెరికాటన్‌ షర్ట్‌కు అదంతా తెలుసు నాన్నా.

ఏమైనా దాచుకున్నావా నువ్వు నీకోసం. ఏదైనా చేసుకున్నావా నీకోసం. అల్సర్‌ వస్తే మజ్జిగ తాగితే చాలనుకుంటావు. వెన్నునొప్పికి చాప మీద దిండులేకుండా పడుకుని అదే మందంటావు. డాక్టర్‌ వారం రోజుల కోర్సు రాస్తే ‘యాభై రూపాయలకు ఎన్ని మందులొస్తే అన్నే ఇవ్వు’ అని ఎన్నిసార్లు నీదైన కోర్సును వాడావో తెలియదా నాన్నా. నువ్వు ఏడవగా ఎప్పుడూ చూళ్లేదుగాని అక్క పెద్దదయ్యిందని అమ్మ పట్టుబట్టి ఫంక్షన్‌ చేయించినప్పుడు అక్కను దగ్గరకు తీసుకుని ఏడ్చావు. ఎందుకు ఏడ్చావో. కాని సంతోషంగా ఏడ్చావనిపించింది. అక్క పెళ్లికి దాచిందంతా ఖర్చు పెట్టావు. పిల్లలనే నీ పెన్షన్‌ అనుకుని ఉంటావు కదా నాన్నా.

అమ్మ అలిగితే భయపడ్డావు. పిల్లలు మంకుపట్టు పడితే భయపడ్డావు. ఇరుగుపొరుగువారు ‘నీకేమయ్యా... బంగారంలాంటి కుటుంబం’ అంటే ఎక్కడ దిష్టి తగులుతుందోనని భయపడ్డావు. మంచి మార్కులు వస్తే భయపడ్డావు. మరింత ముందుకు ఎక్కడ తీసుకెళ్లలేనో అని భయపడ్డావు. ఒక్కసారన్నా కొట్టినా తిట్టినా బాగుండేది. నువ్వు బాధ పడి అదే పెద్ద శిక్షగా మాకు విధించావు. ఏదైనా గుడికెళ్లినప్పుడు ఎంత దిలాసాగా ఉండేవాడివి. దేవుడు నా పిల్లలకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాడు అన్నట్టు నవ్వేవాడివి. నాన్నా... చిన్నప్పుడు అడిగేవాడివి... పెద్దయ్యాక పెద్ద ఇల్లు కట్టి నాకో గది ఇస్తావా... పేపర్లు, పుస్తకాలు చదువుకుంటూ హాయిగా నీ దగ్గర ఉంటాను అని. ఇప్పుడు ఉంది నాన్నా. ఇల్లు ఉంది. నీ కోసం గది ఉంది. పుస్తకాలు కూడా ఉన్నాయి. కాని నువ్వు మాత్రం లేవు నాన్నా.

నాకెందుకు ఇబ్బంది అనుకుంటున్నట్టున్నావు. పిల్లలు పెద్దలను తమ దగ్గర ఉంచుకోవడం లేదు.. నా కొడుకు నన్నెందుకు ఉంచుకుంటాడు అని లోలోపల సందేహపడుతున్నట్టున్నావు. నేను వెళితే మనమలకు, మనమరాళ్లకు అడ్డం అని అనుకుంటున్నావు. అయ్యో నాన్నా.. దబాయించి అడగడం, లాగి లెంపకాయ కొట్టి నాకు ఇది కావాలి అని తీసుకోవడం ఎప్పుడు చేస్తావు నాన్నా. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు అలా ప్రశాంతంగా పడక్కుర్చీలో కూచుని ఉండే నిన్ను చూడటం కంటే ఐశ్వర్యం ఏముంటుంది. అమ్మతో నువ్వు కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. చిన్నప్పుడు నీ వీపు మీద ఎక్కి ‘స్పీడ్‌ స్పీడ్‌’ అని పసి గుద్దులు గుద్దేవాణ్ణి. ఇప్పుడు పెద్దయ్యి కడుపులో గుద్దుతాననుకున్నావా? నీ కడుపున పుట్టాను నాన్నా. నా కడుపులో పెట్టుకు చూసుకుంటాను. రావా? నా దగ్గర ఉండవా? – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top