మా ఇంట్లో భోగిపళ్లు

Special Story About Bhogi Festival Celebrations - Sakshi

భోగి పండగ నాడు పిల్లలకు భోగి పండ్లు (రేగి పండ్లు) పోస్తారు. పిల్లలకు దిష్టి దోషం పోవడానికి తెలుగువారు పాటించే ఆచారమిది. అయితే అప్పట్లోనూ, ఇప్పట్లోనూ ఈ ఆచారం ఒకేలా ఉందా? ఓ జ్ఞాపకం

చిన్నప్పటినుంచి భోగి అంటే ఎందుకో మహా ఇష్టం. పొద్దున్నే వెచ్చగా భోగిమంటలు వేసుకోవడం, ఆ మంటల్లో వేయడానికి పాత విరిగిపోయిన కిటికీ తలుపులు, మంచం కోళ్లు, నూనెతో తడిపిన పాత బట్టలు తీసుకువెళ్లేవాళ్లం. మంచి చలిలో, తెల్లారని ఆ చీకటిలో ఎర్రటి మంట లేచి వెచ్చదనం ఇస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది. మా ఇరుగుపొరుగు కొందరు భోగిమంటల్లో తేగలు కాల్చుకుని తినేవారు. మేం మాత్రం అది అయ్యాక శుభ్రంగా నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్తబట్టలేసుకుని, దేవుడికి దణ్ణం పెట్టుకుని మామ్మ చేసిన వేడివేడి కొత్తబియ్యం పొంగలిలో ఆరారగా ఆవునెయ్యి వేసుకుని బాదం ఆకుల్లో పెట్టుకుని ఉప్ఫు.. ఉఫ్పు.. అంటూ ఊదుకుంటూ తినేవాళ్లం.

సాయంత్రం అయ్యేసరికి మా ముగ్గురికీ భోగిపళ్లు పోసేవారు. అందుకోసం పేరంటం పిలిచేవారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి నన్నే చెప్పుకోమనేవారు. నేను నా స్నేహితుల ఇళ్లకు వెళ్లి ‘‘మరే, సాయంత్రం నాకు భోగిపళ్లు పోస్తారు. నువ్వు తప్పకుండా రావాలి’’ అంటూ సిగ్గుపడేవాణ్ణి. మా అక్కలు కూడా వాళ్ల ఫ్రెండ్సుకు చెప్పుకునేవాళ్లు. వడ్డేశ్వరం నుంచి రకరకాల బంతిపూలు, చేమంతి పూలు మామిడి మండలు తెచ్చిపడేసేవాడు మా సీను బాబాయి. తరాలుగా మా ఇంటిలో పని చేస్తున్న శివమ్మ, సుబ్బారావు, శేషమ్మ పురికొసకు మామిడి మండలు గుచ్చి, గుమ్మాలకు తోరణాల్లా కట్టేవాళ్లు. మా తాతయ్య రెండు మానికల రేగుపళ్లు కొని పడేసేవాడు. భోగిపళ్లలో కలిపేందుకు పూల రెక్కలు, చిల్లర డబ్బులు మేం ముగ్గురం పోటీలు పడుతూ సిద్ధం చేసేవాళ్లం.

ఈ లోపు భోగి పళ్ల కోసం తెచ్చిన రేగిపళ్లను మెల్లగా గుటుకూగుటుకూ మింVó సేవాణ్ణి, గింజలు కనపడకుండా. పళ్లు పులిసిపోతాయర్రా... జాగర్త... అని పెద్దమ్మమ్మ బోసినోటిని నొక్కుకుంటూ చెప్పినా విననట్టు నటించేవాణ్ణి. రేగిపళ్ల గింజలు మింగేస్తున్నానని మా అక్కలు కనిపెట్టి నన్ను బెదిరించేవాళ్లు, అవి కడుపులోకెళ్లి చెట్లవుతాయంటూ. అయితే అప్పటికే ఒకసారి వేపపండు గింజ మింగేసి, ఇట్లాగే ఎవరో నన్ను బెదిరించటం, కడుపులో వేప చెట్టు మొలిస్తే ఆ చేదు ఎట్లా భరించాలిరా నాయనా అని నేను విపరీతంగా భయపడిపోయి, నాలో నేనే దిగులుగా ఉండటం చూసి మా నాన్న ‘‘ఓరి పిచ్చోడా... విత్తనం మొలకెత్తాలంటే గాలి, నీరు, ఎండ ఉండాలి. అది పెరగాలం టే మట్టి కావాలి కదా... నీ బొజ్జలో అవన్నీ ఉన్నాయా మరి?’’ అని అడిగి నేను భయం వదిలిపెట్టి ధైర్యంగా లేవని చెప్పాక ‘‘ఒకటి రెండు గింజలు పొరపాటున మింగినా ఏం కాదు, మర్నాడు అవే బయటికి వచ్చేస్తాయి’’ అని ఏకంగా అప్పుడే నాకు సైన్స్‌ పాఠం చెప్పేసి ఉండటం వల్ల నేను లెక్క చేయలేదసలు.

సాయంత్రం కాగానే ముఖం కాళ్లూ చేతులూ కడిగి మమ్మల్ని ముగ్గురినీ కుర్చీల్లో కూచోబెట్టేవాళ్లు. హారతి పళ్లెం, అక్షింతలు సిద్ధంగా ఉండేవి. పేరంటాళ్లు మెల్లగా వస్తుండేవాళ్లు. వరండా సగం నిండిందనిపించగానే మా సాంబక్కాయమ్మమ్మ మా అమ్మని, మామ్మని ‘‘ఇంకా చూస్తారేం, భోగిపళ్ల బేసిను తీసుకురండి’’ అంటూ గాఠిగా ఓ కేక పెట్టేది. మామ్మ అమ్మ చేతికి రేగుపళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర డబ్బులు వేసి కలిపి ఉంచిన బేసినిచ్చేది. అమ్మ అది తీసుకుని వచ్చేది. ముందు మామ్మ, తాతయ్య, అమ్మ, ప్రభాతత్త మూడేసి సార్లు మా ముగ్గురికీ భోగి పళ్లు పోసేవాళ్లు. మా సాంబక్కాయమ్మమ్మ, బాబాయిలు అందరూ పోసిన తర్వాత పేరంటాళ్ల వంతొచ్చేది. ఎదురింటి శారదాంబ, మా బుల్లిమామ్మ, కిష్టారావు పంతులు పెళ్లాం, ఇంకొందరు వచ్చి భోగిపళ్లు పోసి చేతిలో రెండేసో ఐదేసో రూపాయలు పెట్టేవాళ్లు. అప్పట్లో అవే గొప్ప.

వాళ్లు అట్లా భోగి పళ్లు పోసేటప్పుడు మా నాన్న తన పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ కెమెరాతో ఫొటోలు తీసేవాడు. తల మీది నుంచి ముఖం మీదికి జారుతున్న పూల రెక్క లను తుడుచుకుంటున్నట్టుగా నేను మెల్లగా చిల్లర డబ్బులని చేతికి చిక్కించుకుని చొక్కా జేబులోకి తోసేవాణ్ణి. అందరూ భోగి పళ్లు పోసిన తర్వాత హారతులిచ్చేవాళ్లు. ‘పిల్లలకి హారతిచ్చేది కర్పూరంతో కాదమ్మా, నూనెతో తడిపిన ఒత్తులతో ఇవ్వాలి’ అనేది మామ్మ. పేరంటం అయిపోయి అందరూ ఇళ్లకు వెళ్లేటప్పుడు నానబెట్టిన సెనగలు, పండు, తాంబూలం, రేగు పళ్లు కవర్లలో పోసి ఇచ్చేది ప్రభాతత్త. అంతా అయిపోయాక శేషమ్మ చేత దిష్టి తీయించేది సాంబక్కాయమ్మమ్మ. ఆ పళ్లు, పూలు, చిల్లర డబ్బులు కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా పోగు చేసి మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది శేషమ్మ.

ఇవన్నీ దాదాపు ముప్ఫై నలభై ఏళ్ల క్రితం సంగతులు. ఇప్పుడు నేను మా పిల్లలకు భోగి పళ్లు పోయాలంటే అర కిలోనో కిలోనో రేగి పళ్లు కొనాలంటే గుండె గుభేలుమంటుంది. హైదరాబాదులో ఉండే మాకు మామూలు రోజుల్లోనే పావు కిలో ముప్ఫై నలభైకి అమ్మేవాళ్లు, భోగికి రెండు మూడు రోజుల ముందు నుంచే కేజీ రెండు మూడొందలు పైనే పెట్టాలి. అవీ అంత నాణ్యంగా ఏమీ ఉండవు. అయినా తినేవేం కాదు, తలమీది నుంచి పోసేవే కదా అని సరిపెట్టుకోవటమే. ఇక తమలపాకులు, వక్కలు, అరటిపళ్లు, చిల్లర పైసలు మామూలే. పేరంటానికి పిలవాలంటే ఇంట్లో వాళ్లంతో కలిపి పట్టుమని పదిమంది కూడా కారు. అయినా వాళ్లతోనే  ‘‘మన ఇంటి ఆచారం’’ అంటూ సంక్రాంతి రోజున అమ్మ మా చేత భోగి పళ్లు పోయిస్తుంది. చిల్లర పైసలంటే రూపాయి, రెండు రూపాయల బిళ్లలే తప్ప పావలాలూ, అర్ధ రూపాయిలూ ఎక్కడ, అవి కనిపించడం మానేసి చాలారోజులే అయిందిగా... పూలు, పళ్లు ఎత్తుకుని తీసుకువెళ్లే వాళ్లెవరున్నారు, అన్నిటినీ మా ఆవిడే ఎత్తి డస్ట్‌బిన్‌లో పోయకూడదంటే చెట్లల్లో పోసి వస్తుంటుంది. ఏం చేస్తాం అంతా పట్నవాసం కదా మరి! – బాచి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top