ఆర్తి హిట్‌ టాక్‌

Special Story About Aarti From Uttar Pradesh In Family - Sakshi

కాలం సాఫీగా సాగనప్పుడు కష్టానికి అలవాటుపడడం కాదు... దానికి ఎదురొడ్డి నిలిచే సామర్థ్యాన్ని అలవరచుకోవాలి. కొండంత అండ లేకున్నా, గోరంత ఆశ, ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉండి ఆర్తిగా పని చేస్తే చాలు... కాదు... కాదు... ఆర్తి లా పని చేయాలి. అప్పుడు కష్టాల యమునను కూడా గుండెబలంతో దాటవచ్చు.

ఆర్తి ఉంటున్న ఊరు ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ. తన ఇద్దరు తోబుట్టువుల్లో ఒకరైన జ్యోతితో కలిసి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేది నెలకు ఎనిమిదివేల రూపాయల జీతంతో. ఆమె ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆ జీతాన్ని పదివేల రూపాయలకు పెంచారో లేదో లాక్‌డౌన్‌ మొదలైంది. దాంతో కొన్ని వారాలపాటు నిత్యావసర సరుకులు అందించిన ఫ్యాక్టరీ యాజమాన్యం, ఆ తర్వాత ‘మేమివ్వలేం’ అంటూ చేతులెత్తేసింది. చేసేదేమీ లేక పొదుపు చేసి దాచుకున్న డబ్బుతో జీవనం సాగిస్తూనే, ఖాళీగా కూర్చోకుండా కొత్త ఉపాధిని వెదుక్కుంది ఆర్తి. అది టిక్‌ టాక్‌ రూపంలో. హిందీ సినిమా డైలాగులు, పాటలతో ఆర్తి చేస్తున్న టిక్‌టాక్‌ వీడియోలకు బాగానే వ్యూయర్‌షిప్‌ వచ్చింది. చూస్తుండగానే టిక్‌టాక్‌లో పాపులర్‌ అయిపోయి ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అనే టైటిల్‌నూ సొంతం చేసుకుంది.

ఇది ఆమె వర్తమానం కాగా, విషాదమైన గతమూ ఉంది ఆమెకు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లితో కలిసి ఇళ్లల్లో పనిచేస్తూ అమ్మ బాధ్యతను పంచుకుంది. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టింది తల్లి. అయితే, బాబు పుట్టగానే ఆ మగానుభావుడు కాస్తా ఆమెని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. చంటిబిడ్డతో మళ్లీ పుట్టిల్లు చేరింది ఆమె. కొడుకు చుట్టూతా ప్రపంచాన్ని అల్లుకొని బతుకుతూండగా క్యాన్సర్‌తో చనిపోయాడు వాడు. ఈ కష్టంతో బిడ్డ కుంగిపోతుందేమోని భయపడింది ఆర్తి తల్లి. కాని తల్లికే ధైర్యం చెప్పి ఆమెకే పెద్దదిక్కు అయ్యింది ఆర్తి.

అంతా సర్దుకొని ఒక గాడిన పడుతున్న సమయంలో తల్లి కన్నుమూసింది. అమ్మ పంచి ఇచ్చిన రక్తసంబంధం, దాంపత్య బంధం మిగిల్చిన విషాదం తప్ప మరేమీ లేదామెకు. అయినా బెదిరిపోలేదు. ఇద్దరు చెల్లెళ్లకు అండగా నిలబడింది. షామ్లీ వచ్చి ఓ చెంచాల ఫ్యాక్టరీలో ఉద్యోగం వెదుక్కుంది. తనతో పాటు పెద్ద చెల్లినీ పనికి తీసుకెళ్లసాగింది. ‘కాస్త కుదుట పడ్డాం’ అని అనుకుందో లేదో కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌. ఈసారీ భయపడలేదు. చిరునవ్వుతో ఈ కష్టాన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడింది ఇలా.  ‘లాక్‌డౌన్‌ అయిపోయే వరకు టిక్‌టాక్‌లు చేస్తా. ఫ్యాక్టరీ తెరిస్తే వెళ్తాం. లేదంటే ఇంకో పని వెదుక్కుంటాం.  దొరికితే ఇక్కడే... దొరక్కపోతే దేశంలో ఇంకెక్కడైనా’ అంటుంది ఆర్తి ఆత్మవిశ్వాసంతో. 

యమునను ఈదింది
లాక్‌డైన్‌ కంటే ముందు హర్యానా, పానిపట్‌లోని తన బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం ఉంటే ఇద్దరు చెల్లెళ్లతో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రెండో రోజే లాక్‌డౌన్‌ ప్రకటించింది ప్రభుత్వం. తిరుగు ప్రయాణానికి బస్సులు, రైళ్లు ఏమీ లేవు. బం«ధువుల వ్యక్తి ఒకతను మోటర్‌ సైకిల్‌ మీద ఉత్తరప్రదేశ్‌ బార్డర్‌ దాకా తీసుకొచ్చాడు. అక్కడి నుంచీ ముందుకు కదలడానికి లేక మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. మూడోసారి ఎలాగైనా సరే షామ్లీకి వెళ్లడానికే మొండిపట్టుతో ఉంది ఆర్తి. తమ ఊరు చేరాలంటే ముందున్న యముననుlదాటాలి ముందు. వాడేసిన టైర్లు మూడు తీసుకొని యమునలోకి అడుగుపెట్టారు అక్కాచెల్లెళ్లు. ఉదయం అయిదు గంటలకు ఈ ఒడ్డున దిగితే అవతలి ఒడ్డుకు చేరేసరికి తొమ్మిదైంది. మళ్లీ అక్కడి నుంచి రెండు రోజులు నడిచి షామ్లీలోని తమ ఇల్లు చేరారు. ‘బతుకంటేనే సాహసం.. తప్పదు. లేకపోతే ఉన్నచోటే ఉండిపోతాం’ అంటుంది అదే ఆత్మవిశ్వాసంతో ఆర్తి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top