అంత ఫాలోయింగ్‌ ఒక్క రాత్రిలో పోయింది

Special Interview With Vizag Tiktok Star Bhargav For Ban Of Tiktok - Sakshi

వైజాగ్‌ టిక్‌టాక్‌ స్టార్‌ భార్గవ్‌

టిక్‌టాక్‌ బ్యాన్‌ ఠాప్‌ఠాప్‌మని తాకింది. ఎటువాళ్లు అటు కుదేలయ్యారు. నెక్స్ట్ ఏంటి అనే రంధిలో పడ్డారు. వైజాగ్‌ టిక్‌టాక్‌ స్టార్‌ భార్గవ్‌కు 85 లక్షల మంది ఫాలోయెర్స్‌. ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. అతనేం అంటున్నాడు? అతని మాటల్లోనే....

‘టిక్‌టాక్‌ బ్యాన్‌ చేస్తున్న సంగతి మాకు ఒక్క వారం రోజులు ముందుగా చెప్పినా మానసికంగా సిద్ధంగా ఉండేవాళ్లం. ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుక్కునేవాళ్లం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఒక కంపెనీ మూసేస్తుంటే నెల రోజులు ముందుగా ఉద్యోగులకు తెలియపరుస్తారు.  మాకు అటువంటి అవకాశం ఇవ్వలేదు. నేను, నా కుటుంబం, నన్ను నమ్ముకున్న నా టీమ్‌... అంతా వీధిన పడ్డాం. టిక్‌టాక్‌ ద్వారానే అంతర్జాతీయంగా పేరు సంపా దించుకున్నాను. పెద్దగా చదువుకోని నేను రోడ్డు మీద అనాథలా ఉన్న స్థితి నుంచి కారు కొనుక్కునే స్థితికి ఎదిగాను. ఇప్పుడు మళ్లీ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది.’

డిప్రెషన్‌లోకి...
‘హఠాత్తుగా టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేశారనే వార్త వినేసరికి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. మా ఫ్రెండ్స్‌ అకౌంట్లలో కూడా టిక్‌టాక్‌ కనిపించట్లేదు. యాప్‌ స్టోర్‌లో నుంచి ఇన్‌స్టాల్‌ చేయలేం అన్నారే కానీ, ఉన్న అకౌంట్లు కూడా పోతాయనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేసి డబ్బు సంపాదించుకోవాలో అర్థం కావట్లేదు. సరదాగా మాట్లాడటం, సమాజంలోని సమస్యల మీద స్పందించటం నాకు దేవుడు ఇచ్చిన వరం. ఆ వరంతోనే ఈ స్థితికి ఎదిగాను. టిక్‌టాక్‌ ద్వారానే రెండు సంవత్సరాలుగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఒక టీమ్‌ కూడా ఏర్పాటుచేసుకున్నాను.  చాలామంది టిక్‌టాక్‌ అంటే ఫన్నీగా చేసుకునే యాప్‌ అనుకుంటారు. కాని నేను చాలా సామాజిక సమస్యల మీద వీడియోలు చేశాను. అది నా బాధ్యతగా భావించాను. నాలాంటి క్రియేటివ్‌ ఆర్టిస్టులకి వేరే పని చేయటం కూడా చేత కాదు. ఒకప్పుడు నేను చాలామందికి ధైర్యం చెప్పి నా టీమ్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు వాళ్లే నన్ను డిప్రెషన్‌లో నుంచి బయటకు తీసుకువస్తున్నారు. వాళ్ల నుంచి బలం తెచ్చుకుంటున్నాను.’
ఎగతాళి చేశారు..
‘టిక్‌టాక్‌ పని అయిపోయింది, ఇంక హైదరాబాద్‌ వెళ్లి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకో అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇప్పటికే నేను కరోనా ప్రమోషన్‌ వీడియోల కోసం కొంత అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాను. నా చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. ఆఖరి అయిదు వందలు ఖర్చయిపోయిన సమయంలోనే టిక్‌టాక్‌ బ్యాన్‌ గురించిన వార్త నా నెత్తి మీద పిడుగులా పడింది. అమ్మ ఫోన్‌ చేసి అద్దె కట్టాలని చెప్పింది. టిక్‌టాక్‌ వాళ్లు ఫోన్‌ చేసి, హలో అన్నా! జీవితాల మీద దెబ్బ కొట్టారు, ఇక మన పని అయిపోయింది అని బాధ పడ్డారు. నేనూ భారతీయుడినే. నాకు కూడా దేశభక్తి ఉంది. టిక్‌టాక్‌ అనేది ఒక ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకోవాలని చేతిలో డబ్బు ఉన్నప్పుడు దాచుకోవాలే కాని ఖర్చు చేయకూడదని తెలుసుకున్నాను. నాలాంటి వారంతా ఉన్న పేరుని పోగొట్టుకోకుండా కొత్త ప్లాట్‌పారమ్‌ వెతుక్కుని మళ్లీ ప్రయత్నించి మరో నెలలో మళ్లీ అందరికీ చేరువవుతామనే ఆశతో ఉన్నాను.’ – సంభాషణ: వైజయంతి పురాణపండ
మేమంతా టిక్‌ టాక్‌ ద్వారా సెలబ్రిటీ స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఇది మూత పడింది. ఎవ్వరూ దిగులుపడకుండా మన భారతీయ ఆప్‌ ద్వారా మళ్లీ అందరికీ చేరువ అవుతామని ఆశిస్తున్నాను.
– ఓ మై గాడ్‌ నిత్య, టిక్‌ టాక్‌ ఆర్టిస్టు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top