వడ బండి

Special food vada  - Sakshi

అంతా గడబిడగా ఉంది... మబ్బు జాడ తెలియకుంది. వడగాడ్పుల దాడి ఉంది.మరి విరుగుడు? మూడ్‌ పాడు చేసుకోకండి... బాండిలి వేడి చేయండి.వడ కాల్చితే వాన వస్తుంది... రుచి తాకితే మబ్బు కమ్ముతుంది. లొట్టలే మెరుపులు. తేన్పులే ఉరుములు.

మిరియం వడ
కావలసినవి:  పొట్టు మినప్పప్పు – పావు కిలో; చాయమినప్పప్పు – పావు కిలో; మిరియాలు – అర టేబుల్‌ స్పూను; ఇంగువ – చిటికెడు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత

తయారీ:∙పొట్టు మినప్పప్పు, చాయ మినప్పప్పుల్ని విడివిడిగా నానబెట్టి, నీరు వడ కట్టేయాలి. ∙ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పిండి గట్టిగా వచ్చేలా మిక్సీ పట్టాలి. ∙ఈ పిండిలో విడిగా ఉన్న మినప్పప్పు, మిరియాల పొడి (కచ్చాపచ్చాగా దంచాలి) వేసి బాగా కలపాలి. ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తుకుత్తుకోవాలి. అలా ఒత్తినవాటిని నూనెలో వేసి దోరగా వేయించాలి. ∙ఇవి కరకరలాడుతూ నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.

అలసంద పాలక్‌ వడలు

కావాల్సినవి: అలసందలు – ఒకటిన్నర కప్పులు; పాల కూర తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత
తయారీ: ∙అల్సందులకు తగినన్ని నీళ్లు జత చేసి సుమారు 8 గంటలపాటు నానబెట్టి నీరు ఒంపేయాలి. ∙కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ∙వెడల్పాటి పాత్రలో అల్సందుల పిండి, పాలకూర తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీద తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ∙బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేసి వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

బ్రెడ్‌  వడ
కావలసినవి: బ్రెడ్‌ స్లయిసెస్‌ – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; మిరియాల పొడి – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – కొద్దిగా; పెరుగు – పావు కప్పు; బియ్యప్పిండి – 3 టేబుల్‌ స్పూన్లు; బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ∙బ్రెడ్‌ స్లయిసెస్‌ను చిన్న చిన్న ముక్కలు చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడిలా వచ్చేలా చేయాలి. ∙ఒక పాత్రలో బ్రెడ్‌ పొడి, ఉల్లి తరుగు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి మెత్తగా చేయాలి. మిరియాల పొడి, జీలకర్ర, ఇంగువ కూడా జత చేయాలి. ∙బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, తాజా పెరుగు, ఉప్పు జత చేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు జత చేయాలి. ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వడల మాదిరిగా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.

రైస్‌  వడలు
కావలసినవి:  వెల్లుల్లి – 4 రెబ్బలు; అల్లం ముక్క – చిన్నది; పంచదార – 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; సోయా సాస్‌ – 2 టీ స్పూన్లు; చిల్లీ సాస్‌ – ఒక టీ స్పూను; వెనిగర్‌ – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – గుప్పెడు; అన్నం – 2 కప్పులు (అన్నాన్ని ఫోర్క్‌తో చిదమాలి); పల్లీ పప్పుల ముక్కలు – ముప్పావుకప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత
తయారీ: ∙అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పంచదార, పచ్చి మిర్చి తరుగులను మిక్సీలో వేసి మెత్తగా పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, కొత్తిమీర జత చేయాలి. ∙ఈ మిశ్రమానికి చిదిమిన అన్నం జత చేసి బాగా కలపాలి. ∙చేతులకి కొద్దిగా నూనె పూసుకుని అన్నం మిశ్రమాన్ని వడల మాదిరిగా ఒత్తాలి. ∙బాణలిలో నూనె కాగాక, ఒత్తుకున్న ఒక్కో వడను పల్లీల పొడిలో దొర్లించి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టిష్యూ మీదకు తీసుకోవాలి.

సొరకాయ సెనగల వడలు
కావలసినవి:  సొరకాయ  – 1 (చిన్నది); నానబెట్టిన సెనగలు – 200 గ్రా; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – టేబుల్‌ స్పూను; పచ్చిమిర్చి తురుము – 2 టీ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూను; నూనె – వేయించడానికి సరిపడా; ఉప్పు – తగినంత; 
తయారీ: సొరకాయ తొక్కు తీసి సన్నగా తురమాలి. నానబెట్టిన సెనగలకు ఉప్పు జోడించి మెత్తగా రుబ్బాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లి పాయ, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, జీలకర్ర, సొరకాయ తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. బాణలిలో నూన పోసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసి వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

రాగి మసాలా వడలు

కావలసినవి:  రాగి పిండి – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; ఉల్లి తరుగు – 4 స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; పుదీనా – ఒక కట్ట; ధనియాల పొడి – 2 చెంచాలు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; నూనె – తగినంత
తయారీ: ఒక గిన్నె తీసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలన్నీ (నూనె మినహా) వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె కాగాక పిండిని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.రుచితో పాటు ఆరోగ్యం కూడా.

సాబుదానా దహీ వడ
కావలసినవి:  పెరుగు – 2 కప్పులు; సగ్గు బియ్యం – కప్పు; బియ్యప్పిండి – కప్పు; పసుపు – టీ స్పూను; ఉల్లిపాయలు – రెండు; కొత్తిమీర – ఒక కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – చిటికెడు; నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత

తయారీ 
∙సగ్గుబియ్యాన్ని పెరుగులో రెండు గంటలపాటు నానబెట్టాలి. 
∙బియ్యప్పిండిని నానబెట్టిన సగ్గుబియ్యానికి జత చేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి. 
∙ఈ మిశ్రమంలో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. 
∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌. familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. 
మా చిరునామా: సాక్షి వంటలు,   సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హైదరాబాద్‌–34.  

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top