గూఢచారి రిటర్న్స్‌

special  chit chat with hero mahesh babu - Sakshi

గూఢచారి 116...
మన గుండెల్లో కట్టిన గూడు ఎప్పటికీ చెదరదు.
ఆ గూటి నుంచే మళ్లీ గూఢచారి వచ్చాడు
ది స్పై ఈజ్‌ బ్యాక్‌...
విత్‌ న్యూ స్పైస్‌!
గూఢచారి రిటర్న్స్‌తో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ మీకోసం..
ఎంజాయ్‌ సండే.

చెన్నైలో పుట్టి, అక్కడే చదువుకున్నారు. హీరో అయిన 17 ఏళ్లకు తమిళంలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
యాక్చువల్లీ మురుగదాస్‌తో సినిమా అనుకున్నప్పుడే తెలుగు, తమిళ భాషల్లో చేయాలనుకున్నాం. ఎందుకంటే ఈ కథకు బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. రెండు భాషల్లో చేస్తే కవర్‌ అవుతుంది కదా. తమిళ్‌ నాకు బాగా వచ్చు. అందుకని ఈజీ అవుతుందనుకున్నా. అయితే రెండు భాషల్లో సినిమా ఈజీ కాదని అర్థమైంది (నవ్వుతూ).

బిగ్‌ బడ్జెట్‌ మూవీస్‌ని ఎక్కువ భాషల్లో తీస్తేనే సేఫ్‌ కదా?
అవును. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి భారీ సినిమా ప్లాన్‌ చేసినప్పుడు ఎక్కువ భాషల్లోనే రిలీజ్‌ చేయాలి. అప్పుడే సేఫ్‌ కాగలుగుతాం. ఆ సినిమా అన్ని లాంగ్వేజెస్‌లోనూ బిగ్గెస్ట్‌ హిట్‌. ‘స్పైడర్‌’ బడ్జెట్‌ ఎక్కువ కాబట్టి, రెండు భాషల్లో తీస్తే సేఫ్‌ అనుకున్నాం. అయితే కథ రెండు  భాషలకు తగ్గట్టుగా లేకపోతే కష్టం. అందుకే మురుగదాస్‌ ఇటు తెలుగు అటు తమిళ్‌కి తగ్గట్టుగా క£ý  రాశారు.

చెన్నైలో పెరిగారు కాబట్టి, హీరో అవ్వాలనుకున్నప్పుడు తమిళ సినిమాతో పరిచయమవ్వాలనుకోలేదా?
నాన్నగారు తెలుగులో పెద్ద హీరో. అందుకని, తెలుగు సినిమా నాకు ప్రయార్టీ అయింది. ఇక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టాక తమిళ్‌ గురించి ఆలోచించే తీరిక లేకుండాపోయింది. ఒకట్రెండు సార్లు అనుకున్నా అవి కుదరలేదు. మురుగదాస్‌గారితో సినిమా చేయాలని ‘పోకిరి’ టైమ్‌లో అనుకున్నా. ఫైనల్లీ ‘స్పైడర్‌’తో కుదిరింది. నా డ్రీమ్‌ కాంబినేషన్‌ నిజమైంది. వెరీ వెరీ హ్యాపీ.

తమిళ హీరో కార్తీ ఇంకా అక్కడ కొంతమంది ఆర్టిస్టులు మీ క్లాస్‌మేట్స్‌ అట.. ఏ స్కూల్, కాలేజీలో చదువుకున్నారు?
సెయింట్‌ బెడెస్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాను. కార్తీ నా క్లాస్‌మెట్‌. యువన్‌శంకర్‌ రాజా (సంగీత దర్శకుడు) కూడా మా క్లాసే. సూర్య కూడా ఆ స్కూల్‌ స్టూడెంటే. ఇంకా విజయ్‌ (తమిళ హీరో) నాకు మంచి ఫ్రెండ్‌. లయోలా కాలేజీలో చదువుకున్నాను. మేమంతా కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేవాళ్లం.

విజయ్‌తో మీరో సినిమా చేయాల్సింది కదా?
విజయ్, నాతో మణిరత్నంగారు ఓ మూవీ తీయాలనుకున్నారు.  ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవలను బేస్‌ చేసుకుని ఆ మూవీ ప్లాన్‌ చేశారు. అనుకోకుండా ఆగింది. విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే చేస్తా. అయితే ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉండాలి. ఆ తరహా మల్టీస్టారర్‌ మూవీస్‌కి నేను రెడీ.

హిందీ సినిమాలకు కూడా మీకు అవకాశం వచ్చింది. బహుశా ఆ లాంగ్వేజ్‌లో మీరు ఫ్లూయెంట్‌ కాదు కాబట్టి ఒప్పుకోలేదా?
నేనెప్పుడూ హిందీ మాట్లాడటం ఇక్కడివాళ్లు చూడలేదు కాబట్టి, హిందీ రాదనుకుంటున్నారేమో. హిందీ బాగా మాట్లాడతాను. అయితే, తెలుగులో చేతి నిండా పని ఉన్నప్పుడు అక్కడికెందుకు వెళ్లడం అని నా ఫీలింగ్‌. బాగా ఎగ్జయిట్‌ చేసే ప్రాజెక్ట్‌ వస్తే అప్పుడు ఆలోచిస్తా.

‘స్పైడర్‌’లో స్పై జేమ్స్‌ బాండ్‌ స్టైల్‌లో ఉంటాడా?
జేమ్స్‌బాండ్‌ స్టైల్‌ ఆఫ్‌ ‘స్పై’ కాదు. వేరే టైప్‌లో ఉంటుంది. బట్, అందరూ ఎంజాయ్‌ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది. ఇంటిలిజెన్స్‌ బ్యూరోలో చేసే ఆఫీసర్, స్పై యాక్టివిటీస్‌... నుంచే కథ నడుస్తుంది. టోటల్‌గా జేమ్స్‌ బాండ్‌ స్టైల్‌ ఆఫ్‌ సినిమా కాదు. మన నేటివిటీకి దగ్గరగా, ప్రేక్షకులకు దగ్గరగా, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న అంశాలకు దగ్గరగా ఉండే ఒక యాక్షన్‌ ఫిల్మ్‌.

కృష్ణగారు చేసిన ‘గూఢచారి 116’ ఎవర్‌గ్రీన్‌. మిమ్మల్ని గూఢచారిగా చూడటం ఆయనకు ఆనందం కలిగించే విషయం.
(నవ్వుతూ). అవును. మురుగదాస్‌లాంటి డైరెక్టర్‌తో సినిమా చేయడం ఆయనకు ఒక ఆనందం అయితే.. నేను తమిళ సినిమా చేయాలనే ఆయన కల నెరవేరడం మరో ఆనందం. నేను స్పైగా కనిపించనుండటం నాన్నగారిని  థ్రిల్‌కి గురి చేసే విషయం.

చిన్నపిల్లలకు నచ్చే క్యారెక్టర్స్‌లో ‘స్పైడర్‌ మేన్‌’ ఒకటి. మీరు ‘స్పైడర్‌’ టైటిల్‌తో సినిమా చేయడం మీ పిల్లలు గౌతమ్, సితారలకు బాగా నచ్చి ఉంటుందేమో...
వాళ్లు నా ప్రతి సినిమాకీ థ్రిల్‌ అవుతారు. సితార ‘బూమ్‌... బూమ్‌...’ పాటను హుషారుగా పాడేస్తోంది. మీరన్నట్లు ‘స్పైడర్‌’ టైటిల్‌ కాబట్టి, ఈ సినిమాకి చాలా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నారు.

పిల్లలు చదువుకోకపోయినా ఏమీ అనరని, మీరు  ఫ్రెండ్లీ డాడ్‌ అని,  ఆ మధ్య నమ్రతగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు...
కరెక్టే. నాకు దొరికేదే తక్కువ టైమ్‌. ఆ టైమ్‌లో ఏం చదువుతున్నారు? అంటూ పుస్తకాలన్నీ తిరగేస్తే ఇక పిల్లలతో నేనెప్పుడు ఆడుకోవాలి? అందుకే ఫ్రీ టైమ్‌ మొత్తం వాళ్లతో ఆడుకుంటా. చదువు గురించి పట్టించుకోవడానికి ఎలాగూ నమ్రత ఉంది కదా. తను మంచి హోమ్‌ మేకర్‌. షూటింగ్‌ వల్ల నాకు ఎక్కువ స్ట్రెస్‌ ఉంటుంది. పిల్లలే నా ‘స్ట్రెస్‌ బస్టర్స్‌’.

పిల్లలతో ఎలాంటి ఆటలు ఆడుకుంటారు?
ఇన్‌డోర్‌ అంటే వీడియో గేమ్స్‌ ఆడతాం. టీవీలో వచ్చే కార్టూన్‌ షోస్‌ చూస్తారు. వాళ్లతో పాటు నేనూ చూస్తుంటా. అందరికీ చిన్నప్పటి ఫేవరెట్‌ షోస్‌ అంటే అవే కదా. అప్పట్లో నేను, ఇప్పుడు నా పిల్లలు చూస్తున్నారు. ఫారిన్‌ ట్రిప్స్‌ వెళ్లినప్పుడు సైక్లింగ్, స్విమ్మింగ్‌.. ఇలా ఏది అనిపిస్తే అది. అక్కడ  ఫేవరెట్‌ రెస్టారెంట్స్‌కి వెళ్లి ఫుడ్‌ ఎంజాయ్‌ చేస్తాం.

‘స్పైడర్‌’ రిలీజ్‌కి ముందే ‘భరత్‌ అనే నేను’ స్టార్ట్‌ చేసేశారు. జనరల్‌గా రిలీజ్‌ తర్వాత ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌ వెళతారు కదా..
ఒక సినిమా ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయడం నాకే కొత్తగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలా చేయలేదు. ‘స్పైడర్‌’ క్లైమాక్స్‌ని చెన్నైలో రాత్రి పూర్తి చేసి, మర్నాడు ఉదయం హైదరాబాద్‌లో ‘భరత్‌ అనే నేను’ స్టార్ట్‌ చేశా. ఇంత బిజీగా పని చేయడం బాగానే ఉంది. స్ట్రెస్‌ పోవడానికి ఎలాగూ నా ‘స్ట్రెస్‌ బస్టర్స్‌’ ఉన్నారు కదా.

ఒక లాంగ్వేజ్‌లో తీసిన సీన్‌ని వెంటనే మరో లాంగ్వేజ్‌లో తీయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో?
చాలా కష్టమనిపించింది! ఫర్‌ ఎగ్జాంపుల్‌.. తెలుగులో ఒకే టేక్‌లో ఓకే అయిన సీన్‌ తమిళంలోకి వచ్చేసరికి ఐదారు టేక్స్‌ అయ్యేది. అలా ఎందుకంటే తెలుగు, తమిళ్‌కి డైలాగ్స్‌ మారతాయి. మ్యాడులేషన్‌ మారుతుంది. ఆర్టిస్టులూ మారతారు. రెండు సినిమాలకు చేసినంత పని అన్నమాట. ఒక్కోసారి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయేది. కానీ, మురుగదాస్‌గారు తన ఎనర్జీతో అందర్నీ ముందుకు నడిపించారు. అలా టీమ్‌ మొత్తాన్ని ఉత్సాహంగా ఉంచడం కేవలం గొప్ప దర్శకుల వల్లే సాధ్యమవుతుంది.

సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌తో సినిమా చేయాలనే మీ కోరిక తీరింది. మీతో సినిమా చేయాలనే రకుల్‌ కలను కూడా ఈ సినిమా నెరవేర్చింది?
(నవ్వేస్తూ). వేరే హీరోయిన్‌ అయితే బైలింగ్వల్‌ను రకుల్‌లా హ్యాండిల్‌ చేసేది కాదేమో అనిపించింది. అంత హార్డ్‌వర్క్‌ చేసింది. రకుల్‌ తమిళ్‌ని కూడా ఈజీగా అడాప్ట్‌ చేసేసుకుంది. ఎప్పుడు డేట్స్‌ అడిగినా కాదనుకుండా ఇచ్చింది. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్‌ చెప్పాలి. ఇక, నా విషయానికొస్తే.. చిన్నప్పుడు నేను ‘దళపతి, రోజా’ చూసినప్పుడు సంతోష్‌ శివన్‌గారితో ఎలాగైనా పని చేయాలని కోరుకునేవాణ్ణి. చాలాసార్లు ట్రై చేశా. ఈ సినిమాతో కుదిరింది. వెరీ వెరీ హ్యాపీ.

టిక్కెట్‌ రేటుకి రెండింతలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తే, ఆడియన్స్‌ దిల్‌ ఖుష్‌ అవుతుంది. ‘స్పైడర్‌’ అలానే ఉంటుందా?
యస్‌.. మీరు (ప్రేక్షకులు) కొన్న టిక్కెట్‌ డబ్బుల కన్నా ఎక్కువ వేల్యూ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంత స్ట్రాంగ్‌ కంటెంట్‌. అలాగే, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇన్‌ ద ‘స్పైడర్‌’ విల్‌బి థ్రిల్లింగ్‌! కథతో పాటే యాక్షన్‌ ఉంటుంది. అలా ఉంటేనే థ్రిల్‌ ఉంటుందని, అప్పుడే క్లిక్‌ అవుతుందని నా ఫీలింగ్‌. ‘స్పైడర్‌’ అనేది ఒక ఎడ్జ్‌ ఆఫ్‌ ద సీట్‌ థ్రిల్లర్‌.

ఫైనల్లీ... ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు?
కొరటాల శివతో ‘భరత్‌ అనే నేను’ చేస్తున్నా. నెక్ట్స్‌ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నా. నాకు కథ నచ్చితే చాలు.. వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటా.

చెన్నైలో ఆడియో ఫంక్షన్‌లో ‘ఈ జన్మకు తెలుగు ఫ్యాన్స్‌ చాలు’ అని, హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్‌లోనూ ఎమోషనల్‌గా మాట్లాడారు..
నేనెవరితో మాట్లాడాలన్నా అప్పటికప్పుడు నాకేం అనిపిస్తే అది మాట్లాడేస్తాను. ముందే ప్రిపేర్‌ అయి మాట్లాడే అలవాటు లేదు. ఆ రెండు ఫంక్షన్స్‌లో నేను మాట్లాడిన స్పీచ్‌ రెడీమేడ్‌ కాదు. ఆ వేదిక మీద హార్ట్‌లో ఏది ఉందో అది బయటకు వచ్చేసింది. యస్‌.. ‘ఇట్‌ కేమ్‌ ఫ్రమ్‌ మై హార్ట్‌’.

ఈ సినిమాలో రిస్కీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయట.. ముఖ్యంగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌కి చాలా కష్టపడ్డారట?
రెండువేల మంది జూనిమర్‌ ఆర్టిస్టులు, మేం ఇంపార్టెంట్‌ ఆర్టిస్టులం పాల్గొనగా ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీశాం. పీటర్‌ హెయిన్‌ ఆ ఫైట్‌ని డిజైన్‌ చేశారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఎవరో ఒకరికి దెబ్బలు తగలడం ఖాయం. జూనియర్‌ ఆర్టిస్టుల్లో చాలామంది లేడీస్‌ ఉన్నారు. వాళ్లెలా చేస్తున్నారా? అనిపించేది. హ్యాట్సాఫ్‌ టు దెమ్‌.

మహేశ్‌... వెరీ కూల్‌ - దర్శకుడు  ఏఆర్‌ మురుగదాస్‌
మహశ్‌బాబుతో సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నారు. అప్పుడే ఆయన కోసం స్టోరీ అనుకున్నారా?
‘తుపాకీ’ కథ మహేశ్‌ కోసం అనుకున్నదే. కుదరలేదు. రెండేళ్ల క్రితం ‘స్పైడర్‌’ స్టోరీ లైన్‌ అనుకున్నాను. కథ నచ్చి, మహేశ్‌తో  ఎంతో నమ్మకంతో చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా.

హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
కూల్‌గా, సీరియస్‌గా ఉంటాడు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తి. మనకు తెలియని వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. ఇతరుల ఆనందం కోసం ఏమేనా చేసే టైప్‌.

నిజజీవితంలో ఇలాంటి క్యారెక్టర్స్‌ని మీరు చూశారా?
ఒకటీ రెండు రూపాయలకే వైద్యం చేసి, ఆనందపడే డాక్టర్లను చూశాను. సామాజిక సేవతో సంతృప్తి పొందేవాళ్లను చూశా. వాళ్లల్లో ఉన్న మానవత్వం నాకు నచ్చింది. ఈ స్టోరీ రాయడానికి అదో రీజన్‌.

ఈ సినిమా ద్వారా మీరివ్వబోయే సందేశం ‘మానవత్వం’ అయ్యుంటుందనుకోవచ్చా?
అవును. ఇప్పుడంతా వేగం. ఇన్‌స్టంట్‌ కాఫీ, టూ మినిట్స్‌లో వండే న్యూడుల్స్‌. రెడీమేడ్‌ మసాలాలు. చివరికి దేవుణ్ణి కూడా వేగంగానే ప్రార్థిస్తున్నారు. రోడ్డు మీద వెళుతూ బయట నుంచే దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పక్కవాళ్ల గురించి పట్టించుకునే తీరిక కూడా ఉండడం లేదు. ఏ విషయంలో అయినా వేగంగా ఉండొచ్చు కానీ, అమ్మానాన్న, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరిక లేకుండా ఉండకూడదు. రాను రాను మానవత్వం అనేది తగ్గిపోతోంది. ఫాస్ట్‌ యుగంలో ఫాస్ట్‌గా దూసుకెళ్లాలి కానీ, మానవత్వాన్ని మరచిపోవద్దని చెబుతున్నాం.

చాలా టేక్స్‌ తీసుకున్న సీన్‌ ఏది?
ఒక ఐజీ ఆఫీసులో మహేశ్, మరో నటుడి కాంబినేషన్‌లో సీన్‌ తీశాం. అది త్వరగా కంప్లీట్‌ అవుతుందనుకున్నా. కానీ, ఆ ఆర్టిస్ట్‌ సరిగ్గా డైలాగ్‌ చెప్పకపోవడంతో ఆ ఒక్క సీన్‌కి సగం రోజు పట్టింది. అయినా మహేశ్‌బాబు చాలా ఓపికగా చేశారు.

షూటింగ్‌ డేస్‌ ఎక్కువ కావడంతో మహేశ్‌ కొంచెం చిరాకుపడ్డారనే టాక్‌ వినిపించింది?
అవేవీ నిజం కాదు. ఇంకో రెండు రోజులు షూటింగ్‌ ఉందని ఇప్పటికిప్పుడు చెప్పినా, ‘ఓకే’ అంటారు. టేక్స్‌ మీద టేక్స్‌ తీసుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లను కోప్పడితే భయపడతారని మహేశ్‌ కూల్‌గా ఉండేవారు. ఆయన ఓపిక చూసి, ఆశ్చర్యం అనిపించింది. మహేశ్‌లాంటి హీరోతో సినిమా చేయడం నాకో మంచి ఎక్స్‌పీరియన్స్‌. నాలుగైదు నెలల్లో సినిమా తీసేద్దామనుకున్నాం. కానీ, మరో నాలుగు నెలలైంది. ఆల్‌మోస్ట్‌ రెండు సినిమాలు తీసినట్లయింది. అందరూ పారితోషికం గురించి ఆలోచించకుండా ఈ సినిమా చేయడం ద్వారా నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లొచ్చు అనే ప్రేమతో చేశారు.
- డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top