సౌత్‌లో ఫస్ట్‌

South Central Railway is the first female railway station in South India - Sakshi

లేడీస్‌ స్పెషల్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  చిత్తూరులోని చంద్రగిరి రైల్వే స్టేషన్‌ను దక్షిణ  భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వేస్టేషన్‌గా  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  

తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్‌ మీదుగా పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులతో స్టేషన్‌ రద్దీగా కనిపిస్తుంటుంది. దీనికి తోడు ప్రతిరోజు సుమారు 10 ప్యాసింజర్ల ద్వారా 700 మంది ప్రయాణికులు చంద్రగిరి మీదుగా కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్‌లో ముగ్గురు స్టేషన్‌మాస్టర్లు, ముగ్గురు పాయింట్‌ ఉమెన్‌లతో పాటు ఒక టిక్కెట్‌ బుకింగ్‌ క్లార్క్‌ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ స్టేషన్‌ను పూర్తిగా మహిళా రైల్వేస్టేషన్‌గా మార్చింది. దాంతో దక్షిణ భారతంలోనే మొట్టమొదటి మహిళా స్టేషన్‌గా చంద్రగిరి స్టేషన్‌ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగినులకు ప్రత్యేక వాహనాలతో పాటు, అదనపు సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా కూడా చంద్రగిరి మహిళా రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయబోతున్నారు. పురుషులకంటై తామేమీ తక్కువ కాదని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించి, నూతన ఒరవడిని సృష్టిస్తామని ఈ స్టేషన్‌లోని మహిళా ఉద్యోగినులంతా ధీమా వ్యక్తం చెయ్యడం అభినందనీయం. 
 – భూమిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి, సాక్షి, చంద్రగిరి

సంతోషంగా ఉంది
చంద్రగిరి రైల్వేస్టేషన్లో మొట్టమొదటి మహిళా స్టేషన్‌మాస్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. టికెట్‌ బుకింగ్‌ స్టాఫ్‌ దగ్గర్నుంచి స్టేషన్‌ మాస్టర్‌ వరకు అంతా మహిళలమే విధులు నిర్వహిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా నేను రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇలా మహిళలందరితో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
– పూర్ణిమ, స్టేషన్‌మాస్టర్, చంద్రగిరి

ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు
నేటి సమాజంలో పురుషుల కంటే మహిళలే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో స్త్రీలకు మరింత ప్రోత్సాహం అందించి మా ఉన్నతికి మార్గం సుగమం చేసిన అధికారులకు ధన్యవాదాలు. పదేళ్లకు పైగా రైల్వే పాయింట్‌ ఉమన్‌గా విధులు నిర్వహిస్తున్నాను. జిల్లాలో ఎన్నో స్టేషన్లలో విధులు నిర్వహించాను. ఎక్కడ చూసినా మహిళలంటే కొంత చిన్నచూపు కనిపించేది. మాలోని ప్రతిభను గుర్తించి, మాకంటూ ఓ రైల్వేస్టేషన్‌ను  ప్రకటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. 
–  శ్యామల, పాయింట్‌ ఉమన్, చంద్రగిరి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top