పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి | Sakshi
Sakshi News home page

పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి

Published Tue, Dec 30 2014 11:13 PM

పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి

మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే... పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని ‘హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి’ అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు! ఈ పరిస్థితుల్లో పెద్దతరానికి ఊరటనిచ్చేలా యువతరాన్ని మలిచేవారెవరు?
 
కాల యవనిక మరోసారి జారింది. మరుక్షణం లేవడానికే కదా! కాలంతో పాటు పరుగెట్టలేని ఎందరెందరో మధ్యలోనే రాలిపోతుంటారు. జీవితం ఎంతో విసుగ్గా తాపీగా సాగుతుందన్నప్పుడూ, కష్టాలు మనిషిని కుంగ తీస్తున్నప్పుడు- ‘అయ్యో ఈ రోజులు త్వరగా ఎందుకు కదలవు’ అనుకున్నప్పుడు ఇనుపగుళ్లు కాళ్లకి కట్టుకున్నట్టు అడుగేయదు కాలం. అదే హాయిగా ఉన్నప్పుడెందుకలా పరుగులు తీస్తుందో నాకర్థం కాదు.
 
పద్నాల్గు వస్తోందనుకునేలోగా ఆశ్చర్యంగా అయిపోయింది! హైద్రాబాదే ఇంతగా మారితే దేశం సంగతి ప్రపంచం సంగతి గురించి ఏం చెప్పాలి? నాకు ప్రపంచం అంతా ముసలివాళ్లతో నిండిపోయినట్టు అనిపిస్తోంది! ముసలితనంలోని ఒంటరితనం, అక్కరలేని తనం తల్చుకుంటూనే చాలామంది కృంగిపోతూ కనిపిస్తున్నారు! నిజమే వృద్ధాశ్రమాలు చాలా సౌకర్యాలతో వస్తున్నాయి. కాని ఒంటరితనం ఎందుకు బాధించాలి పెద్దవాళ్లని.

ఆశలూ, ఆశయాలూ కొడుకుల్లోనే చూసుకుని సర్వం త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. అది వారి అత్యాశకాదు... అభిమానం. ఎదురుచూపు కాదు... ఒంటరిగా ఉండం అన్న ఆశ. పిచ్చా! కాలం మారిపోయింది. పైసాలో ప్రపంచం అని ఇది వరకు అంటే నవ్వేరోజులు పోయాయి. డబ్బు, సౌకర్యాలు సుఖ జీవితాన్నిస్తాయని, పిల్లలు వాటిని గుమ్మరిస్తున్నారు. పాపం వాళ్లు మటుకు ఏం చేస్తారు? ఉద్యోగాలు, పెళ్లాల కండిషన్లు, తమ పిల్లల భవిష్యత్తు వారికీ ముఖ్యం కదా!
 
నేను హైదరాబాదు శాశ్వతంగా వచ్చేశాక ఎందుకో ఒంటరితనం పీడించలేదు! చాలా సాహితీ సంస్థలు, సమాజాలు, సమావేశాలు చాలా బాగుండేవి... కాని...? చూస్తుండగానే సీను పూర్తిగా మారిపోయింది. కారణం- సాహిత్యం చచ్చిపోలేదు. సంస్కారమూ చచ్చిపోలేదు. పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. నాకు ఈ మార్పు చాలా వింతగా అనిపిస్తుంది. నేను కాళోజీ అభిమానిని. దాశరథి నన్ను ఒదినగారు అని పిలిచేవారు. సినారే నాకు అభిమాన కవి. నా కెరీర్ ప్రారంభం నుంచీ తెలిసిన వాళ్లు వేరెలా అవుతారు. అభిమానించకుండా ఉండడం ఎలా? పి.టి.రెడ్డి వంటి చిత్రకారులతో గంటలు గడిపిన సరదాను ఎలా మరిచిపోగలను? కాలం ఇంత దారుణంగా ఎందుకు మారిపోయింది!
 
మనుషులు కాదు పట్నం కూడా పూర్తిగా మారిపోయింది. టాంక్‌బండ్ విగ్రహాల గట్టున కూర్చుని వేరుసెనగలు, మొక్కజొన్న పొత్తులూ హాయిగా తినగల్గేవాళ్లం. పక్కన గట్టు మీద కూర్చుని వేడివేడిగా వాడివాడిగా సాహిత్య చర్చలు, కొత్త కవితలు గానాలూ....ఆహా! తిరిగిరాని రోజులు! హైద్రాబాదు ఇప్పుడు ఒంటరి ద్వీపం. ఇక్కడి మేధావులు కూడా ఒంటిస్థంభాల వాసులు! ఎవరి గోల వారిదే! ఏ ఎండకాగొడుగే - ‘అదొక్కటే కొనసాగడానికి దారి’  అన్నాడో మిత్రుడు.
 
నిజమే కాలంతో పాటు ఊళ్లు కూడా పాతబడిపోతాయి. కాని అందాన్ని చెడగొట్టి లాభం ఏమిటి? అన్ని రకాలుగానూ హైదరాబాద్ అందం భయంకరంగా తయారైందని ఒక్కసారి తిరిగి చూస్తే అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా ఉట్టినే చూడడానికి ప్రయాణం చేయండి. సీటు బెల్టే కాదు- వీపుకి సపోర్టు, మెడకి కాలరు- అబ్బో అదిరేలాగా రోబోలాగా తయారవ్వాలి. ఏ రోడ్డులోనూ మీరు హాయిగా ప్రయాణం సాగించలేరు! ‘సిటీ బాగా పెరిగిపోయింది. ఇదిప్పుడు అందరూ తిరగ్గలిగినదీ బ్రతక్కలిగినదీ కాదమ్మా. బండి ఉన్నవాళ్లు, డబ్బున్నవాళ్లు- తప్పించి. వాళ్లకే రక్షణలేదు’’. ఎందుకంటే ఏమో! ఎక్కడ ఆపుతారో- ఎందుకు ఆపుతారో కూడా తెలియదు. ఇక ఆకాశమార్గాలు వస్తే- జనం సుఖంగా-! ఆగండి ఆగండి. తప్పదు అవి వచ్చేదాకా సామాన్యుడి జీవితం- అంపశయ్య!
 
‘‘ఇప్పుడు మనం మాట్లాడ కల్గిందేం లేదు. మౌనం- గొప్ప భూషణం. అర్థం చేసుకుని బ్రతకండి’’ అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు- తమని తామే హెచ్చరించుకుంటున్నారు. జీవితంలోని కలలు, ఆశలు, ఆదర్శాలు అన్నీ గుప్పిట పట్టుకుని వచ్చిన ఎంతోమంది ఎందుకో సామూహికంగా నిట్టూరుస్తున్నారు.
 
మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే- పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు. పరిస్థితులు మౌనంగా ఉండమంటున్నాయి. బ్రతికి బట్టకట్టడానికి మౌనం నేడు గొప్ప భూషణం. నా కళ్లముందు ఎన్నో దేశాల్లో ముసలితనాన్ని చూశాను. చాలా చోట్ల కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నా తృప్తిగానే బ్రతుకుతున్నారేమో అనిపించింది. మనని చూసి ‘మీరు చాలా అదృష్టవంతులు. అక్కడ పెద్దలకి గౌరవం ఉంది’ అంటే... నేను ఔనౌను అని తలూపాను గాని ఏదీ ఆ గౌరవం? ఏదీ ఆ ఆప్యాయత? కనిపించడం లేదేం? జనం, ఊళ్లు, వాతావరణం పూర్తిగా మారిపోయాయి ఎందుచేత? నాకు ఆలోచనలు సాగడం లేదు.
 
ఇప్పుడు ఆడామగా తేడా లేదు అంటారు. కాని ఆడవాళ్లంతా శరీరాల్లాగా కనిపిస్తున్నారెందుకు? మగవాళ్లంతా వేటగాళ్లలూ కనిపిస్తున్నారెందుకు? సంస్కారం అన్నదేమయిపోయింది. పిల్లల్ని చూసి కన్నవారు భయపడడం ఏమిటి? పెద్దల్ని ఈడ్చి పారేసే ఈ తరానికి జన్మనెవరిచ్చారు. అమ్మకాదే? పుట్టుక కాదే? ఎక్కడిది? సమాజం సగం చచ్చిలేదు. పూర్తిగా చచ్చి దుర్గంధం వెదజిమ్ముతోంది. సెంటు కొట్టి లాభం లేదు. దహన సంస్కారమే కొత్త నాంది అవుతుందా? ఏమో ఎలా ఈ యువతరానికి మంచి దారి చూపెట్టడం?

Advertisement
 
Advertisement
 
Advertisement