సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా !!!

Shyama Sastri is a great musician - Sakshi

వాగ్గేయకారులలో ఒకరిగా ఖ్యాతి గడించిన శ్యామశాస్త్రి గారు పచ్చిమిరియం అప్పయ్య శాస్త్రి గారనే సంగీత విద్వాంసుడి దగ్గర అభ్యాసం కొనసాగిస్తున్నారు. ఒక సదాచారం ఏమిటంటే గురువుల ముందు తాంబూల చర్వణం చేయకూడదు. కానీ శ్యామశాస్త్రి గారికి తాంబూలం బాగా అలవాటు. గురువుగారు కూడా కాదని ఏనాడూ అనలేదు. ఒకనాడు గురువుగారితో మాట్లాడుతుండగా నోటిలో ఉన్న తాంబూల ఉచ్చిష్టం గురువుగారి ఉత్తరీయం మీద పడింది. పశ్చాత్తాప భావనతో వెంటనే శ్యామశాస్త్రి గారు... ఆ ఉత్తరీయం ఇస్తే ఉతికి పట్టుకొస్తానన్నారు. దానికి గురువుగారు...‘‘నీకు సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా ? ఏ నాటికయినా నీ నోటి తాంబూలం ఈ ఉత్తరీయం మీద పడాలని...’’ అన్నారు. అమ్మవారే పురుష స్వరూపంలో పుట్టిందని భావించిన అప్పయ్య శాస్తిగ్రారు– శ్యామశాస్త్రిని ఆ పేరుతో పిలిచేవారు కారు... ‘కామాక్షీ’ అని పిలిచేవారు. ఈ శిష్యుడికి తాను సంగీతం నేర్పడం లేదు, అతనిలో అప్పటికే ఉన్న సంగీతాన్ని ప్రచోదనం చేస్తున్నానంతే – అని భావించేవారు. సౌందర్యలహరిలో శంకరులంటారు – అమ్మవారి తాంబూలం ఎవరినోట్లోకయినా వెళ్ళిందా వారు మహా కవులయి పోతారు– అని. అలాభావించినగురువుగారు పొంగిపోయారు.

తరువాత కాలంలో శ్యామశాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులయ్యారు.ఆ రోజుల్లో భూలోకం చాపచుట్టు కేశవయ్య గారని బిరుదులతో కూడిన గొప్ప సంగీత విద్వాంసుడు ఏనుగెక్కి వస్తుండేవారు. ‘నన్ను గెలవగలిగిన వాడెవడయినా ఉన్నాడా ?’ అని చాటింపు వేసుకుని వచ్చాడు. శ్యామశాస్త్రి గారితో వాదనకు రాజాస్థానంలో ఏర్పాటు చేసారు. వాదనలో మొదటివంతు శ్యామశాస్త్రి గారిది. శిరస్సు కదపకుండా తానం పలకమన్నారు. శాస్త్రరీత్యా తానం పలికేటప్పుడు శిరస్సు కదపకూడదు. వచ్చిన ఆ విద్వాంసుడు అలా చేయలేకపోయారు. తరువాతి వంతు కేశవయ్యగారిది. సింహనందనరాగంలో పాడమని సవాల్‌ విసిరారు. శ్యామశాస్త్రి అలవోకగా పాడేసారు. తరువాతి వంతు వచ్చినప్పుడు.. శరభనందన రాగంలో పాడమని ఆయన కేశవయ్యగారిని అడిగారు. శరభుడంటే సింహాన్ని చంపగలిగి, 8 కాళ్ళు కలిగి, పక్షి శిరస్సు కలిగిన ఒక స్వరూపం. ఈ రాగాన్ని శ్యామశాస్త్రి గారు అభివృద్ధి చేసారు. అందులో 19  3/4 వంతు మాత్రలు. ఒక ఆవృతిలో 79 అక్షరాలు వచ్చేటట్లుగా ఆలాపన చేయాలని సవాల్‌ విసిరారు.

ఓటమిని అంగీకరించిన కేశవయ్యగారు, శ్యామశాస్త్రి గారి ఔన్నత్యాన్ని అభినందించి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన నాయకరాజుల గౌరవాన్ని నిలబెట్టారు.శ్యామశాస్త్రి జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా. తన భార్య మరణించిన ఐదవరోజున తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన ఇచ్ఛామోక్షాన్ని పొందారు. మిగిలిన ఇద్దరూ... త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇలా ఇచ్ఛామోక్షాన్ని పొందిన వారే. త్యాగయ్యగారి కయితే బ్రహ్మకపాల మేధనం జరిగింది. ఈ ముగ్గురూ నాదోపాసన చేసిన వారే.శ్యామశాస్త్రి గారు అద్భుతమైన రెండు కీర్తనల్ని సంస్కృతంలో, తెలుగులో ఇచ్చారు. ఈ రెండూ కళ్యాణి రాగంలో ఉంటాయి. వీటిని మీరు ఏదయినా సంగీత వాద్య పరికరంమీద మోగిస్తే, ఏ కీర్తన పలికిస్తున్నారో తెలియదు. కేవలం కంఠంతో పాడితేనే ఇది ఫలానా కీర్తన అని తెలుస్తుంది. అలా ఇచ్చిన కీర్తనలో ఒకటి–‘హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరుమధ్యవాసినీ, అంబ శ్రీకామాక్షి....’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top