కూతుర్ని కనాలి

She had a relationship with her daughter - Sakshi

అమ్మ

పెళ్లయి వెళ్లిపోతే కూతురు పరాయి ఇంటి పిల్లే అని తల్లితండ్రుల ఆలోచన. కూతురుంటే పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే చాలని అనుకుంటారు. అదే కొడుకు పుడితే వంశ వృద్ధి అని, పున్నామనరకం దాటిస్తాడనీ నమ్మకం. అయితే, కూతురే కొడుకై పున్నామ నరకం దాటించడానికి ముందుకు వస్తే..! నల్లగొండకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరది. ఆ ఊళ్లో ఓ మధ్యతరగతి ఇల్లు. అలివేలమ్మ, నర్సయ్య దంపతులకు యాదగిరి, పుష్ప (పేర్లు మార్చాం) ఇద్దరు పిల్లలు. వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. కొడుకు ప్రయోజకుడవ్వాలని భర్తతో పోరి మరీ హాస్టల్‌లో పెట్టి చదివించింది అలివేలమ్మ. చదివింది చాల్లే అని పదోతరగతిలోనే కూతురుకో సంబంధం చూసి బాధ్యత తీర్చుకున్నారు. పుష్ప అత్తింటికి వెళ్లిపోయింది. కొడుకు చదువు పూర్తయ్యి, పట్టణంలోనే ఉద్యోగంలో చేరాడు. కొడుక్కి పెళ్లి చేశారు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్నారు.

వారికిద్దరు పిల్లలు.  అనారోగ్యంతో నర్సయ్య కన్నుమూశాడు. ‘ఈ ఊళ్లో ఒంటరిగా ఎందుకు, నా వద్దకు వచ్చేయ్‌’ అన్నాడు కొడుకు తల్లిని. ‘ఒంటరిగా తను మాత్రం చేసేదేముంది, అలాగే’ అంది. కొడుకు ఇంటికి వచ్చింది. కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో ఊపిరాడడం లేదామెకు. పిల్లలు పొద్దున్నే స్కూళ్లకు, కొడుకు, కోడలు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. చీకటిపడేంతవరకు టీవీతోనే తన కాలక్షేపం. ఊళ్లో పొలం, ఇల్లు అమ్మకానికి పెట్టాడు యాదగిరి. అలివేలమ్మ ఏడ్చింది. ‘నే ఊరెళ్లి పోతా’ అంది. ‘నువ్వొక్కదానివి అక్కడుంటే చూసిన వాళ్లంతా కొడుకు చచ్చాడా అనుకోరా!’ గయ్యిమన్నాడు యాదగిరి. గమ్మునుంది అలివేలమ్మ. ‘ఇల్లు, పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి కొంత చెల్లెలికి వ్వు. భర్త చనిపోయి పిల్లలతో కష్టపడుతోందిరా’ అంది. ‘పెళ్లి చేసి పంపాక ఇంకా తనకు వాటా ఇవ్వడమేంటి?’ వాదించాడు యాదగిరి. ‘నాకేమీ వద్దు అమ్మ పేరున కొంత డబ్బు బ్యాంకులో వేయ్‌’ అంది పుష్ప.

‘నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు’ అన్నాడు యాదగిరి చెల్లెలిని. గొడవలెందుకని ఊరుకుంది అలివేలమ్మ.   ఊరి మీద బెంగనో, జీవితమ్మీదే బెంగనో అలివేలమ్మ ఆరోగ్యం చెడింది. అప్పటికే రెండుసార్లు ఆసుపత్రిలో చేరింది. ‘సంపాదనంతా మందులకే సరిపోతుంది’ కోడలి సణుగులు అలివేలమ్మ చెవినపడుతున్నాయి. చూడ్డానికి వచ్చిన కూతురికి తన కష్టం చెప్పుకుంది అలివేలమ్మ. ‘అమ్మను కొన్నాళ్లు నే తీసుకెళతా!’ అంది పుష్ప. కదిలిస్తే డబ్బులు అడుగుతుందేమోనని మాట్లాడకుండా వెళ్లిపోయాడు యాదగిరి. తల్లిని తన ఇంటికి తీసుకెళ్లింది పుష్ప. ‘అన్నకు ఫోన్‌ చేయ్, వచ్చి తీసుకెళతాడు, నీకెందుకే బరువు?’ పదేళ్లుగా అలివేలమ్మ ఆ మాటను కూతురితో చెబుతూనే ఉంది. కూతురు ‘అలాగేనమ్మా!’ అంటూనే ఉంది. యాదగిరి మాత్రం ‘తనే తీసుకెళ్లింది, తననే తీసుకొచ్చి దింపమను’ అన్నాడు తల్లి గురించి ప్రస్తావన తెచ్చిన బంధువులతో.

 వృద్ధాప్యం, అనారోగ్యంతో అలివేలమ్మ మంచం పట్టింది. ‘పుష్పా నీకు అన్యాయం చేశామే. చదువుకుంటానని నువ్వు మొండికేసినా అంతకన్నా ఎక్కువ చదివినవాడిని తెవాలని భయపడి, పెళ్లి చేసి పంపించాం. ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు ఉన్న ఊరికి కూడా దూరం చేశాడు. నన్ను క్షమిస్తావా’ అంది కళ్లనీళ్లు పెట్టుకుంటూ. తల్లిని ఓదార్చింది పుష్ప.   కొడుకు చివరి రోజుల్లోనైనా తనను తీసుకెళతాడని చూసింది అలివేలమ్మ. కానీ, ఆ ఆశ తీరకుండా ఓ రోజు తెల్లవారుజామున కన్నుమూసింది. విషయం తెలిసిన యాదగిరి వచ్చాడు తల్లి శవాన్ని తీసుకెళతా అని. అన్న దగ్గరగా వేళ్లిన పుష్ప ‘ఈ పుణ్యకార్యం నేనే చేస్తా నువ్వెళ్లి రా!’ అంది స్థిరంగా. తలదించుకుని తిరుగు ముఖం పట్టాడు యాదగిరి.  
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top