నల్లపూసలు ఎందుకు ధరిస్తారు? | Sakshi
Sakshi News home page

నల్లపూసలు ఎందుకు ధరిస్తారు?

Published Sun, Jun 17 2018 1:47 AM

scientific reasons behind wearing jewellery - Sakshi

ముల్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. స్త్రీ  సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన వాటినే ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు పెద్దలు. వాటిల్లో నల్లపూసలు ఒకటి.  వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం.

ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి.

ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూవరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు.

ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది.

Advertisement
Advertisement