రత్నాల సాంబారు

Sambar Famous in Rathna Cafe Tamil nadu - Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

ఆ తండ్రీకొడుకుల్ని చూసినవారు ముచ్చటపడకుండా ఉండలేరు. హడావుడిగా ఉండే ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అందరూ అక్కడకు వచ్చేది సాంబారు కోసమే. వింతగా ఉంది కదూ. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. అక్కడకి ఇడ్లీ కోసమో, దోసె కోసమో కాదు, కేవలం సాంబారు రుచి చూడటానికే వస్తారు. అదే చెన్నై ట్రిప్లికేన్‌లోని రత్నాకేఫ్‌.

ఎంతోకాలంగా ఆ ప్రాంతానికి ఒక మైలురాయిగా నిలబడిపోయింది రత్నాకేఫ్‌. నిరంతరం ఆ కేఫ్‌ భోజన ప్రియులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గుప్తా కుటుంబీకులు 1948లో ప్రారంభించిన రత్నాకేఫ్‌ అనేక బ్రాంచీల స్థాయికి విస్తరించింది. ఈ కేఫ్‌కు వచ్చేవారంతా సాంబారు ప్రియులే. ‘మా దగ్గర సాంబారే ప్రధాన వంటకం’ అంటారు నిర్వాహకులు లోకేశ్‌ గుప్తా. ఇక్కడ చిత్రమేమిటంటే, వెయిటర్లంతా సాంబారు మగ్గులు పట్టుకుని కస్టమర్లకు వడ్డించడానికి సిద్ధంగా ఉంటారు. ప్లేటులో ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ... ఏముందో చూడరు. అన్నిటినీ సాంబారులో మునకలు వేయిస్తారు. ఇడ్లీ సాంబారు, కాఫీకి ప్రసిద్ధి రత్నా కేఫ్‌.

మధుర నుంచి మద్రాసు వరకు
మధురకు 25 కి.మీ. దూరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు చెందిన జగ్గిల గుప్తా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనే ఆశయంతో మద్రాసు వచ్చారు. అక్కడ చిన్న హోటల్‌ ప్రారంభించారు. మొదట్లో ఇడ్లీ సాంబారు, కాఫీతో ప్రారంభించారు. సాంబారు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన సరుకులను రాజస్థాన్‌ నుంచి తీసుకువచ్చి, సాంబారు రుచిగా వచ్చేలా పొడి తయారు చేసేవాడు. ఆ ఫార్ములాను చాలా రహస్యంగా ఉంచారు. ఇది కేవలం ఆ కుటుంబీకులకు, వారి దగ్గర పనిచేసే సాంబారు మాస్టర్లకు మాత్రమే తెలుసు.

ఇక్కడి సాంబారు ఇంత ఫేమస్‌ కావటానికి కారణం సాంబార్‌ స్పెషలిస్టు పెరుమాళ్‌. ఈయన ఇక్కడ 50 సంవత్సరాలపాటు పనిచేశాక, వయసు మీద పడటంతో స్వచ్ఛంగా 2013లో రిటైర్‌ అయ్యారు. పెరుమాళ్‌ స్థానంలో ఇప్పుడు కందస్వామి సాంబార్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నారు.. అని గుర్తుచేసుకుంటారు లోకేశ్‌ గుప్తా. పెరుమాళ్‌ వామనుడు. పైన ఉంచిన వస్తువులు అందుకోవటం కష్టంగా ఉండేది. అందుకే సాంబారులోకి కావలసిన వస్తువులన్నీ అందుకోవటం కోసం ఒక చిన్న బల్ల మీద నిలబడి, సాంబారు తయారు చేసేవాడని చెబుతారు లోకేశ్‌ గుప్తా.

ఇలా మొదలైంది..
రత్నాకేఫ్‌ని రాజేంద్ర గుప్తా మేనమామ అయిన త్రిలోక్‌నాథ్‌ గుప్తా (జగ్గీలాల్‌ గుప్తా కుమారుడు) 1948లో ప్రారంభించారు. ఎంతో వైభవంగా నడిచింది రత్నా కేఫ్‌. 2002లో ఈ హోటల్‌ని రాజేంద్ర గుప్తా నడపటం ప్రారంభించారు. వీరు శాంతి విహార్, ప్యాలెస్‌ కఫ్, అంబాల్‌ కేఫ్‌లను కొని ప్రారంభించినా, రత్నా కేఫ్‌ మాత్రమే నేటికీ రత్నంలా మెరుస్తూ ఉంది. ఇక్కడకు ఎక్కువమంది బ్యాచిలర్స్‌ వస్తుంటారు.

సాంబారు వెనుక రహస్యం
సాంబారులో ఉపయోగించే దినుసులలో ఈ డెబ్బయ్యేళ్లుగా ఎటువంటి మార్పు లేదు. అదే వారి విజయ రహస్యం అంటారు నిర్వాహకులు. సాంబారు రుచి చూసినవారంతా, ‘ఇన్ని సంవత్సరాలుగా సాంబారు రుచిలో ఏ మాత్రం మార్పు లేదు. అదే రుచిని కొనసాగిస్తున్నారు ’ అని చెబుతారు లోకేశ్‌ గుప్తా. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడమని చెబుతారు లోకేశ్‌. సాంబారులోకి కావలసిన వస్తువుల కొనుగోలు కోసం ఇప్పటికీ రాజస్థాన్‌ వెళ్తానని చెబుతారు లోకేశ్‌.

కేవలం ఇందులోనే మార్పు
రత్నా కేఫ్‌ రాజేంద్ర గుప్తా నుంచి లోకేశ్‌ గుప్తా చేతిలోకి వచ్చాక, చిన్నమార్పు జరిగింది. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. ఇప్పుడు స్టీమ్‌ బాయిలర్స్‌లో తయారుచేస్తున్నాం. ఈ మార్పును వంటవారు అంగీకరిం^è లేదు. దానితో సంప్రదాయంగాను, కొత్త విధానంలోనూ సాంబారు తయారు చేశారు కొంతకాలం. కస్టమర్లకు మాత్రం రుచి చాలా బావుందని చెబుతుండటంతో, వంటవారు కొత్తవిధానానికి అంగీకరించారు.

నేను ఆర్కిటెక్ట్‌ని. ఎన్నడూ ఫుడ్‌ బిజినెస్‌లోకి వస్తాననుకోలేదు. అసలు నేను నిర్వహించగలననుకోలేదు. ఇక్కడ వారు చూపే ప్రేమ, వీరంతా మా కోసం పనిచేయడం చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. అయితే ఈ పని మాత్రం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. వారు మెచ్చుకున్నప్పుడు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే సమయంలో చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కేఫ్‌లో ఉత్తరాది వంటకాలను కూడా పరిచయం చేశాం. రైల్వే క్యాటరింగ్‌లోకి ప్రవేశించాం. ట్రిప్లికేన్‌లోనే ఉన్న పార్థసారథి దేవాలయానికి వచ్చినవారంతా రత్నా కేఫ్‌ని తప్పక దర్శించుకుని సాంబారు రుచి చూస్తారు.– లోకేశ్‌ గుప్తా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top